Friday, April 26, 2024

స్కాట్లాండ్‌కు రెండో గెలుపు

- Advertisement -
- Advertisement -

Scotland won match by 17 runs against Papua New Guinea

బెర్రింగ్టన్ మెరుపులు, రాణించిన బౌలర్లు, పపువా న్యూగినియాకు మరో ఓటమి

మస్కట్: ట్వంటీ20 ప్రపంచకప్ అర్హత మ్యాచుల్లో స్కాట్లాండ్ వరుసగా రెండో విజయం నమోదు చేసింది. మంగళవారం పపువా న్యూగినియాతో జరిగిన మ్యాచ్‌లో స్కాట్లాండ్ 17 పరుగుల తేడాతో జయకేతనం ఎగుర వేసింది. ఈ గెలుపుతో గ్రూప్‌బిలో స్కాట్లాండ్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. ఇక పపువా న్యూ గినియా వరుసగా రెండో ఓటమిని చవిచూసింది. ముందుగా బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. తర్వాత లక్షఛేదనకు దిగిన పపువా 19.3 ఓవర్లలో 148 పరుగులకే ఆలౌటైంది. స్కాట్లాండ్ బౌలర్లు అద్భుత బౌలింగ్‌తో ప్రత్యర్థి జట్టును తక్కువ స్కోరుకే ఆలౌట్ చేయడంలో సఫలమయ్యారు.

ఆరంభం నుంచే..

ఇక లక్షఛేదనకు దిగిన న్యూ గినియాకు ఆరంభంలోనే కష్టాలు మొదలయ్యాయి. ఓపెనర్లు టోని ఉరా (2), లెగా సియాకకా (9) జట్టుకు శుభారంభం అందించడంలో విఫలమయ్యారు. ఉరా రెండో ఓవర్‌లోనే ఇంటిదారి పట్టాడు. జోష్ డావే అద్భుత బంతితో అతన్ని క్లీన్‌బౌల్డ్ చేశాడు. అప్పటికీ పపువా స్కోరు ఐదు పరుగులు మాత్రమే. కొద్ది సేపటికే మరో ఓపెనర్ సియాకా కూడా వెనుదిరిగాడు. అతన్ని వీల్ వెనక్కి పంపాడు. ఇక జట్టును ఆదుకుంటాడని భావింఇన కెప్టెన్ అసద్ వలా కూడా విఫలమయ్యాడు. 4 ఫోర్లతో 11 పరుగులు చేసి దూకుడు మీద కనిపించిన అసద్‌ను ఎవాన్స్ ఔట్ చేశాడు. ఆ వెంటనే చార్లెస్ అమిని (1), సిమోన్ అటాయి (2) కూడా ఔటయ్యారు. దీంతో న్యూ గినియా 35 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో చిక్కుకుంది.

నార్మన్ వీరోచిత పోరాటం..

ఈ దశలో ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లే బాధ్యతను సెసె బావు, నార్మన్ వనువా తమపై వేసుకున్నారు. ఇద్దరు ప్రత్యర్థి బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ ముందుకు సాగారు. ఈ క్రమంలో వికెట్ల పతనాన్ని కొద్ది సేపు అడ్డుకున్నారు. అయితే ఒక ఫోర్, సిక్స్‌తో 24 పరుగుల చేసిన బావును క్రిస్ వెనక్కి పంపాడు. అతను ఔటైనా నార్మన్ తన పోరాటాన్ని కొనసాగించాడు. వికెట్ కీపర్ కిప్లిన్ డొర్గియాతో కలిసి మరో కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఇద్దరు కుదురుగా ఆడుతూ స్కోరును పరిగెత్తించారు. అంతేగాక ఏడో వికెట్‌కు 53 పరుగుల పార్ట్‌నర్‌షిప్‌ను కూడా నమోదు చేశారు. ధాటిగా ఆడిన డొర్గియా ఒక ఫోర్, సిక్స్‌తో 18 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆ వెంటనే నార్మన్ కూడా వెనుదిరిగాడు. కీలక ఇన్నింగ్స్ ఆడిన నార్మన్ 37 బంతుల్లో రెండు సిక్సర్లు, రెండు ఫోర్లతో 47 పరుగులు చేసి డావే చేతికి చిక్కాడు. ఆ తర్వాత చాడ్ సోపర్ (16) కొద్ది సేపు పోరాడినా ఫలితం లేకుండా పోయింది. స్కాట్లాండ్ బౌలర్లలో జోష్ డావే నాలుగు వికెట్లు పడగొట్టాడు.

ఆదుకున్న క్రాస్, బెర్రింగ్టన్

అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్‌కు ఆశించిన స్థాయిలో శుభారంభం దక్కలేదు. ఓపెనర్లు కొయెట్జర్, మున్సెలు విఫలమయ్యారు. కెప్టెన్ కొయెట్జర్ ఆరు పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. మున్సె కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలువలేక పోయాడు. మూడు ఫోర్లతో 15 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. దీంతో స్కాట్లాండ్ 26 పరుగులకే ఓపెనర్ల వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో ఇన్నింగ్స్‌ను కుదుట పరిచే బాధ్యతను వికెట్ కీపర్ మాథ్యూ క్రాస్, రిచి బెర్రింగ్టన్ తమపై వేసుకున్నారు. ఇద్దరు ప్రత్యర్థి బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్నారు. ఒకవైపు వికెట్‌ను కాపాడుకుంటూనే చెత్త బంతులను బౌండరీలకు తరలించారు. ఈ జోడీని విడగొట్టేందుకు పపువా బౌలర్లు చేసిన ప్రయత్నాలు చాలా సేపటి వరకు ఫలించలేదు. ఇటు క్రాస్, అటు రిచి కుదురుగా ఆడడంతో స్కాట్లాడ్ భారీ స్కోరు దిశగా అడుగులు వేసింది.

కీలక ఇన్నింగ్స్ ఆడిన క్రాస్ రెండు ఫోర్లు, 2 సిక్సర్లతో 45 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ క్రమంలో మూడో వికెట్‌కు 92 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. క్రాస్ ఔటైనా రిచి తన జోరును కొనసాగించాడు. ప్రత్యర్థి బౌలర్లపై ఎదురుదాడి చేస్తూ స్కోరును పరిగెత్తించాడు. ధాటిగా బెర్రింగ్టన్ 49 బంతుల్లో మూడు సిక్సర్లు, ఆరు ఫోర్లతో 70 పరుగులు చేసి ఔటయ్యాడు. చివర్లో పపువా బౌలర్లు విజృంభించడంతో స్కాట్లాండ్ స్కోరు 165 పరుగులకే పరిమితమైంది. న్యూ గినియా బౌలర్లలో కబువా నాలుగు, సోపర్ మూడు వికెట్లు పడగొట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News