Saturday, May 4, 2024

బాగా ఆడినా తప్పని నిరాశ

- Advertisement -
- Advertisement -

RCB defeat in Eliminator match

కోహ్లికి కలిసిరాని అదృష్టం

దుబాయి: ఐపిఎల్ సీజన్14లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పోరాటం ఎలిమినేటర్ మ్యాచ్‌తోనే ముగిసిన విషయం తెలిసిందే. గతంలోఎన్నడూ లేని విధంగా ఈసారి లీగ్ దశలో బెంగళూరు అద్భుత ప్రదర్శన చేసింది. ఆరంభం నుంచే ప్లేఆఫ్ రేసులో తన స్థానాన్ని కాపాడుకుంటూ వచ్చింది. గతంతో పోల్చితే ఈ సీజన్‌లో విరాట్ కోహ్లి సేన అత్యంత నిలకడైన ప్రదర్శన చేసిందనే చెప్పాలి. రెండో అంచెలో కూడా మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకుంది. చివరి ఐదు మ్యాచుల్లో నాలుగింటిలో బెంగళూరు గెలిచిందంటే కోహ్లి టీమ్ ఆట ఏ స్థాయిలో ఉందో ఊహించుకోవచ్చు. ప్రతి సీజన్‌లో ఈసాలా కప్ నమ్‌దే(ఈసారి కప్ మాదే) అనే నినాదంతో బరిలోకి దిగడం బెంగళూరుకు అనవాయితీగా వస్తోంది. గత 14 సీజన్‌లుగా బెంగళూరు అభిమానులు ఈ నినాదాన్నే నమ్ముకుంటూ వస్తున్నారు. ప్రతిసారి భారీ ఆశలతో బరిలోకి దిగడం ఖాళీ చేతులతో వెనుదిరగడం చాలెంజర్స్ టీమ్‌కు అలవాటుగా మారింది. ఈసారి మాత్రం బెంగళూరు కచ్చితంగా కప్పు గెలుస్తుందనే నమ్మకంతో అభిమానులు ఉన్నారు. కోహ్లి సేన ఆట కూడా దీనికి తగినట్టుగానే సాగింది.

ఓపెనర్లు విరాట్ కోహ్లి, దేవ్‌దుత్ పడిక్కల్, మాక్స్‌వెల్, శ్రీకర్ భరత్ తదితరులు అత్యంత నిలకడైన బ్యాటింగ్‌తో బెంగళూరుకు అండగా నిలిచారు. లీగ్ దశలో బెంగళూరు మూడో స్థానంలో నిలిచిందంటే వీరి పాత్ర చాలా కీలకం. కోహ్లి, పడిక్కల్‌లు చాలా మ్యాచుల్లో బెంగళూరుకు మెరుగైన ఆరంభాన్ని ఇచ్చారు. మాక్స్‌వెల్, భరత్ కూడా తమవంతు పాత్ర పోషించడంతో చాలెంజర్స్ లీగ్ దశలో మంచి ప్రదర్శన చేసింది. బౌలింగ్‌లో కూడా బెంగళూరుకు తిరుగు లేకుండా పోయింది. హర్షల్ పటేల్, యజువేంద్ర చాహల్, మహ్మద్ సిరాజ్ తదితరులు నిలకడగా రాణించారు.

హర్షల్ పటేల్ అయితే ఏకంగా 33 వికెట్లు పడగొట్టి సంచలనం సృష్టించాడు. చాహల్ కూడా తన మార్క్ బౌలింగ్‌తో జట్టుకు అండగా నిలిచాడు. సిరాజ్ కూడా అంచనాలకు తగినట్టే ప్రదర్శన చేశాడు. ఇలా ఈ ముగ్గురు కూడా తమవంతు పాత్ర పోషించడంతో బెంగళూరు చాలా మ్యాచుల్లో అలవోక విజయాలు అందుకుంది. అయితే రెండో దశ మ్యాచుల్లో డివిలియర్స్ తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయడంలో విఫలమయ్యాడు. అతని వైఫల్యం జట్టును వెంటాడింది. కనీసం ఎలిమినేటర్ మ్యాచ్‌లోనైనా అతను తన బ్యాట్‌కు పనిచెబితే జట్టుకు ప్రయోజనంగా ఉండేది. పడిక్కల్, కోహ్లి, మాక్స్‌వెల్, ఆఖరి మ్యాచుల్లో భరత్ రాణించడంతోనే బెంగళూరు ప్లేఆఫ్‌కు చేరింది.

అందని ద్రాక్షగానే..

మరోవైపు బెంగళూరుకు సుదీర్ఘ కాలంగా కెప్టెన్‌గా వ్యవహరించిన విరాట్ కోహ్లికి ఐపిఎల్ ట్రోఫీ అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. ఈ సీజన్ తర్వాత కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్టు విరాట్ ఇప్పటికే ప్రకటించాడు. దీంతో ఈసారి బెంగళూరు కచ్చితంగా ఐపిఎల్ ట్రోఫీని సాధిస్తుందని అభిమానులు, విశ్లేషకులు అంచనా వేశారు. కానీ వారి అంచనాలను తారుమారు చేస్తూ బెంగళూరు ఎలిమినేటర్ దశలోనే ఇంటిదారి పట్టింది. దీంతో తన సారథ్యంలో చాలెంజర్స్‌కు ఐపిఎల్ ట్రోఫీని అందించాలని భావించిన కోహ్లికి నిరాశే మిగిలింది. వచ్చే సీజన్‌లో అతను బెంగళూరుకే ప్రాతినిథ్యం వహిస్తానని స్పష్టం చేశాడు. అయితే కెప్టెనీకి మాత్రం దూరంగా ఉంటానని ప్రకటించడంతో కోహ్లి ఐపిఎల్ కల నెరవేరలేదు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News