Friday, May 3, 2024

వరికోతలకు ఇబ్బందేం లేదు

- Advertisement -
- Advertisement -

janardan reddy

 

రాష్ట్రంలో అందుబాటులో 14,095 హార్వెస్టర్లు
మొబైల్ రైతుబజార్ల నిర్వహణపై కేంద్రం ప్రశంసలు
ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న వ్యవసాయ కార్యదర్శి జనార్ధన్ రెడ్డి

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో 14,095 హార్వెస్టర్లు (వరికోత మిషన్లు) అందుబాటులో ఉన్నాయని వ్యవసాయ శాఖ కార్యదర్శి డాక్టర్ బి. జనార్ధన్ రెడ్డి తెలిపారు. తమిళనాడు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 753 వరికోత యంత్రాలు సూర్యాపేట, కామారెడ్డి, ఖమ్మం, ఇతర జిల్లాల్లో అందుబాటులో ఉన్నట్లు పేర్కొన్నారు. సగటున రోజుకు 1.50 లక్షల ఎకరాల్లో కోత అవుతుందని, 40 నుంచి 50 రోజుల్లో కోత పూర్తి చేయవచ్చునన్నారు. రబీలో 17 లక్షల ఎకరాల సాధారణ విస్తీర్ణానికి గాను 39 లక్షల ఎకరాలలో వరి సాగైంది. దీంతో సిఎం కెసిఆర్ ఆదేశాలకు అనుగుణంగా కోతకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నట్ల జనార్ధన్ రెడ్డి తెలిపారు. వాస్తవానికి ముందు ఉన్న రికార్డుల ప్రకారం 5 వేల హార్వెస్టర్ల వివరాలే ఉన్నాయని, అయితే తాజాగా తెప్పించుకున్న సమాచారంతో 14 వేల హార్వెస్టర్లు ఉన్నట్లు తేలడంతో ఇబ్బందేం లేదని తెలిసిందన్నారు.

హార్వెస్టర్లకు సాంకేతికంగా ఏమైనా ఇబ్బందుతు తలెత్తితే వాటిని పరిష్కరించడంతో పాటు అవసరమైన యంత్ర సామాగ్రిని అందుబాటులో ఉంచేందుకు కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేసే ప్రతిపాదనను ఉన్నట్లు చెప్పారు. హార్వెస్టర్ల విడిభాగాలు, సర్వీసింగ్ కేంద్రాలకు లాక్‌డౌన్ వ్యవధిలో తెరవడానికి అనుమతి ఇచ్చినట్లు వివరించారు. ఇదిలా ఉండగా రైతు బజార్లు, మార్కెట్లకు వచ్చే రైతులకు, సిబ్బందికి, వినియోగదారులకు అవసరమైన రూ.2.50 లక్షల విలువైన వెయ్యి శానిటైజర్స్‌ను సప్తగిరి లాబరేటరిస్ మేనేజింగ్ డైరెక్టర్ శిల్పారెడ్డి, ఛైర్మెన్ మహేశ్ రెడ్డి వ్యవసాయ కార్యదర్శికి అందజేశారు.

రైతుతో ఫోన్‌లో మాట్లాడిన కార్యదర్శి
క్షేత్రస్థాయిలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని పరిష్కరించేందకు వ్యవసాయ శాఖ కార్యదర్శి నేరుగా రైతులకే ఫోన్ చేసి మాట్లాడుతున్నారు. లాక్‌డౌన్ నేపధ్యంలో వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలుసుకుంటూ ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నారు. ఆదివారం నల్లగొండ జిల్లాకు చెందిన సాయిరెడ్డి రైతుకు ఫోన్ చేసి పంట ఉత్పత్తుల మార్కెటింగ్, మొబైల్ రైతుబజార్ల ఏర్పాటు గురించి వివరించారు. మొబైల్ రైతుబజార్లతో దాదాపు 400 ప్రాంతాల్లో కూరగాయలు, పండ్లను అందుబాటులోకి తీసుకురావడంపై కేంద్ర ప్రభుత్వం కూడా తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను మెచ్చుకుందని జనార్ధన్ రెడ్డి మన తెలంగాణతో వ్యాఖ్యానించారు.

 

Rice harvesting missions are available
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News