Friday, May 3, 2024

నేటి నుంచి వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్‌లు ప్రారంభం

- Advertisement -
- Advertisement -

సిఎం కెసిఆర్ ఆదేశాలతో చర్యలు చేపట్టిన సిఎస్
స్లాట్ బుకింగ్ ద్వారా రిజిస్ట్రేషన్‌లు

Registration start in Telangana

మనతెలంగాణ/హైదరాబాద్: నేటి నుంచి వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్‌లు ప్రారంభంకానున్నాయి. హైకోర్టు సూచనల మేరకు నేటి నుంచి రిజిస్ట్రేషన్‌లు ప్రారంభం అయ్యేలా చర్యలు చేపట్టాలని సిఎం కెసిఆర్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్‌కు గురువారం ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో స్లాట్ బుకింగ్ ద్వారా రిజిస్ట్రేషన్‌ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇదే విషయాన్ని ట్విట్టర్ వేదికగా మంత్రి కెటిఆర్ సైతం పేర్కొన్నారు.

92 రోజుల విరామం అనంతరం

ఎట్టకేలకు 92 రోజుల విరామం అనంతరం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో వ్యవసాయేతర ఆస్తులు ఇళ్లు, ప్లాట్లు, అపార్ట్‌మెంట్‌ల రిజిస్ట్రేషన్‌లకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ధరణి పోర్టల్ ద్వారా ఇప్పటికే వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్‌లను విజయవంతంగా నిర్వహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయేతర ఆస్తులను రిజిస్ట్రేషన్ చేయాలని భావించినా హైకోర్టు విధించిన స్టే మేరకు ఆ పద్ధతి ఆగిపోయింది. హైకోర్టు పాత విధానంలో రిజిస్ట్రేషన్‌లను చేసుకోవాలని గురువారం ప్రభుత్వానికి సూచించిన నేపథ్యంలో పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్‌లను చేయడానికి ప్రభుత్వం ముందుకొచ్చింది.

ఆస్తి పన్ను గుర్తింపు సంఖ్య కచ్చితంగా ఉండాలన్న నిబంధన

మూడునెలలుగా వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్‌లు ఆగిపోవడంతో ప్రభుత్వానికి నెలకు సుమారుగా రూ.500ల నుంచి రూ.600 కోట్ల నష్టం వాటిల్లిందని అధికారులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పాత పద్ధతి ద్వారా కార్డు (కంప్యూటర్ ఎయిడెడ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్) విధానం ద్వారా ప్రభుత్వం వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్‌లు చేయనుంది. నేటి నుంచి ప్రారంభం అయ్యే రిజిస్ట్రేషన్‌లను స్లాట్ బుకింగ్ విధానంతో పాటు కంప్యూటర్ ఆధారిత పద్ధతిలో రిజిస్ట్రేషన్‌లను చేసుకునేలా హైకోర్టు అనుమతిచ్చింది. దీంతోపాటు ఆస్తి రిజిస్ట్రేషన్‌లో భాగంగా ఆస్తి పన్ను గుర్తింపు సంఖ్య కచ్చితంగా ఉండాలన్న నిబంధనకు హైకోర్టు అంగీకారం తెలపడంతో ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టింది.

విధి, విధానాలపై రెండు రోజుల్లో స్పష్టత

ఆగష్టు 23వ తేదీన ప్రభుత్వం జారీ చేసిన సర్యులర్ అమల్లో ఉంటుందా లేదా, ఎల్‌ఆర్‌ఎస్ కట్టని ప్లాట్ల రిజిస్ట్రేషన్‌లు చేస్తారా లేదా అన్న విషయాలపై రెండు రోజుల్లో ప్రభుత్వం నుంచి స్పష్టత వచ్చే అవకాశం ఉందని స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటికే 15 రోజులుగా వ్యవసాయేతర ఆస్తులకు సంబంధించి రిజిస్ట్రేషన్‌లపై ధరణి పోర్టల్‌లో ట్రయల్ రన్ జరుగుతోంది. ఈ 15 రోజుల్లో తలెత్తిన పలు సాంకేతిక సమస్యలను టెక్నికల్ టీం ఎప్పటికప్పుడు పరిష్కరించింది. అయినా హైకోర్టు సూచనల మేరకు పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్‌లు నేటి నుంచి తిరిగి ప్రారంభ కానున్నాయి.

జిహెచ్‌ఎంసి పరిధిలో 20 లక్షల పైచిలుకు ఆస్తులు

వ్యవసాయేతర భూములకు (ఇళ్లు, అపార్ట్‌మెంట్‌లకు) సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 62 లక్షల పైచిలుకు ఆస్తులు ఉండగా జిహెచ్‌ఎంసి పరిధిలో 20 లక్షల పైచిలుకు ఆస్తులు ఉంటాయి. వీటిలో చాలావరకు ధరణి పోర్టల్‌లో నమోదు చేశారు. వీటితో పాటు ఎల్‌ఆర్‌ఎస్ కట్టాల్సిన సుమారు 29 లక్షల ఓపెన్‌ప్లాట్‌ల వివరాలను ఇంకా ధరణి పోర్టల్‌లో నమోదు చేయాల్సి ఉంది. ప్రస్తుతం కార్డు విధానం కింద వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్‌లను ప్రారంభించినా ఎల్‌ఆర్‌ఎస్ కట్టాల్సిన ఓపెన్ ప్లాట్‌లను రిజిస్ట్రేషన్ చేయవద్దని ప్రభుత్వం నుంచి సబ్ రిజిస్ట్రార్‌లకు ఆదేశాలు అందినట్టుగా సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News