Sunday, April 28, 2024

గూడు చెదిరె.. కూడు పాయె

- Advertisement -
- Advertisement -

వరుణుడు శాంతించినా వరద గుప్పిట్లోనే కాలనీలు, బస్తీలు

ఇళ్లల్లో వరదనీటిలోనే జనం జాగారం..తడిసి ముద్దైన సామాన్లు, నిత్యావసరాలు
పడవల సాయంతో ముప్పు ప్రాంతాల్లోని ప్రజలకు భోజనం, పాలు సరఫరా
ఇంజాపూర్ వాగులో ఇద్దరు యువకుల మృతదేహాలు లభ్యం
వరద నీటిలో వ్యాపార సముదాయాలు, చెరువుల్లోకి కొనసాగుతున్న ప్రవాహం
మూసీకి తగ్గిన వరద, సహాయక చర్యలు ముమ్మరం, దారుణంగా దెబ్బతిన్న రహదారులు
జిల్లాల్లో నీటిలోనే పంట పొలాలు, పెట్టుబడి వచ్చే పరిస్థితి లేదని అన్నదాతల ఆక్రందన

మన తెలంగాణ/హైదరాబాద్: కుండపోతగా కురిసిన వర్షానికి భాగ్యనగర్‌తో సహా రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో వరద ఉద్ధృతి కొనసాగుతోంది. జనజీవనం అస్తవ్యస్థమైంది. లోతట్టు ప్రాంతాలు ఇంకా జలదిగ్భందంలోనే చిక్కుకున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు, కుంటలు కట్టలు తెగి రహదారులతో పాటు. సమీప ప్రాంతాలను ముంచెత్తుతున్నాయి. వరద తాకిడికి రాష్ట్ర వ్యాప్తంగా రహదారులు దెబ్బతిన్నాయి. ఇక చేతికంది వచ్చిన పంటలు నీట మునిగి రైతన్నలు కన్నీరుమున్నీ రవుతున్నారు. లక్షలాది ఎకరాల్లో పంట నష్టం సంభవించింది. వరి, పత్తితో పాటు పెసర, మిరప, వేరుశనగ, మొక్కజొన్న పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. అందివచ్చిన పంట వర్షార్పణం కావడంతో అన్నదాతల ఆవేదన అంతా ఇంతా కాదు. ప్రధానంగా వరి, పత్తి పంట దెబ్బతింది. ఆయా పంట పొలాలన్నీ నేటికి నీటి ప్రవాహంలోనే చిక్కుకుని ఉండటం గమనార్హం. దీంతో పంట రాబడి ఎలాగూ ఉండదు కాబట్టి పెట్టిన పెట్టుబడి కూడా తిరిగి వచ్చే పరిస్థితి ఉండదని జిల్లాల్లో ఏ అన్నదాతను కదిలించినా వినవస్తోంది. ఇంకొవైపు రహదారులపై భారీ స్థాయిలో మహావృక్షాలు నేలకొరిగిన దృష్టా పలు రహదారులు అధ్వాన్నంగా మారాయి. కొన్ని రహదారులు కోతకు గురయ్యారు. దీంతో ఆయా ప్రాంతాలలో రాకపోకలకు అంతరాయ మేర్పడుతోంది. భాగ్యనగరంలో కన్నీటి తడి ఆగడం లేదు. వరుణుడు శాంతించినా కాలనీల్లో వరదనీరు కొనసాగుతోంది. నాలాలు, డ్రైనేజీలు పెద్ద ఎత్తున పొంగిపొర్లుతున్నాయి. చిన్ని చిన్న ఇళ్లు, అపార్టుమెంట్లు, సొంతంగా ఉన్న ఇళ్లల్లోకి కూడా వరద నీరు చేరి ఇబ్బందులు పడుతున్నారు. ఇళ్లల్లో నీళ్లతోనే హైదరాబాద్ వాసులు కాలం గడుపుతున్నారు. ఇంట్లోని సామాన్లన్నీ తడిసి ఎందుకు పనికి రాకుండా పోయాయి.

ఇంకా పలు కాలనీల్లో ప్రస్తుతం ఆరు నుంచి ఏడు అడుగుల మేర నీళ్లు చేరి పరిస్థితి వర్ణనాతీతంగా ఉంది. దాంతో ఎవ్వరూ బయటకు రాలేని పరిస్థితి ఉత్పన్నమైంది. జనాలు ఇళ్లల్లోని నీరు ఎత్తిపోయడం సాధ్యం కాక అక్కడ ఉండలేక మేడ మీదకు చేరుకుని అక్కడ కాలం గడుపుతున్నారు. వరుణుడు శాంతించినప్పటికీ పలు ప్రాంతాల్లో వరద ఉద్ధృతి కారణంగా ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. మైలార్‌దేవ్‌పల్లి ఆలీనగర్‌లో లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా ఒకే కుటుంబానికి చెందిన 8 మంది గల్లంతయ్యారు. పల్లె చెరువుకు భారీగా వరదనీరు చేరుతుండగా దిగువకు నీరు విడుదల చేస్తున్నారు. ఫలితంగా ఆలీనగర్ లోతట్టు ప్రాంతాల ఇళ్లల్లోకి నీరు చేరింది. పల్లె చెరువు దిగువ ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలంటూ మైకుల ద్వారా ప్రచారం కావిస్తున్నారు. చాంద్రాయణగుట్ట అల్ జుబైల్ కాలనీ ఇంకా జలదిగ్భంధంలోనే ఉండగా సహాయక బృందాలు పడవ సాయంతో ప్రజలకు బయటకు తెస్తున్నారు. ఇళ్లల్లో ఉన్నవారికి భోజనాలు, పాలు అందిస్తున్నారు. ఫలక్‌నుమా నుంచి చాంద్రాయణగుట్ట వెళ్లే రహదారిని అధికారులు గురువారం కూడా మూసివేశారు. భారీ వర్షాలు, వరదల కారణంగా గగన్ పహాడ్ వద్ద జాతీయ రహదారిపై రాకపోకల నిలిచివేత కొనసాగుతోంది. మట్టిలో పలు వాహానలు కూరుకుపోగా సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. కొన్ని కార్లు, బస్సులను బయటకు తీశారు. భారీ వర్షంతో జూబ్లీహిల్స్ కార్మికనగర్‌లో ఓ ఇల్లు కూలింది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడం వల్ల ప్రాణాపాయం తప్పింది. సైదాబాద్ పరిధిలోని సింగరేణి పార్కు వద్ద వరదనీటిలో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. ఘటనాస్థలికి పోలీసులు చేరుకుని జేసీబీ సాయంతో బయటకు తీశారు. టోలిచౌకిలోని నదీమ్ కాలనీ జలదిగ్భందంలో చిక్కుకోగా మనిషి లోతు వరకు నీరు నిలిచిపోయింది. జీహెచ్‌ఎంసీ, ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది ప్రజలను సురక్షిత ప్రాంతలకు తరలిస్తున్నారు. భారీ వర్షాల కారణంగా మణికొండలోని ప్రధాన కాలనీలన్నీ జలమయమయ్యాయి. భగీరథ చెరువు నుంచి వస్తున్న వరదతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పాలవుతున్నారు.

Roads damaged in Hyderabad due to Heavy Floods

మణికొండనార్సింగి ప్రధాన రహదారిపై రాకపోకలు స్తంభించాయి. రోడ్డుపై ఉన్న నీటిని దిగువకు పంపగా కింద ఉన్న అపార్ట్‌మెంట్ మొదట అంతస్తు వరకూ నీరు చేరింది. షేక్‌పేటలో కలవాల్సిన నాలా మూసుకుపోవడం వల్ల ఇబ్బందు లేర్పడ్డాయి. త్వరలోనే సమస్య పరిష్కరిస్తామని కమిషనర్ తెలిపారు. మూడు రోజులుగా కురుస్తున్న వర్షానికి సికింద్రాబాద్ కంటోన్మెంట్ న్యూబోయినపల్లిలో ఇళ్లలోకి వరద నీరు చేరింది. నిత్యావసర సరుకులు పూర్తిగా తడిసిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరబాద్ శివారులోని ఇంజాపూర్ వద్ద వాగులో ఇద్దరు యువకుల మృతదేహాలు లభ్యమయ్యాయి. రెండ్రోజుల క్రితం పానిపూరి తినేందుకు వెళ్లి గల్లంతైన ప్రణయ్, జయదేవ్ తుర్కయాంజిల్ చెరువు ప్రవాహంలో కొట్టుకుపోయారు. వాగులోంచి యువకుల మృతదేహాలను వెలికితీశారు.
తిరగబడ్డ బోటు.. రక్షించిన సహాయక సిబ్బంది…
హైదరాబాద్ టోలీచౌక్ విరాసత్‌నగర్‌లో సహాయక చర్యల్లో అనుకోని సంఘటన చోటు చేసుకుంది. వరదలో చిక్కుకున్న బాధితుల్ని తరలించే బోటు ఉన్నట్టుండి తిరగబడింది. అపార్టుమెంట్‌లో ఉన్నవారిని ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది బోటులో కూర్చొబెట్టి బయలుదేరుతున్న సమయంలో బరువు ఎక్కువై బోటు తిరగబడింది. ఊహించని పరిణామంతో అంతా ఉలిక్కిపడ్డారు. చిట్టచివరకు సహాయక సిబ్బంది బాధితుల్ని రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
వ్యాపార సముదాయాలను నిండా ముంచిన భారీ వర్షం
హైదరాబాద్‌లో కుండపోత వర్షం బేగంబజార్‌లోని వ్యాపార సముదాయాలను ముంచెత్తింది. దుకణాల్లోకి భారీ వరద నీరు చేరడంతో వ్యాపారస్తులు తీవ్రంగా నష్టపోయారు. నగరంలోని అత్యంత రద్దీ వ్యాపార కేంద్రంగా పేరొందిన బేగం బజార్ మురికి కూపాన్ని తలపిస్తోంది. పధన్వాడీఖాన్ మార్కెట్‌లో సెల్లార్‌లోకి వరదనీరు రావడంతో వస్తువులన్నీ నీట మునిగాయి. అధికారులు ఎన్ని హామీలిచ్చినా డ్రైనేజీ వ్యవస్థకు శాశ్వత పరిష్కారం చూపడం లేదంటూ వ్యాపారులు వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలని స్థానిక వ్యాపారస్తులు కోరుతున్నారు.
ఫాక్స్‌నగర్ చెరువుకు కొనసాగుతున్న వరద.. భయం గుప్పిట్లో ప్రజలు…
హైదరాబాద్ జీడిమెట్ల ఫాక్స్‌సాగర్ చెరువుకు వరద ఉద్ధృత ఇంకా కొనసాగుతూనే ఉంది. చెరువు పూర్తిస్థాయి నీటి మట్టం 37 అడుగులు కాగా ప్రస్తుతం 33 అడుగులకు చేరుకుంది. మరో నాలుగు అడుగులు చేరితే చెరువు కట్టపై నుంచి నీరు ప్రవహించే ప్రమాదం ఉంది. దిగువన ఉన్న సుభాష్ నగర్, జీడిమెట్ల, కుత్బుల్లాపూర్, షాపూర్‌నగర్ ప్రాంతాల్లో నివసించే వారికి ప్రమాదం పొంచి ఉంది. మత్సకారులు ఏర్పాటు చేసుకున్న గుడిసెలు పూర్తిగా నీటిలో మునిగిపోయాయి. వారి సామాగ్రి తడిసి ముద్దయింది. తాత్కాలికంగా వారు చెరువు కట్టపై గుడిసెలు ఏర్పాటు చేసుకున్నారు. భారీ వర్షాలకు డ్రైనేజీ నీరు పొంగి ఎగువ నుంచి వచ్చిన నీరు చెరువులో కలుస్తున్నాయి. జీడిమెట్లలోని పరిశ్రమల రసాయనాలు ఇందులో కలుస్తున్నాయి. వీటివల్ల చెరువులోని చేపలు మృత్యువాత పడుతున్నాయి. చెరువు నిండడం వల్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ప్రజా ప్రతినిధులు, అధికారులు సూచిస్తున్నారు.
కోతకు గురైన పల్లె చెరువు కట్ట.. బాలాపూర్‌లో గుర్రం చెరువుకు గండి…
రంగారెడ్డి జల్లా మైలార్‌దేవ్‌పల్లిలోని చెరువు కట్ట కోతకు గురైంది. ఎగువనున్న జల్‌పల్లి, నవాబు చెరువుల నుంచి భారీగా వరదనీరు చెరువులోకి రావడంతో కట్ట దెబ్బతిని మట్టి కుంగిపోవడంతో దిగువనున్న ఆలీనగర్, ఆశామాబాద్ సహా పాతబస్తీలోని పలు కాలనీలు నీట మునిగాయి. కట్ట పూర్తిగా తెగిపోయే ప్రమాదం ఉండటంతో అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం, కాలనీ వాసులను సురక్షిత ప్రాంతలకు తరలించింది. కలెక్టర్ అమయ్‌కుమార్ సైబరాబాద్ సీపి సజ్జనార్, ఎంపి రంజిత్‌రెడ్డి, స్థానిక ఎంఎల్‌ఎ ప్రకాశ్‌గౌడ్ పల్లె చెరువు వద్దకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. సంబంధిత అధికారులతో చర్చించి మరమ్మతు పనులు చేపట్టాలని ఆదేశించారు. నీటిపారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రజత్‌కుమార్ కట్టను పరిశీలించారు. వరద ఎక్కువ కావడంతో కోతకు గురైందని, 12 గంటల్లో మరమ్మతు పనులు పూర్తి చేయిస్తామని తెలిపారు. దిగువ ప్రాంత ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని సిపి సజ్జనార్ సూచించారు. మరోవైపు బాలాపూర్‌లో గుర్రం చెరువుకు గండిపడింది. ఆ చెరువు కట్ట తెగపోయే ప్రమాదం ఉండటంతో స్థానిక ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.
మూసీనదికి తగ్గిన వరద .. సహాయక చర్యలు ముమ్మరం…
ఎడతెరపి లేకుండా కురిసిన భారీ వర్షంతో వరద తాకిడికి గురైన మూసీ నది ప్రవాహం మెల్లగా తగ్గుతోంది. వరద ప్రవాహం తగ్గడంతో అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు. కుండపోత వర్షంతో మూసీనదికి వరద కొంత తగ్గడంతో అంబర్‌పేటలోని మూసారాంబాగ్ వంతెనపై వరద ప్రవాహం తగ్గింది. వంతెన తేలడంతో అధికారులు సహాయక చర్యలను వేగవంతం కావించారు. చర్యలను వేగవంతం చేసి రాకపోకలకు ఇబ్బంది కలుగకుండా చేయాలని అధికారులను మేయర్ బొంతు రామ్మోహన్ ఆదేశించారు.
పశు వైద్యాధికారులను అప్రమత్తం చేసిన ప్రభుత్వం
రాష్టవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండటంతో పశువైద్యాధికారులను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున అందుబాటులో ఉండాలని స్పష్టం చేసింది. అన్ని ప్రభుత్వ వైద్యశాలల్లో టీకా మందులు అందుబాటులో ఉన్నాయని పశుసంవర్థక శాఖ సంచాలకులు డాక్టర్ వంగాల లకా్ష్మరెడ్డి అన్నారు. అత్యవసర సేవలకు టోల్ ఫ్రీ నెంబర్ 1962 ఏర్పాటు చేశామన్నారు. సంచార వైద్యశాలలను రైతులు వినియోగించుకోవాలన్నారు. గ్రామాల పరిధిలో పశువైద్యాధికారులు సకాలంలో స్పందించాలని ఆయన సూచించారు. ప్రస్తుతం రాష్ట్రంలో వరదల కారణంగా పలు జిల్లాల్లో 60 గేదెలు, 246 గొర్రెలు, 35 మేకలు, 10,700 కోళ్లు మృత్యువాత ప్డాయని వెల్లడించారు. త్వరలోనే అన్ని జిల్లాల నుంచి పూర్తి స్థాయిలో సమాచారం సేకరించి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామని పశు సంవర్ధక శాఖ సంచాలకులు పేర్కొన్నారు.

Roads damaged in Hyderabad due to Heavy Floods

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News