Sunday, April 28, 2024

విలక్షణ నటుడు జెపి కన్నుమూత

- Advertisement -
- Advertisement -

 గుంటూరు స్వగృహంలో గుండెపోటుతో మృతిచెందిన జయప్రకాష్ రెడ్డి
 ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్‌షా, సిఎం కెసిఆర్ ఇతర ప్రముఖుల సంతాపం

తెలుగు తెరపై రాయలసీమ మాండలికానికి పెద్ద గుర్తింపు తెచ్చిన నటుడు జయప్రకాష్ రెడ్డి. రాయలసీమ యాసలో సీరియస్ విలనిజాన్ని పండించిన ఆయన టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే కరడు గట్టిన ఫ్యాక్షనిజం పాత్రలే కాదు…కదిలించే సన్నివేశాలు, కడుపుబ్బా నవ్వించే పాత్రలు కూడా అవలీలగా చేయగలనని నిరూపించుకున్నారు జెపి. సమరసింహా రెడ్డి, నరసింహ నాయుడు, ప్రేమించుకుందాం రా, జయం మనదేరా, చెన్నకేశవ రెడ్డి వంటి సినిమాల్లో భయంకరమైన ఫ్యాక్షనిస్టుగా కనిపించిన జయప్రకాశ్ రెడ్డి కిక్, కబడ్డీ కబడ్డీ సినిమాల్లో సున్నితమైన కామెడీ చేయగలరని ఎవరూ ఊహించలేదు. ఆయన మొదట్లో విలన్ పాత్రలకే పరిమితమైనా ఆయనకు పేరు తెచ్చింది మాత్రం సపోర్టింగ్ కామెడీ పాత్రలే. టాలీవుడ్‌లో విలక్షణ నటుడిగా తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు జయప్రకాష్ రెడ్డి.

మన తెలంగాణ/ హైదరాబాద్: ప్రముఖ నటుడు జయప్రకాష్ రెడ్డి (74) మృతిచెందారు. లాక్‌డౌన్ నుంచి గుంటూరులో ఉంటున్న ఆయన మంగళవారం ఉదయం బాత్‌రూమ్‌లో ఉండగా గుండెపోటు రావడంతో అ క్కడికక్కడే తుదిశ్వాస విడిచారు. ఇక జయప్రకాష్‌రెడ్డి కొంతకాలంగా షూటింగులు లేక గుంటూరులోని స్వగృహంలోనే ఉంటున్నారు. ఈ విలక్షణ నటుడి ప్రతిభ గురించి ఎంత చెప్పినా తక్కువే. విలన్‌గా, కమేడియన్‌గా తనదైన శైలి నటనతో తెలుగు ప్రజల మనసు దోచారు. రాయలసీమ యాసను తెలుగు తెరకు పరిచయం చేసిన నటుడిగా ఆయనకంటూ ఓ శైలి ఉంది. ఫ్యాక్షన్ సినిమాల్లో సీమ మాండలికంతో విలన్‌గా మెప్పించిన జయప్రకాష్ రెడ్డి చాలా సినిమాల్లో కామెడీ పాత్రలతోనూ మెప్పించారు.దాదాపు వందకు పైగా తెలుగు, తమిళ్, కన్నడ చిత్రాల్లో విలన్, కమేడియన్‌గా నటించి ఎంతో పేరుతెచ్చుకున్నారు. వెంకటేష్ ‘బ్రహ్మపుత్రుడు’ సినిమాతో తెలుగు సినీరంగంలో అడుగు పెట్టిన ఆయన ప్రేమించుకుందాం రా, సమరసింహారెడ్డి, జయం మనదేరా, నరసింహనాయుడు, చెన్నకేశవరెడ్డి, ఎవడిగోల వాడిది, సీమ టపాకాయ్, రెడీ, ఛత్రపతి, రేసు గుర్రం, పటాస్, సరైనోడు, ఖైదీ నంబర్ 150, రాజా ది గ్రేట్, సరిలేరు నీకెవ్వరు వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాల్లో నటించారు. చివరగా మహేష్‌బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలో కనిపించారు జయప్రకాష్ రెడ్డి. విలనిజాన్ని, కామెడీ విలనిజాన్ని ఆవిష్కరించిన గొప్ప నటుడిగా జయప్రకాష్ రెడ్డిని తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేరు.

జయప్రకాష్ రెడ్డి స్వస్థలం కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలం సిరివెళ్ల. 1946 సంవత్సరం మే 8న జన్మించిన ఆయన నాటకరంగంపై ఉన్న మక్కువతో గుంటూరులోనే స్థిరపడ్డారు. జయప్రకాష్ రెడ్డికి భార్య రాజ్యలక్ష్మి, కుమారుడు చంద్రప్రతాప్ రెడ్డి ఉన్నారు. ఇక జయప్రకాష్ రెడ్డి తండ్రి సబ్‌ఇన్‌స్పెక్టర్‌గా పనిచేసేవారు. అయితే జెపి విద్యాభ్యాసం అంతా నెల్లూరులోనే సాగి ంది. అందుకే ఆయనకు నెల్లూరు మాండలికంపై అంత పట్టు. జయప్రకాష్ రెడ్డికి చిన్నప్పటి నుంచే నాటకాలంటే ఆసక్తి ఉండే ది. తండ్రి కూడా నటుడే కాబట్టి ఇంట్లో కుటుంబ సభ్యులు కూడా అందుకు అడ్డు చెప్పేవారు కాదు. తండ్రీ కొడుకులు కలిసి నాటకాల్లో నటించారు. జయప్రకాష్ రెడ్డి చదువులోనూ ముం దుండే వారు. డిగ్రీ తర్వాత ఉపాధ్యాయ శిక్షణ పూర్తి చేసుకొని గణితం ఉపాధ్యాయుడిగా ఉద్యోగంలో చేరారు. గుంటూరులో జయప్రకాష్ రెడ్డి చాలాకాలం పాటు ఉపాధ్యాయుడిగా పనిచేశారు. ప్రస్తుత ఏపి మంత్రి నక్కా ఆనందబాబు ఆయన శిష్యుడే.
రంగస్థలం నుంచి సినీరంగంలోకి…
ఒకసారి జయప్రకాష్‌రెడ్డి నల్గొండలో ‘గప్ చుప్’ అనే నాటకాన్ని ప్రదర్శిస్తుండగా దర్శకరత్న దాసరి నారాయణరావుకు అతని నటన నచ్చి నిర్మాత రామానాయుడుకు పరిచయం చేశారు. అలా జెపి 1988లో విడుదలైన ‘బ్రహ్మపుత్రుడు’ చిత్రంతో తెలుగు సినీరంగానికి పరిచయమయ్యారు. కానీ 1997లో విడుదలైన ‘ప్రేమించుకుందాం రా’ చిత్రం ప్రతినాయకునిగా ఆయనకు మంచి పేరు తీసుకొనివచ్చింది. తరువాత బాలకృష్ణ కథానాయకుడిగా వచ్చిన సమరసింహా రెడ్డి, నరసింహ నాయుడు లాంటి విజయవంతమైన సినిమాల్లో కూడా విలన్ పాత్రలతో ప్రేక్షకులను మెప్పించారు. తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో దాదాపు వందకు పైగా సినిమాల్లో నటించారు జయప్రకాష్ రెడ్డి. ప్రేమించుకుందాం రా, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, జయం మనదేరా, సీతయ్య, ఛత్రపతి, గబ్బర్ సింగ్, నాయక్, బాద్‌షా, రేసు గుర్రం, మనం, టెంపర్, ఖైదీ నంబర్ 150, రాజా ది గ్రేట్, సరిలేరు నీకెవ్వరు తదితర సూపర్ హిట్ సినిమాల్లో ఆయన నటించి విలక్షణ నటుడిగా ఎంతో పేరు తెచ్చుకున్నారు.
రాయలసీమ మాండలికంతో ప్రత్యేక గుర్తింపు…
రాయలసీమ మాండలికంలో తెలుగులో ఎన్నో సినిమాలు వచ్చినా.. తెరపై ఆ మాండలికానికి పేరు తెచ్చింది మాత్రం జయప్రకాష్ రెడ్డే. ఈ విలక్షణ నటుడి యాస, భాష అన్నీ ప్రత్యేకమే. దీంతో తెలుగు సినీ పరిశ్రమలో ఆయన ఓ అరుదైన నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. జయప్రకాష్ రెడ్డి చేసిన పాత్రలు చూస్తే ఆయన నటిస్తున్నట్టు అనిపించదు. ఆయన డైలాగుల్లో… అది నెల్లూరు యాసైనా, తెలంగాణ భాషైనా, కర్నూల్ మాండలికమైనా ఆయన నోటినుంచి వచ్చిందంటే సహజత్వం ఉట్టిపడుతుంది. విలన్‌తో సహా ఏ పాత్రల్లోనైనా ఆయన ఎంట్రీ ఇచ్చాడంటే హాల్ అంతా అరుపులతో దద్దరిల్లిపోతుంది.
అనిల్ రావిపూడి పిలిస్తే మళ్లీ…
గత ఏడాది ఏప్రిల్‌లోనే జయప్రకాష్ రెడ్డి సినిమాలకు గుడ్‌బై చెప్పారు. అప్పటికీ ఆయనకు ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. కానీ ఎందుకో సినిమాల నుంచి తప్పుకుందామనుకున్నారు. హైదరాబాద్ వదిలి గుంటూరు వెళ్లిపోయారు. అక్క డే కుమారుడి వద్ద ఉంటున్నారు. అయితే ‘సరిలేరు నీకెవ్వరు’ డైరెక్టర్ అనిల్ రావిపూడితో జయప్రకాష్ రెడ్డికి సత్సంబంధాలు ఉండేవి. ఆయన ఎప్పుడూ బాబాయ్ అని పిలిచేవారు. ఎలాగైనా తన సినిమాలో జయప్రకాష్ రెడ్డిని పెడుదామనుకున్నారు. అందుకే ఆయన ఇంటికి వెళ్లి ఒప్పించి మరీ ‘సరిలేరు నీకెవ్వరు’ కోసం తీసుకొచ్చారట. ఇదే ఆయన చివరి సినిమా అయింది. ఈ సినిమాలో జయప్రకాష్ రెడ్డికి రెండే డైలాగులు ఉంటాయి. ఫస్టాఫ్ అంతా ‘పండబెట్టి- పీక కోసి’ అనే డైలాగ్ మాత్రమే ఉంటుంది. ఇక సెకెండాఫ్ అంతా ‘కూజాలు చెంబులౌతాయి’ అనే డైలాగ్ మాత్రమే ఉంటుంది. ఈ రెండు డైలాగ్‌లు సినిమాలో ఓ రేంజ్‌లో క్లిక్ అయ్యాయి.
అంత్యక్రియలు పూర్తి…
విలక్షణ నటుడు జయప్రకాష్ రెడ్డి అంత్య క్రియలు పూర్తయ్యాయి. కరోనా కారణంగా అతి తక్కువ మంది సమక్షంలో ఈ అంత్య క్రియలు జరిగాయి. గుంటూరులోని కొరిటి పాడు స్మశాన వాటికలో జెపి అంత్యక్రియలు నిర్వహించారు. జెపి తనయుడు, కోడలికి కరోనా రావడంతో గుంటూరులోని ఒక ఆసుపత్రిలో వారు చికిత్స పొందుతున్నారు. ఈ కారణంగా తండ్రి అంత్యక్రియలకు జెపి తనయుడు హాజరు కాలేక పోయాడు. కొద్ది మంది అభిమానులు, బంధుమిత్రులు కలిసి అంతిమ యాత్రను నిర్వహించారు.

గొప్ప నటుడిని కోల్పోయాం…
మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ “నేను చివరిసారిగా నా 150వ చిత్రం ‘ఖైదీ నంబర్ 150’లో జయప్రకాశ్ రెడ్డితో నటించాను. ఆయన శని, ఆది వారాల్లో షూటింగులు పెట్టుకునేవారు కాదు. వారంలో ఆ రెండు రోజులు ఆయన స్టేజ్ పర్‌ఫార్మెన్స్‌లు ఇచ్చేవారు. జయప్రకాష్ రెడ్డి మరణంతో సినీ ఇండస్ట్రీ గొప్ప నటుడిని కోల్పోయింది”అని అన్నారు.

ఎన్నో పాత్రలతో మెప్పించారు…
నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ “ఎన్నో మంచి పాత్రలతో మెప్పించిన విలక్షణ నటుడు జయప్రకాష్ రెడ్డి మృతి పరిశ్రమకు తీరని లోటు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుడిని ప్రార్ధిస్తున్నాను”అని అన్నారు.

ఎప్పటికీ గుర్తుండిపోతుంది…
సూపర్‌స్టార్ మహేష్‌బాబు మాట్లాడుతూ “జయప్రకాష్ రెడ్డి మరణ వార్త విని చాలా బాధపడ్డాను. తెలుగు ఇండస్ట్రీ గొప్ప నటుడిని కోల్పోయింది. ఆయనతో కలిసి నటించిన ప్రతి క్షణం, ప్రతిమూమెంట్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను”అని తెలిపారు.

తనదైన బాణీని చూపారు…
పవన్‌కళ్యాణ్ మాట్లాడుతూ జయప్రకాశ్ రెడ్డి మరణం దిగ్భ్రాంతిని కలిగించింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. రాయలసీమ మాండలికాన్ని పలకడంలో తనదైన బాణీని జయప్రకాశ్‌రెడ్డి చూపారు. తెలుగు సినీ, నాటక రంగాలకు జయప్రకాశ్‌రెడ్డి మరణం తీరని లోటు”అని పేర్కొన్నారు.

మిమ్మల్ని మిస్ అవుతున్నాం…
వెంకటేష్ మాట్లాడుతూ “నా స్నేహితుడు జయప్రకాశ్ రెడ్డి మరణంతో షాకయ్యాను. నాది, ఆయనది సిల్వర్ స్క్రీన్‌పై అద్భుతమైన కాంబినేషన్. మిమ్మల్ని మిస్ అవుతున్నాం”అని తెలిపారు.

జయప్రకాష్‌రెడ్డికి ప్రధాని మోడి సంతాపం
ప్రముఖ సినిమా, రంగస్థల నటుడు జయప్రకాష్ రెడ్డి మృతికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంతాపం ప్రకటించారు. జయప్రకాష్ రెడ్డి తనదైన ప్రత్యేక నటనా శైలితో అందరినీ ఆకట్టుకున్నారని ప్రధాని ట్విట్ చేశారు. సుధీర్ఘకాలం సినిమాయాత్రలో ఆయన ఎన్నో మరపురాని పాత్రలు పోషించారని గుర్తు చేశారు. సినిమాపరిశ్రమకు జయప్రకాష్ రెడ్డి మరణం తీరని లోటు అని మోడీ పేర్కొన్నారు. ఆయన కుటుంబసభ్యులకు,అభిమానులకు ప్రధాని ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఓం శాంతి అని ప్రధాని మోడీ ట్విట్టర్‌లో పేర్కొనవ్నారు. జయప్రకాష్ రెడ్డి మృతిపట్ల కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం తెలుగుచలనచిత్ర పరిశ్రమకు తీరనిలోటని పేర్కొన్నారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమకు ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. జయప్రకాష్‌రెడ్డి కుటుంబానికి అమిత్‌షా సానుభూతి తెలిపారు. విభిన్న పాత్రల్లో జీవించిన జయప్రకాష్‌రెడ్డి మృతి తీరనిలోటని హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారుదత్తాత్రేయ పేర్కొన్నారు.రాయలసీమ యాసలో అందరిని అలరించే జయప్రకాష్ రెడ్డి లేడని తెలిసి బాధపడతున్నట్లు ఆయన ట్విట్టర్‌లో తెలిపారు.జయప్రకాష్ రెడ్డికి సంతాపం, ఆయన కుటుంబసభ్యులకు సానుభూతిని బండారుదత్తాత్రేయ తెలిపారు.
జయప్రకాష్ రెడిమృతికి సిఎం కెసిఆర్ సంతాపం
సుప్రసిద్ధ సినిమా నటుడు జయప్రకాష్‌రెడ్డి మరణం పట్ల ముక్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. అనేక సినిమాల్లో విభిన్న పాత్రల్లో నటించిన మంచి నటుడిగానే కాకుండా,గొప్ప రంగస్థల నటుడిగా కూడా జయప్రకాష్‌రెడ్డికి ప్రజల్లో అభిమానం ఉందన్నారు. విభిన్నమైననటనతో ప్రేక్షకులను అలరించిన జయప్రకాష్‌రెడ్డి మరణం పట్ల సినిమాటోగ్రఫి శాఖమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్రసంతాపం ప్రకటించారు. ఎలాంటి పాత్రకైనా న్యాయం చేసేవారని ఆయన పేర్కొన్నారు. ఆయన కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపారు. ఏపాత్రలోనా పరకాయప్రవేశం చేసే జయప్రకాష్‌రెడ్డి మృతి తీరని లోటని పంచాయితీరాజ్,గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు విచారం వ్యక్తం చేశారు. జయప్రకాష్‌రెడ్డి కుటుంబసభ్యులకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సానుభూతి తెలిపారు.

Senior Actor Jayaprakash Reddy Passes Away

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News