Sunday, April 28, 2024

నొప్పించడం మానుకోండి!

- Advertisement -
- Advertisement -

anger

 

హద్దులు నిర్ణయించటం అంటే కోపాన్ని అణుచుకోవటం, అరుపులతో అదుపు చేయాలని చూడడం కాదు. నచ్చజెప్పే పదాలు నేర్చుకోవాలి. ఇందులో బతిమిలాడటాలు, అధికారం చూపించటం ఉండదు. ఎవరి జీవితాలపైన వాళ్లకి పూర్తి నియంత్రణ ఉండాలి. ఎవరి హద్దుల్లో వాళ్లు ఉంటే వ్యక్తిగత లక్ష్యాల్లో ఘర్షణ ధోరణి రాదు. కోపతాపాలూ రావు. ఎదుటివాళ్లను సరిగ్గా అర్థం చేసుకోగలుగుతారు. అంటే కచ్చితంగా వ్యవహరించటం చాతనైతే జీవితంలో ఘర్షణ పోతుంది.

“ఏమిటీ కేకలు అరుపులు” అంది ప్రశాంతి.
తల్లితో ఫోన్‌లో మాట్లాడుతూ ఉంటే దూరం నుంచి అన్నగారి అరుపులు వినిపిస్తున్నాయి.
యశోద విసుక్కుంది.
“ఇవ్వాళ మనింట్లో కొత్తనా… ఆవేశం వస్తే ఇలా వెనకా ముందు చూస్తాడా మీ అన్న.
వాడి కోసమే కాఫీ కప్పు టేబుల్‌పైన పెట్టింది వదిన.
చూసుకోక దాన్ని కిందకు నెట్టాడు. పైగా వదినపైన ఎగురుతున్నాడు.
ఈ కొంపలో తలోరకం. మీనాన్నకు కోపం వచ్చినా, బాధ కలిగినా, అదేంటో నోరెత్తకుండా బిగుసుకుపోతారు. అసలేమయిందో అర్థం కాదు. ఏం బాధో తెలియదు.

చచ్చే చావు కదా నాకు. నువు మాత్రం తక్కువా శాంతా.. నీ అంత మొండిది ఎక్కడన్నా ఉంటుందా? నువు అన్నట్టు జరక్కపోతే ఎవరినైనా బతకనిచ్చావా? రూల్స్ రూల్స్ మాట్లాడి అదిగో వెర్రికేకలు పెడుతున్న మీ అన్న నోరు మూయించే దానివి. అబ్బా తలా ఒక రకం.
మీ అందరితో పడీ పడీ నాకు మాత్రం అంతులేని సహనం వచ్చేసింది.

ఇక మీ వదిన అదృష్టవంతురాలు. కచ్చితంగా ఉంటుందబ్బా. వాదించదు. ఎవర్ని ఏవీ అనదు. ఇదిగో ఇది నా ఇష్టం. ఇది నాకు నచ్చదని మొహానే చెప్పేసి ఇక ఆ మాటపైనే ఉంటుంది. ఎంత ముచ్చటగా ఉంటుందో తెలుసా? ఎప్పుడైనా గొంతు పెంచిందా? ఎవర్నయినా ఒక్కమాట అందా? మీ అన్న అరుపులకు ఆ పిల్లే సరైన జవాబు. అంత చిందులేస్తూ ఉంటే ఇదిగో వాసూ… ఆ కప్పు పడేసింది నువ్వు. హడావిడి పడేది నువ్వు. ఆ కప్పు పగలగొట్టావు కదా! ఆ ముక్కలు ఎత్తిపోసి, కాఫీ శుభ్రంగా తుడు.. అది నా పని కాదు. మర్యాదగా అయ్యో అంటే సాయం చేసేదాన్ని.. ఇలా అరిచావు కదా! ఇక నో.. వే.. నేను ఏవీ క్లీన్ చేయను. మీ అమ్మగారిపైన ఈ పని పెట్టావా అస్సలు ఊరుకోను.. నువ్వే చేయు’ అని ఆర్డర్ వేసింది.
మీనాన్న సంగతి తెలుసుగా.. ఆ పేపర్ పట్టుకుని ఏ గదిలోకో మాయం అయ్యారు. వాడట్లా చిందులు తొక్కుతున్నాడు… ఇదిగో నేను నీతో మాట్లాడుతున్నా…” ఇంట్లో తిరుగుతున్న బాగోతం అంతా కూతురుకి చెప్పుకుంది యశోద…

నిజమే ఇలాంటివి ప్రతి ఇంట్లోనూ ఉంటాయి. అందరూ ఒకేలా ఉండరు. ఏ విషయంలో అయినా అందరి స్పందన ఒకేలా ఉండదు. కొందరు తమకు అన్యాయం అనిపిస్తే చాలు అతిగా స్పందిస్తారు. అసలేం జరిగింది.. ఎవరిది తప్పు అన్న ఆలోచన ఉండదు. కొందరు ప్రతిదీ అవతల వాళ్ల పైన తోసేస్తారు లేదా తమని తాము నిందించుకుంటూ ఇతరులను బాధపెట్టాలని చూస్తారు. తాము అనుకున్నది జరగలేదనో, తమ మాట చెల్లలేదనో, అనుమానం వస్తేచాలు, ఆ బాధ కొద్దీ తమని తాము తిట్టుకుంటారు. మిగతా కొందరు చాలా హుందాగా ప్రవర్తిస్తారు. అవతలవాళ్ల తప్పు ఎత్తి చూపిస్తారు. స్పష్టంగా ఉంటుంది వాళ్ల ఆలోచన. కళ్లల్లో స్పష్టమైన భావన. ఇదీ నీ తప్పే అని ఎదుటి వాళ్లకు చెప్పే తీరు చాలా బావుంటుంది. అవతలి వాళ్లు తమ తప్పు ఒప్పుకొని తలవంచుకుపోయేలా ఉంటుంది వాతావరణం.

ఇలా జీవితంలో ఎన్నో సందర్భాలు వస్తాయి. మనం స్పందించి తీరవలసిన సందర్భాలు. అలాంటి సమయాల్లో సరిగ్గా చెప్పలేకపోతే ఒక్కోసారి మన విలువే పోతుంది. కుటుంబ సభ్యులే కాదు, చుట్టూ సమాజం కూడా వేలెత్తి చూపించే పరిస్థ్ధితి వస్తుంది. మన అభిప్రాయం స్పష్టంగా స్వచ్ఛంగా చెప్పగలిగితేనే గౌరవం లభిస్తుంది.
వ్యక్తిత్వ వికాసంలో దీన్ని ప్రత్యేకమైన కళగా చెపుతారు. ఏ సందర్భంలో అయినా స్పష్టంగా వ్యవహరించాలి. అవసరం అయితే కాదు..వద్దూ.. అని చెప్పగలగాలి. తమను మెచ్చుకోరేమో, దూరంగా నెడతారేమో, స్నేహాలు, బంధుత్వాలు పాడవుతాయేమో అన్న భయం… స్వార్థపరులుగా ముద్రపడుతుందేమోనన్న అనుమానం కలిగితే ప్రతి దానికి ‘సరే’ అనే అలవాటే వస్తుంది. కానీ ఇలాంటి మనస్తత్వం వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తుంది. నిన్ను నువు ప్రేమించుకోగలిగితే నీ అభిప్రాయంపైన నీకు దృఢమైన నమ్మకం ఉంటే శక్తియుక్తులను ఎటువంటి ఆలోచన లేకుండా ప్రదర్శించగలిగే కచ్చితత్వం నీలో వస్తుంది అంటారు నిపుణులు. ఇది కూడా సాధనతో సాధించవచ్చు. తిన్నగా నిలబడి, ఎదుటివాళ్ల కళ్లల్లోకి చూస్తూ, అనుకున్న విషయాన్ని తడబాటు లేకుండా చెప్పగలగటం సాధన చేసి అలవర్చుకోవచ్చు.

చాలా సార్లు పెద్దవాళ్లు ఎవరి హద్దుల్లో వాళ్లు ఉండాలి అంటూ ఉంటారు. పిల్లలు పెద్దవాళ్లని ఎదిరిస్తూ ఉంటే లేదా ఎదుటివాళ్లు వాళ్ల పరిధి మరచి ప్రతి విషయంలో జోక్యం చేసుకుంటూ ఉంటే వాళ్లను ఎవరి హద్దుల్లో వాళ్లను ఉండమంటారు. ఈ అలవాటు ముందు నుంచి ఉండాలి. మనం మన పరిధిలో ఉండటం, ఇతరుల విషయాల్లో అతిజోక్యం లేకుండా ఉండటం, అలాగే ఎదుటివాళ్లనూ అనుమ తించకుండా ఉంటేనే వాతావరణం బావుంటుంది. పరిచయాల్లో, స్నేహాల్లో, బంధుత్వాల్లో ఎక్కడైన పరిధులు, పరిమితులు విధించుకోవాలి.

ఇలా పరిధులు ఏర్పాటు చేసుకోకపోతేనే ఇతరుల కోసం పని చేయవలసి వస్తుంది. వాళ్ల భావోద్వేగాలు భరించవలసి వస్తుంది కూడా. హద్దులు నిర్ణయించటం అంటే కోపాన్ని అణచుకోవటం, అరుపులతో అదుపుచేయాలని చూడడం కాదు. నచ్చజెప్పే పదాలు నేర్చుకోవాలి. ఇందులో బతిమిలాడటాలు, అధికారం చూపించటం ఉండదు. ఎవరి జీవితాలపైన వాళ్లకి పూర్తి నియంత్రణ ఉండాలి. ఎవరి హద్దుల్లో వాళ్లు ఉంటే వ్యక్తిగత లక్షాల్లో ఘర్షణ ధోరణి రాదు. కోపతాపాలూ రావు. ఎదుటివాళ్లను సరిగ్గా అర్థం చేసుకోగలుగుతారు. అంటే కచ్చితంగా వ్యవహరించటం చాతనైతే జీవితంలో ఘర్షణ పోతుంది.

మాటలు, వాదనలతో ఇతరులను నిందించటం మానేసి ఇది నేను అర్థం చేసుకున్న విషయం ఇలా ఉండటం, ఇలా చెప్పటం నాకు ఇష్టం, అయిష్టం అన్న స్పష్టతతో ఉండాలి. ఇలా ఆలోచనల్లో స్పష్టత, అభిప్రాయాల వ్యక్తీకరణలో స్పష్టత భాషపైన అదుపు ఉంటే అనవసరపు పదాలు దొర్లవు. అందుకే సరిగ్గా వ్యవహరించటం నేర్చుకోండి. ఆలోచనలు, ఆవేశాలు అందరికీ ఉంటాయి. కానీ స్పందించే విధానం లోనే తేడాలుంటాయి. తేడాలొస్తాయి కూడా. అందుకే ఇతరులను నొప్పించకుండా ఏ సందర్భంలోనైనా సరిగ్గా స్పందించాలి.

                                                                                                          సి. సుజాత

Setting boundaries means controlling anger
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News