Saturday, April 27, 2024

పెగాసస్ హ్యాకింగ్ కేసులో రెండో అఫిడవిట్‌కు కేంద్రానికి మరింత సమయం

- Advertisement -
- Advertisement -
SC grants more time to Centre for filing response
 విచారణ 13కు వాయిదా వేసిన సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ: పెగాసస్ హ్యాకింగ్ ఆరోపణల కేసులో రెండో అఫిడవిట్ సమర్పించేందుకు కేంద్రానికి సుప్రీంకోర్టు మరికొంత సమయమిచ్చింది. దీనిపై మంగళవారం విచారించిన చీఫ్ జస్టిస్ ఎన్‌వి రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం తదుపరి విచారణను సెప్టెంబర్ 13కు వాయిదా వేస్తున్నట్టు తెలిపింది. ఇజ్రాయెల్‌కు చెందిన సాంకేతిక సంస్థ రూపొందించిన స్పైవేర్‌ను ఉపయోగించి ప్రముఖుల ఫోన్లపై నిఘా పెట్టారని, దీనిపై నిగ్గు తేల్చేందుకు స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించాలని సుప్రీంకోర్టులో 12 పిటిషన్లు దాఖలైన విషయం తెలిసిందే. ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా, సీనియర్ జర్నలిస్ట్ ఎన్.రామ్‌సహా పలువురు ప్రముఖులు ఈ పిటిషన్లు వేశారు. గత నెలలో జరిగిన విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ముందు కేంద్రం రెండు పేజీల అఫిడవిట్‌ను దాఖలు చేసింది. దాంతో సంతృప్తి చెందని సుప్రీం ధర్మాసనం కేంద్రం నుంచి మరింత వివరణ కోరుతూ ఆగస్టు 17న ఆదేశించింది.

తాజా విచారణలో కేంద్రం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్‌మెహతా తమకు మరింత సమయం కావాలని కోరారు. సంబంధిత అధికారులతో సంప్రదించి రెండో అఫిడవిట్ దాఖలు చేయడంలో ఇబ్బందులు తలెత్తినందున సమయం కావాలని మెహతా కోర్టును అభ్యర్థించారు. ఎన్.రామ్ తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది కపిల్‌సిబల్ సమయం ఇవ్వడానికి తనకు అభ్యంతరం లేదని తెలపడంతో విచారణను సోమవారానికి వాయిదా వేస్తున్నట్టు ధర్మాసనం తెలిపింది. గత అఫిడవిట్‌లో కేంద్రం తన వాదనగా ఊహాగానాలు, ఆధారరహిత మీడియా కథనాల ఆధారంగా స్వతంత్ర దర్యాప్తును కోరడమేమిటంటూ పిటిషన్‌దారులను తప్పు పట్టింది. దీనిపై తమ సమాచారశాఖమంత్రి అశ్వినీవైష్ణవ్ ఇప్పటికే పార్లమెంట్‌లో వివరణ ఇచ్చారని గుర్తు చేసింది. ఇజ్రాయెల్ కంపెనీకి చెందిన స్పైవేర్‌ను ఉపయోగించి ప్రముఖుల ఫోన్లపై నిఘా పెట్టినట్టు కేంద్రంపై ప్రతిపక్షాలుసహా పలువురు ఆరోపించారు. స్పైవేర్ నిఘా జాబితాలో భారత్‌కు చెందిన 300మంది ప్రముఖులున్నట్టు వెల్లడైన కథనాలతో పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో దుమారం రేగిన విషయం తెలిసిందే. ప్రముఖుల స్మార్ట్‌ఫోన్లను హ్యాక్ చేయడానికి ఇజ్రాయెల్ స్పైవేర్‌ను కేంద్రం వినియోగించినట్టు ప్రతిపక్షాల నుంచి అనుమానాలు వ్యక్తమయ్యాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News