Friday, May 3, 2024

ధరల అదుపు ఎప్పుడు?

- Advertisement -
- Advertisement -

ధరలను అదుపు చేయడం రిజర్వు బ్యాంకు కు సాధ్యమేనా అనే ప్రశ్నకు ఔను అని గట్టిగా సమాధానం చెప్పలేము. ధరలు చెట్టెక్కి కూచున్నాయంటే ద్రవ్యోల్బణం మితిమించిపోయిందని అర్థం. అలాగే ప్రజలకు అవసరమైన సరకులను దాచిపెట్టారనో, వాటి రవాణాకు అంతరాయం ఏర్పడిందనో అనుకోవాలి. సరకుల విలువకు మించి డబ్బు మార్కెట్‌లో వుంటే దానిని ద్రవ్యోల్బణం అంటారు. బ్యాంకులు ఇచ్చే రుణాలపై వడ్డీ రేట్లను పెంచుతూ పోడం ద్వారా ఈ ధన ప్రవాహానికి అడ్డుకట్ట వేయాలని రిజర్వు బ్యాంకు ప్రయత్నిస్తూ వుంటుంది. రిజర్వు బ్యాంకు నుంచి బ్యాంకులు తీసుకొనే రుణంపై అది వసూలు చేసే వడ్డీ రేటును రెపో రేటు అంటారు. 2022 మే నుంచి రిజర్వు బ్యాంకు ఈ రేటును అదే పనిగా పెంచుతూ వచ్చింది. అలా పెంచిన మొత్తం రెపో రేటు 250 బేసిస్ పాయింట్లకు చేరుకొన్నది. గత ఏప్రిల్‌లో జరిగిన ఈ ఏడాది మొట్టమొదటి ద్రవ్య విధాన కమిటీ భేటీలో రిజర్వు బ్యాంకు రెపో రేటును పెంచకుండా 6.5% వద్దనే వుంచింది.

మొన్న జూన్ 8న జరిగిన భేటీలో కూడా అదే నిర్ణయం తీసుకొన్నది. అయితే ఇంత కాలం, దాదాపు ఏడాది పాటు రెపో రేటును పెంచుతూ బ్యాంకుల రుణ వితరణను అదుపు చేసినందు వల్ల ధరలు ఏమైనా తగ్గుముఖం పట్టాయా? ఈ ప్రశ్నకు లేదని బల్లగుద్ది చెప్పవచ్చు. 2023 మార్చి నాటికి ముంబై కేంద్రంగా నమోదైన ఇళ్ల ధరల సూచీ అప్పటికి సంవత్సరం క్రితం కంటే 4.2% పెరిగింది. 2022 మార్చిలో అది 281.3 వద్ద వుండగా, మొన్న మార్చికి 293.3 కి చేరుకొన్నది. ఢిల్లీ కేంద్రంగా చూసుకొన్నప్పుడు ఈ పెరుగుదల 6.65 శాతంగా నమోదైంది. అలాగే కోచిలో ఈ పెరుగుదల 8.45 శాతానికి చేరుకొన్నది. ఇళ్ళ ధరలు ఈ విధంగా పెరిగాయంటే సరకుల ధరలు కూడా ఆ మేరకు మిన్నంటాయని బోధపడుతున్నది. సీజన్ల వారీగా సరకుల సరఫరాలో ఎదురయ్యే సమస్యలు ధరలను పెంచుతున్నాయని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి గత ఏప్రిల్‌లో ప్రకటించారు. సహజ వాయువు, క్రూడాయిల్ ధరలను తగ్గించడానికి ప్రయత్నిస్తున్నామని, అవి అంతర్జాతీయ మార్కెట్ మీద ఆధారపడి వుంటాయని ఆమె చెప్పారు.

ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే రష్యా నుంచి చవకగా అందుతున్న క్రూడాయిల్‌ను దేశంలో పెట్రోల్, డీజెల్ ధరలను తగ్గించడానికి ఎందుకు వినియోగించడం లేదు అనే ప్రశ్నకు ఆమె వద్ద బహుశా తగిన సమాధానం వుండదు. ఈ క్రూడాయిల్‌ను రిలయన్స్, తదితర ప్రైవేటు సంస్థలకు ఇచ్చి వాటి చేత శుద్ధి చేయించి యూరపు దేశాలకు ఎగుమతి చేయిస్తున్నారు. డీజెల్ అధిక ధర వల్ల మిగతా అన్ని సరకులూ ప్రియమైపోయి దేశంలో కోట్లాది మంది ప్రజలు నానా బాధలు పడుతుంటే రష్యా నుంచి తక్కువ ధరకు తెచ్చుకొంటున్న క్రూడాయిల్‌ను యూరపు అవసరాలకు శుద్ధి చేసి పంపించడంలోని సహేతుకత బోధపడనిది. హింసాయుత తిరుగుబాటుకు, జాతుల మధ్య ఘర్షణకు నిలయమైపోయిన మణిపూర్ రాజధాని ఇంఫాల్‌లో పెట్రోల్ ధర లీటరు రూ. 300 చేరుకొన్నది. ఏడు మాసాల తర్వాత కోల్‌కతాలో వంట గ్యాస్ సిలెండర్ ధర రూ. 50 పెరిగింది. పాట్నాలో కూడా అదే పరిస్థితి.

వంటగ్యాస్ దేశమంతటా సాధారణ ప్రజల మీద చెప్పనలవి కాని భారాన్ని మోపుతున్నది. కేంద్రంలో ఎన్‌డిఎ ప్రభుత్వం వచ్చిన తర్వాత ధరలు తగ్గి అక్కడ స్థిరంగా వున్న సందర్భం చెప్పుకోడానికి గట్టిగా ఒక్కటి కూడా లేదు. ధరలు అదే పనిగా పెరగడం వల్ల నికరాదాయ వర్గాల రాబడి విలువ పడిపోతుంది. భిన్న వర్గాల మధ్య ఆర్థిక అసమానతలు పెరుగుతాయి. ప్రభుత్వాలు ప్రజల మంచిని పట్టించుకోడం తగ్గిన తర్వాత దేశంలో జన జీవనం అస్థిరత్వానికి గురి కావడం పెరిగింది. చవక ధరల వ్యవస్థ నిర్వీర్యం కావడం పేదల జీవన వ్యయాన్ని పెంచింది. అలాగే విద్య, వైద్య రంగాలలో ప్రైవేటు గుత్తాధిపత్యం వికృత స్థాయికి చేరుకొన్నందు వల్ల సాధారణ ప్రజల బతుకులు అతలాకుతలం కావడం గరిష్ఠ స్థాయికి చేరిపోయింది. ఈ నేపథ్యంలో కార్పొరేట్, ప్రైవేటు రంగాలను పెంచి పోషించడమే లక్షంగా పని చేస్తున్న కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం బూటకపు ప్రకటనలతో కాలం వెళ్ళబుచ్చుతున్నది. యుపిఎ హయాంతో పోలిస్తే ఎన్‌డిఎ హయాంలో ధరలు విపరీతంగా పెరిగాయన్న వాస్తవాన్ని అంగీకరించకుండా వుండలేము.

ఈ తొలకరి ఇప్పటికే ఆలస్యమైంది. ముందు ముందు ఎల్‌నినో ప్రభావం వల్ల పంటలకు ఏమాత్రం హాని కలిగినా దాని ప్రభావం కూడా ధరలపై వుంటుంది. అందుచేత సంక్షేమ పంపకాలతో ప్రభుత్వాలు సరిపుచ్చితే ప్రజలకు నిజమైన మేలు జరిగే అవకాశాలు తగ్గిపోతాయి. ధరలను, ద్రవ్యోల్బణాన్ని అదుపులో పెట్టే బాధ్యతను కేవలం రిజర్వు బ్యాంకుకు వదిలిపెట్టి కేంద్రం చేతులు దులుపుకోడం వల్ల ప్రయోజనం శూన్యం. దేశంలో పుష్కలంగా అందుబాటులో వుండడానికి అవకాశమున్న వాటిని కూడా విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాలని కేంద్రం ఒక్కొక్కసారి కార్పొరేట్లను సంతృప్తి పరచడం కోసం నిర్ణయం తీసుకొంటూ వుంటుంది. అటువంటివి గోరుచుట్టు మీద రోకటి పోటు మాదిరి ప్రభావాన్ని చూపిస్తాయి. ప్రజల మేలును నిజంగా కోరుకొనే శక్తులు అధికారంలోకి వచ్చినప్పుడే ధరలు అదుపులో వుంటాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News