Monday, April 29, 2024

మరో 41 కేసులు

- Advertisement -
- Advertisement -

41 Corona positive cases

 

 

జిహెచ్‌ఎంసి పరిధిలో 31, వలస కార్మికుల్లో 10
మరో ఇద్దరు మృతి, రికవరీ రేటు 69 శాతం

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో యాక్టివ్ కేసులు(చికిత్స పొందుతున్న వారు)కంటే రికవరీ శాతమే(డిశ్చార్జ్ అయిన వారు) ఎక్కువగా ఉంది.

తెలంగాణలో రికవరీ రేట్ 69 శాతం ఉండగా, యాక్టివ్ కేసుల శాతం 29, మరణాల శాతం 2 ఉన్నట్లు వైద్యారోగ్యశాఖ బులిటెన్‌లో పేర్కొన్నారు. రాష్ట్రంలో కొత్తగా 41 కేసులు నమోదు కాగా, భారీగా 117 మంది డిశ్చార్జ్ అయినట్లు అధికారులు తెలిపారు. అయితే ఐసిఎంఆర్ కొత్త గైడ్‌లైన్స్ ప్రకారం బుధవారం డిశ్చార్జ్ చేసిన వారిని కరోన ఫైనల్ కన్‌ఫర్మ్ టెస్ట్‌లు నిర్వహించకుండానే ఇళ్లకు పంపించడం ఆందోళనకరం. ఇప్పటి వరకు ఒకే రోజులో ఎక్కువ మంది డిశ్చార్జ్ కావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. బుధవారం నమోదైన కేసుల్లో జిహెచ్‌ఎంసి పరిధిలో 31 మంది ఉండగా, పది మంది వలస కార్మికులకూ వైరస్ సోకింది. అదే విధంగా వైరస్ దాడిలో మరో ఇద్దరు మృతి చెందినట్లు బులిటెన్‌లో పేర్కొన్నారు. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 1367కు చేరగా, ఇప్పటి వరకు కోలుకోని ఆరోగ్యవంతులుగా 939 మంది ఇళ్లకు చేరుకున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ నోటిఫైడ్ ఆసుపత్రుల్లో 394 మంది చికిత్స పొందుతుండగా, వైరస్ బారిన పడి మృతి చెందిన వారి సంఖ్య 34కి పెరిగింది.

వైరస్ దాడికి మరో ఇద్దరు బలి

కరోనా వైరస్ దాడితో బుధవారం మరో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో మరణాల సంఖ్య 34కు పెరిగింది. జియాగూడకి చెందిన 38 సంవత్సరాల మహిళ ఇతర ఆరోగ్య సమస్యలతో ఉండగా, కరోనా వైరస్ సోకింది. దీంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు అధికారులు ధృవీకరించారు. అదే విధంగా సరూర్‌నగర్‌కి చెందిన 74 వయస్సు కలిగిన వృద్ధుడు గత కొన్ని రోజులుగా కిడ్ని సమస్యలతో బాధపడుతూ ఉండగా, ఇటీవల జ్వరం, దగ్గు, జలుబు వంటి సమస్యలు రావడంతో యశోదా ఆసుపత్రిలో చేరాడు. వెంటనే వైద్యులు గాంధీకి రిఫర్ చేశారు. పరీక్షించిన వైద్యులు కరోనాగా నిర్థారించి చికిత్స అందిస్తుండగా మరణించినట్లు పేర్కొన్నారు.

35 మంది వలస కార్మికులకు వైరస్ నిర్ధారణ

రాష్ట్రంలో 35 మంది వలస కార్మికులకు కరోనా సోకింది. లాక్‌డౌన్ సడలింపుల్లో భాగంగా ఇతర వివిధ రాష్ట్రాల వారు స్వరాష్ట్రానికి తిరిగివస్తున్నారు. అయితే వైరస్ లక్షణాలు కలిగిన వారిని చెక్‌పోస్టుల అదుపులోకి తీసుకొని పరీక్షించగా వైరస్ నిర్ధారణ అవుతుందని అధికారులు తెలిపారు. ఇప్పటికే బోర్డర్స్‌లో వైద్యారోగ్యశాఖ, పోలీస్ ఇతర సిబ్బంది సమన్వయంతో వలస కార్మికుల రాకపై అప్రమత్తమయ్యామని, ప్రతి ఒక్కరిని పూర్తిస్థాయిలో పరీక్షిస్తున్నామని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

జిల్లా వైద్య సిబ్బందితో మంత్రి వీడియో కాన్ఫరెన్స్

వలస కార్మికులు రాష్ట్రానికి వస్తున్న నేపథ్యంలో అన్ని జిల్లాల వైద్యాధికారులతో మంత్రి ఈటల రాజేందర్ గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు చేయాల్సిన కార్యక్రమాలు, అనుమానితుల లక్షణాలు వారిని గుర్తించడం, వాళ్ల ఇళ్లకు ప్రత్యేక ట్యాగ్‌ను విధించడం వంటి ప్రణాళికపై మంత్రి అధికారులకు వివరించనున్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా స్థాయి అధికారులతో పాటు సబ్ సెంటర్ స్థాయి సిబ్బంది కూడా పాల్గొననున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News