న్యూఢిల్లీ: మహిళలు, పురుషుల విషయంలో వివాహ కనీస వయసు ఒకే విధంగా ఉండాలని వేసిన పిటిషన్లన్నీ తమకు బదిలీ చేసే విషయాన్ని పరిశీలించాలని కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీస్ జారీ చేసింది. రాజస్థాన్, ఢిల్లీ హైకోర్టుల్లో ఇప్పటికే ఇదే అంశంపై ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు(పిల్‌లు) దాఖలైన నేపథ్యంలో బదిలీకి ఆదేశాలివ్వాలని కోరుతూ బిజెపి నేత అశ్వినీఉపాధ్యాయ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన చీఫ్ జస్టిస్ ఎస్‌ఎ బోబ్డే నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం మంగళవారం కేంద్రానికి నోటీస్ జారీ చేసింది. వివాహ కనీస వయసు, విడాకులు, దత్తతలాంటి అంశాల్లో లింగ సమానత్వం, మహిళల హుందాతనాన్ని కాపాడాలని కోరుతూ ఈ పిటిషన్లు దాఖలయ్యాయి. ప్రస్తుతం పలు మతాలకు సంబంధించిన ప్రత్యేక చట్టాల ప్రకారం మహిళలకు వివాహ కనీస వయసును 18ఏళ్లుగా, పురుషులకు 21 ఏళ్లుగా నిర్ణయించారు. అయితే, ఎవరికైనా ఇది సమానంగా ఉండాలని పిటిషనర్లు కోరుతున్నారు.