Tuesday, April 30, 2024

శభాష్ శారద

- Advertisement -
- Advertisement -

Software engineer employee selling vegetables

కరోనా కారణంగా ఉద్యోగం కోల్పోయిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని
కూరగాయలు అమ్ముతూ ఆదర్శంగా నిలిచిన యువతి

హైదరాబాద్: కష్టాల కడలిని ఈదుకుంటూ తీరం చేరేందుకు ప్రయత్నిస్తున్న శారద ఎందరికో ఆదర్శంగా నిలిచింది. కరోనా లాక్‌డౌన్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం పోయినా,ఆశలు ఆవిరైనా చలించలేదు. కరోనాతో వచ్చిన కష్టాలను అధిగమిస్తూ సాఫ్ట్‌వేర్ ఉద్యోగం పోతే పోనీ కూరగాయలు అమ్మి కుటుంబానికి అండగా నిలుస్తానని నడుం బిగించింది. ఓరుగల్లుకు చెందిన శారదకు కరోనా లాక్‌డౌన్‌తో కష్టాలు మొదలయ్యాయి. వేలాది రూపాయల జీతం వచ్చే సాఫ్ట్‌వేర్ ఉద్యోగం కాస్తా పోవడంతో కుటుంబాన్ని కష్టాలు ఆవహించాయి. అయితే ఉద్యోగం పోతే పోనీ అంటూ కూరగాయలు అమ్ముతూ కుటుంబాన్ని పోషిస్తున్న శారద ఎందరికో స్ఫూర్తిగా నిలిచింది. దేశ రాజధాని ఢిల్లీలో రెండు సంవత్సరాల పాటు సాఫ్ట్‌వేర్ ఉద్యోగినిగా విధులు నిర్వహించిన శారద ఇటీవల హైదరాబాద్‌లో కొత్త ఉద్యోగంలో చేరారు.

మంచివేతనంతో తొలి మూడు నెలలు శిక్ష పూర్తి చేశారు. అయితే అంతలోనే కరోనా సమాజాన్ని కమ్మి వేయడంతో ఎక్కడికక్కడ లాక్‌డౌన్ విధించారు. ఈ నేపథ్యంలో ట్రైనింగ్ పూర్తి చేసిన శారదను కంపెనీ ఉద్యోగం నుంచి తొలగించింది. దీంతో ఎలాంటి ఆవేదన చెందని శారద భవిష్యత్‌పై ప్రణాళిక సిద్ధం చేసుకుంది. ఉన్నత చదువులు చదివినా, సాఫ్ట్‌వేర్ ఉదోగం చేసినా కరోనా సమయంలో ఫలితం లేదని భావించింది. తల్లిదండ్రులకు తోడుగా కూరగాయల వ్యాపారం ప్రారంభించారు. శారద ప్రారంభించిన కూరగాయల వ్యాపారం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. శారదను శభాష్ తల్లి అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. అయితే లాక్‌డౌన్ నిబంధనలు తుంగలో తొక్కి అప్పటివరకు లాభాలను అర్జించిన కంపెనీలు ఉద్యోగులను అమానుషంగా తొలగిస్తున్నాయి.

ఇలాంటి సంస్థలపై పాలకవర్గం స్పందించాల్సిన అవసరం ఉంది. ఉద్యోగులను తొలగిస్తున్న కంపెనీలకు ప్రభు త్వం ఎలాంటి సహకారాలు అందివ్వవద్దని పలువురు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. వలసకూలీలతో పాటు అనేక రంగాలు కరోనాతో అతలాకుతలమై పోతున్నాయి. ఫలితంగా ఇప్పటికే దేశంలో 12.2 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయినట్లు తాజాగా నిపుణులు లెక్కలు కడుతున్నారు. దేశంలో నిరుద్యోగం 27.1 శాతానికి చేరిందని లెక్కలు చెపుతున్నాయి. అయితే ఉద్యోగాలు పోయినా కుంగిపోకుండా కూరగాయల వ్యాపారం చేసైనా కుటుంబాన్ని పోషిస్తున్న శారద ఎందరికో ఆదర్శంగా నిలవడం ప్రశంసనీయం.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News