Tuesday, May 14, 2024

చైతన్యపురి పోలీసుల అత్యుత్సాహం

- Advertisement -
- Advertisement -

SI attacks

 

బిజెపి నాయకుడిపై దాడి..!
పాస్‌ల కోసం వచ్చిన వలస కార్మికులపై ఝుళిపించిన లాఠీ!
బయటపడ్డ ఎస్‌ఐ ఫోన్‌లో బూతు పురాణం!

మనతెలంగాణ/ ఎల్.బి.నగర్ : తెలంగాణ రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ అభాసుపాలవుతోంది. రాష్ట్రాధినేత కెసిఆర్ రైతులపక్షాన నిలబడి నిరంతరంగా వారి సంక్షేమానికి కృషిచేస్తుండగా పోలీసులు మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. ఇందుకు ఉదాహరణగా నిలిచే సంఘటన మంగళవారం అర్ధరాత్రి చైతన్యపురి పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది. ఇటీవల చైతన్యపురి పోలీసులు గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్‌లోని కమీషన్ ఏజెంట్లపై కేసులను నమోదు చేశారు. దీనితో మార్కెట్ ఉన్నతశ్రేణి కార్యదర్శి ఎస్.వెంకటేశం పండ్లమార్కెట్‌ను 13వ తేదీ నుంచి మూసివేస్తున్నట్లు కమిషన్ ఏజెంట్లకు నోటీసులు జారీ చేశారు. రైతులకు, దళారీలకు ఈ సమాచారాన్ని తెలపాలంటూ మంగళవారం కార్యదర్శి వెంకటేశం కమీషన్ ఏజెంట్లను కోరారు. అయితే మార్కెట్ మూతపడిన విషయం తెలియని పలువురు రైతులు, దళారులు మామిడికాయల లోడుతో మంగళవారం రాత్రి మార్కెట్‌కు వచ్చారు.

కాగా లోపలికి రాకుండా మార్కెట్ సిబ్బంది గేట్లు మూసివేసి అడ్డుకోవడంతో లారీలన్నీ సర్వీసురోడ్డుపై నిలిచిపోయాయి. దీంతో విషయం తెలుసుకున్న ఇన్స్‌స్పెక్టర్ జానకిరాంరెడ్డి లారీలను తొలగించాలంటూ రైతులను ఆదేశించారు. ఇదే సమయంలో విషయం తెలుసుకున్న భాజపా నాగర్‌కర్నూల్ అధ్యక్షుడు సుధాకర్‌రావు అక్కడికి వచ్చాడు. ఈ క్రమంలో సుధాకర్‌రావు, ఇన్స్‌స్పెక్టర్‌ల మధ్య వాదోపవాదాలు నడుస్తుండగా సహనం కోల్పోయిన ఇన్స్‌స్పెక్టర్ ఒక్కసారిగా బూతులు తిడుతూ సుధాకర్‌పై దాడిచేశాడు. అంతేకాకుండా నడిరోడ్డుపై కొట్టుకుంటూ సుధాకర్‌ను స్టేషన్‌కు తరలించేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఈ విషయంపై ఆగ్రహం వ్యక్తం చేసిన భాజపా నాయకులు ఇన్స్‌పెక్టర్‌పై చర్యలు తీసుకోవాలంటూ పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.

వలస కార్మికులపై ఎస్‌ఐ దాడి

ఓ వైపు ఇన్స్‌స్పెక్టర్ ఉదంతం నడుస్తుండగానే మరో వైపు అదే స్టేషన్‌కు చెందిన ఎస్.ఐ నర్సయ్య తమ స్వస్థలాలకు వెళ్ళేందుకు పాసుల కోసం వచ్చిన వలస కార్మికులపై లాఠీ ఝుళిపించారు. తమ సొంత ఊర్లకు వెళ్ళేందుకు పలువురు వలస కార్మికులు బుధవారం పగలు పాసుల కోసం చైతన్యపురి పోలీస్‌స్టేషన్‌కు వచ్చారు. ఇది గమనించిన ఎస్.ఐ నర్సయ్య పలువురు కార్మికులను లాఠీతో కొడుతూ తరిమికొట్టారు.

మరో ఎస్‌ఐ బూతు పురాణం

ఇదిలా ఉండగా చైతన్యపురి పోలీస్‌స్టేషన్ ఎస్.ఐ రంగారెడ్డి బూతుపురాణం ఆడియో ఒకటి బుధవారం వెలుగులోకి వచ్చింది. ఓ ఫిర్యాదు విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న భాస్కర్ అనే వ్యక్తికి ఎస్.ఐ రంగారెడ్డి నాలుగు నెలల కిందట చేసిన ఫోన్‌కాల్ వివరాలు బైటికి వచ్చాయి. ఈ ఫోన్ కాల్‌లో ఎస్‌ఐ రంగారెడ్డి సదరు వ్యక్తిని ఫోన్‌లో రాయలేని విధంగా తిడుతున్న విషయం రికార్డు అయ్యింది. దీనితో ఎస్.ఐ రంగారెడ్డి ఫోన్‌కాల్ రికార్డింగ్ సంచలనం సృష్టిస్తోంది. ఇలా ఒకేరోజు చైతన్యపురి పోలీసుస్టేషన్‌లో మూడు కేసులు జరుగడం సంచలనం కలగించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News