Monday, April 29, 2024

తాగు నీటి విషయంలో ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలి

- Advertisement -
- Advertisement -

తాగు నీటి విషయంలో ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలి
కాచి వడపోసిన నీటినే తాగాలి, పారిశుద్ధ కార్యక్రమాలకు మరింత ప్రాధాన్యత
రోగాలు ప్రబలకుండా వైద్య సేవలను మరింత విస్తృతం
ముంపుగురైన ప్రాంతాల్లో జరుగుతున్న వరదనీటి సహాయక చర్యలపై మంత్రి కెటిఆర్ సమీక్ష
హాజరైన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, జిహెచ్‌ఎంసి అధికారులు

మన తెలంగాణ/హైదరాబాద్: వరద ప్రభావం నుంచి బయటకు వచ్చిన ప్రజలు తాగునీటి విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ విజ్ఞప్తి చేశారు. కాచి వడపోసిన నీటిని మాత్రమే తాగాలని సూచించారు. ప్రస్తుతం వర్షపు నీరు వెళ్లిపోయిన కాలనీల్లో వ్యాధులు ప్రబలే అవకాశమున్న నేపథ్యంలో ఇళ్లలో పారిశుద్ధ్యానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఆ దిశగా జిహెచ్‌ఎంసి ఆధ్వర్యంలో డిజాస్టర్ మేనేజ్‌మెంట్ డిపార్టుమెంట్ ఆధ్వర్యంలో పెద్దఎత్తున పారిశుద్ధ కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు.
గురువారం హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని ప్రధాన పట్టణాల్లో వర్షాల వల్ల ఏర్పడిన పరిస్థితులపైన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, జిహెచ్‌ఎంసి అధికారులతో కలిసి మంత్రి కెటిఆర్ సమీక్షించారు. ప్రస్తుతం హైదరాబాద్ లో పలుచోట్ల ఇంకా నీరు నిల్వ ఉన్న కాలనీల్లో సహాయక చర్యలు పెద్దఎత్తున కొనసాగుతున్నాయని మంత్రి కెటిఆర్‌కు సిఎస్ తెలిపారు. కాగా వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎలాంటి వ్యాధులు ప్రబలకుండా అవసరమైన ముందస్తూ చర్యలు చేపట్టాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. ముంపుకు గురైన ప్రాంతాల ప్రజలకు రాష్ట్ర ప్రభుతవం అన్ని విధాలుగా అండగా ఉంటుందని ఆయన మరోసారి స్పష్టం చేశారు. ఆ దిశగా పలు కార్యక్రమాలు చేపడుతున్నట్లు మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. వరద నీటిలో ఉన్న కాలనీలు, ప్రాంతాలు, బస్తీల్లో జిహెచ్‌ఎంసి సెంటర్లలో 104 వాహనాల ద్వారా తక్షణం వైద్య సహాయం అందించాలని ఆదేశించారు. ఇందుకు అవసరమైన వైద్య సిబ్బంది, పారామెడికల్ సిబ్బందిని అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలని మంత్రి కెటిఆర్ సూచించారు. రెండు రోజుల నుంచి నుంచి నగర వ్యాప్తంగా సుమారు 50 వేల మందికి ఆహార పొట్లాలను పంపిణీ చేశామని అధికారులు ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ దృష్టికి తీసుకొచ్చారు.

గురువారం కూడా ప్రజలకు అక్షయపాత్ర సహాయంతో రూ.5ల భోజనం, ఉచిత ఆహార పొట్లాల పంపిణీ కార్యక్రమం కొనసాగుతుందని అధికారులు తెలిపారు. నగరంలో వరద ప్రభావం అంచనా వేసేందుకు వివిధ శాఖల సమన్వయంతో జిహెచ్‌ఎంసి అధికారులు కలిసి పనిచేయాలని మంత్రి కెటిఆర్ సూచించారు. అలాగే పాతభవనాలు, అపార్టుమెంట్ సెల్లార్లు, నిర్మాణంలో ఉన్న భవనాల వద్ద నీటిని తొలగించే క్రమంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. చెరువుల వద్ద ముందస్తు చర్యలకు సాగునీటి శాఖ అధికారుల సహాయం తీసుకోవాలని ఆదేశించారు. కాగా, హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని ఇతర పట్టణాల్లో వర్షాలవల్ల ఎదురైన పరిస్థితులపైన సమీక్షించేందుకు వీలుగా సిడిఎంఎ, పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్‌తో కలిసి ఒక నివేదిక సమర్పించాలని ఈ సందర్భంగా అధికారులకు మంత్రి కెటిఆర్ ఆదేశించారు.

రెండవ రోజు కొనసాగిన మంత్రి కెటిఆర్ పర్యటన
నగరంలో కురిసిన భారీ వర్షాలకు ఇబ్బందులు ఎదుర్కొంటున్న పలు కాలనీల్లో రెండవ రోజు కూడా మంత్రి కెటిఆర్ పర్య టించారు. ఇందులో భాగంగా ముషీరాబాద్ నియోజకవర్గం శాసనసభ్యుడు ముఠాగోపాల్‌తో కలిసి నల్లకుంట శ్రీరామ్‌నగర్ బస్తీలో నీట మునిగిన ఇళ్లను ఆయన పరిశీలించారు. అలాగే, అంబర్‌పేట్ నియోజకవర్గంలో శాసనసభ్యుడు కాలేరు వెంకటేశ్‌తో కలిసి ప్రేమ్‌నగర్, పటేల్ నగర్ కాలనీలను ఆయన సందర్శించారు. ఆయా కాలనీల్లో వరద నివారణ కోసం శాశ్వత ప్రాతిపదికన తీసుకోవాల్సిన పనులకు సంబంధించిన పనులను వెంటనే అనుమతులు జారీ చేస్తున్నట్లు ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ తెలిపారు. అలాగే భవిష్యత్తుల్లో ఆయా ప్రాంతాల్లో వరద రాకుండా చేపట్టాల్సిన పైపులైన్లు, డ్రైనేజీ నిర్మాణానికి సంబంధించి వెంటనే ప్రతిపాదనలు సమర్పించాలని జోనల్ కమిషనర్‌ను ఆదేశించారు.

KTR Review on Floods with GHMC Officials

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News