Sunday, April 28, 2024

వలసలు రివర్స్

- Advertisement -
- Advertisement -

 

సిఎం కెసిఆర్ భరోసాతో తిరిగి వస్తున్న కూలీలు

బీహార్ నుంచి ప్రత్యేక రైలులో లింగంపల్లికి చేరుకున్న 259 మంది
పుష్పగుచ్ఛాలతో అపూర్వ స్వాగతం పలికిన మంత్రి గంగుల, రైతుబంధు చైర్మన్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, పౌరసరఫరాల చైర్మన్ మారెడ్డి
రాష్ట్రానికి చేరుకున్న కార్మికులకు వెంటనే వైద్య పరీక్షలు, నిత్యావసరాల అందజేత
రాష్ట్ర ప్రభుత్వం చర్యలతో వలసదారుల్లో నూతనోత్తేజం

మనతెలంగాణ/హైదరాబాద్/ సిటీబ్యూరో/శేరిలింగంపల్లి : సిఎం కెసిఆర్ భరోసాతో వలస కార్మికులు రాష్ట్రంలో పని చేసేందుకు మొగ్గు చూపుతూ తమ తమ రాష్ట్రాల నుంచి తిరిగి వస్తున్నారు. వలస కార్మికుల సంక్షేమానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రత్యేక చొరవ తీసుకోవడంతో పాటు రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములంటూ, వారు కూడా తమ బిడ్డలేనని అక్కున చేర్చుకుంటుండడంతో వలస కూలీలు ఇక్కడకు రావడానికి సంసిద్ధత వ్యక్తం చేస్తున్నారు. లాక్‌డౌన్ ఈనెల 29 వరకు కొనసాగనున్నప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు రంగాలకు మినహాయింపులు ఇవ్వడంతో ఆయా రంగాల్లో పనిచేయడానికి వలస కూలీలు నగర బాట పడుతున్నారు. లాక్‌డౌన్ ఎత్తివేసే లోపు లక్షలాది మంది కార్మికులు వారి రాష్ట్రాల నుంచి తిరిగి తెలంగాణకు వస్తారని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. తొలివిడతగా బీహార్ రాష్ట్రానికి చెందిన 259 మంది వలస కార్మికులు హైదరాబాద్‌కు చేరుకోగా వారికి ప్రజాప్రతినిధులు, అధికారులు స్వాగతం పలకడంతో కార్మికులు ఆనందంలో మునిగిపోయారు.

హైదరాబాద్‌లో కరోనా వైరస్ రోజురోజుకు తగ్గుతుండడం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు కూడా వలసకూలీలు రాష్ట్రానికి తిరిగి రావడానికి దోహదపడుతున్నాయని అధికారులు పేర్కొంటున్నారు. బీహార్ రాష్ట్రంలోని ఖగారియా నుంచి ప్రత్యేక శ్రామిక్ ఎక్స్‌ప్రెస్ రైలులో 259 మంది వలసకార్మికులు శుక్రవారం నగర శివారులోని లింగంపల్లి స్టేషన్‌కు చేరుకున్నారు. వలస కూలీలకు పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, పౌర సరఫరాల చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, రైతుబందు చైర్మన్ పల్లా రాజేశ్వర్‌రెడ్డిలు పుష్పగుచ్చాలు అందజేసి ఘన స్వాగతం పలికారు.

శ్రామిక్ రైళ్లలో లింగంపల్లి రికార్డు

దేశంలోనే తొలి శ్రామిక్ రైలు లింగంపల్లి నుంచే బయలుదేరగా ఇతర రాష్ట్రాల వలస కార్మికుల తొలి రైలు కూడా ఇక్కడికే రావటం విశేషం. స్టేషన్ మేనేజర్ బుచ్చిరెడ్డి, కామెరిషల్ అధికారులు, ఆర్‌పిఎఫ్‌జిఆర్‌పి స్థానిక పోలీసులు, రెవెన్యూ, మెడికల్ సిబ్బంది 24గంటలు ఈ స్టేషన్‌లో ఉండి కార్మికులకు సేవలు అందిస్తున్నారు. ఇప్పటివరకు సుమారు 8 రైళ్లు దేశంలోని వివిధ ప్రాంతాలకి వెళ్లగా, మొత్తం 8వేల మంది వరకు ఇక్కడి నుంచే ప్రయాణించినట్లుగా అధికారులు పేర్కొంటున్నారు.

స్వయంగా పర్యవేక్షించిన అధికారులు

ఈ వలసకూలీల రాకను రాష్ట్ర ప్రభుత్వ నోడల్ అధికారి సందీప్ కుమార్ సుల్తానియా, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సైబరాబార్ పోలీసు కమిషనర్ వి.సి.సజ్జనార్‌లు స్వయంగా పర్యవేక్షించారు. నగరానికి చేరుకున్న ఈ కూలీలకు అధికారులు వెంటనే వైద్యపరీక్షలు నిర్వహించారు. ఆ వెంటనే వారికి అధికారులు భోజనం ప్యాకెట్లు మంచినీరు, మాస్కులు, శానిటైజర్లను అందజేశారు. అధికారులు కరోనా వైరస్ బారిన పడకుండా తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలను వివరించారు. ఈ కూలీలను వారు కోరుకున్న ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ దళాలు పోలీసులతో ఏర్పాటు చేసిన ప్రత్యేక బందోబస్తు మధ్య కూలీలను గమ్యస్థానాలకు చేర్చారు.

కరీంనగర్, కామారెడ్డి జగిత్యాల, పెద్దపల్లి సుల్తానాబాద్‌లకు 129 మందిని, మంచిర్యాల, కాగజ్‌నగర్‌కు 25 మందిని సిద్దిపేటకు మరో 20 మందిని, నల్లగొండకు 60 మందిని, మిర్యాలగూడకు 25 మంది కూలీలను పంపించారు. ఈ కార్యక్రమంలో రాజేంద్రనగర్ ఆర్‌డిఓ చంద్రకళ తదితరులు పాల్గొన్నారు. వలస కూలీలకు ప్రభుత్వం అన్నివిధాలుగా ఆదుకుంటుందని మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో వివిధ జిల్లాలోని రైస్‌మిల్లులో పని చేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున కూలీలు వస్తున్నారని మంత్రి తెలిపారు. లాక్‌డౌన్, కరోనా వైరస్ నియంత్రణ చర్యలను సమర్థవంతంగా చేపట్టడమే కాకుండా వలస కార్మికులకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాల వల్ల వలస కూలీల రాక ప్రారంభమయ్యిందన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News