Sunday, May 5, 2024

2024 ఎన్నికలే మనందరి టార్గెట్

- Advertisement -
- Advertisement -
Sonia Gandhi to meet Opposition leaders
విపక్ష నేతలతో భేటీలో సోనియా పిలుపు
వర్చువల్ సమావేశంలో పాల్గొన్న 19 పార్టీల నేతలు
ఉమ్మడి ఆందోళనలకు నిర్ణయం

న్యూఢిల్లీ: వచ్చే సార్వత్రిక ఎన్నికలే మనందరి లక్షం కావాలని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ విపక్ష నేతలకు పిలుపునిచ్చారు. ఇందుకోసం పప్రణాళికకాబద్ధంగా పని చేయాలన్నారు. ఎన్‌డిఎ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్షాలను కూడగట్టే ఉద్దేశంతో 19 రాజకీయ పక్షాల నేతలతో శుక్రవారం శుక్రవారం వర్చువల్‌గా సమావేశం నిర్వహించారు. శరద్ పవార్, మమతా బెనర్జీ, ఉద్ధవ్ థాకరే, ఎంకె స్టాలిన్ వంటి కీలక నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. టిఎంసి, డిఎంకె, ఎన్‌సిపి, శివసేన, జెఎంఎం, సిపిఐ, సిపిఎం,నేషనల్ కాన్ఫరెన్స్, ఆర్‌జెడి,ఎఐయుడిఎఫ్, విసికు, లోక్‌తాంత్రిక్ జనతాదళ్, జెడి(ఎస్), ఆర్‌ఎల్‌డి, ఆర్‌ఎస్‌పి, కేరళ కాంగ్రెస్ (మణి), పిడిపి, ఐయుఎంఎల్ పార్టీలు ఈ సమావేశంలో పాల్గొన్నాయి. అయితే ఆమ్ ఆద్మీపార్టీ, బిఎస్‌పి, ఎస్‌పిలు మాత్రం సమావేశానికి దూరంగా ఉన్నాయి.

ఈ సందర్భంగా సోనియా మాట్లాడుతూ.. మనందరి లక్షం 2014 ఎన్నికలు కావాలని విపక్షాలకు పిలుపునిచ్చారు. స్వాతంత్య్ర ఉద్యమ విలువలు, రాజ్యాంగ సూత్రాలు, నియమాల పట్ల విశ్వాసం ఉంచే ప్రభుత్వాన్ని ప్రజలకు అందించాలన్న లక్షంతో పని చేయాలన్నారు. మనందరికీ ఎవరి సిద్ధాంతాలు వారికి ఉన్నప్పటికీ వాటినన్నిటినీ అధిగమించి దేశప్రయోజనాల కోసం ఏకం కావలసిన సమయం ఆసన్నమైందన్నారు. ఒక విధంగా ఇది సవాలుతో కూడుకున్నదే అని అన్నారు. ప్రత్యామ్నాయం లేని స్థితిలో కలిసి పని చేయాల్సినఅవశ్యకత ఏర్పడిందన్నారు. దేశం కోసం ఒకే వేదికపైకి రావాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. భారత 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేళ వ్యక్తిగతంగా, సమష్టిగా పునః పరిశీలనకు ఇదే సమయమన్నారు. కొవిడ్ వ్యాక్సినేషన్, ఉచిత ఆహారధాన్యాల పంపిణీ, వ్యవసాయ చట్టాలు వంటి అంశాలపై ఉమ్మడిగా ప్రధానికి లేఖ రాసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అలాగే ఒబిసి బిలుల విషయంలో అన్ని పార్టీలు ఒకే తాటిపైకి వచ్చినట్లుగానే పార్లమెంటు వెలుపల కూడా అదే స్ఫూర్తిని కొనసాగించాలని సోనియా పిలుపునిచ్చారు.

సెప్టెంబర్ 20నుంచి దేశవ్యాప్త ఉమ్మడి ఆందోళనలు

కాగా ప్రభుత్వ వైఫల్యాలపై తాము సెప్టెంబర్ 20నుంచి 30 వరకు దేశవ్యాప్తంగా ఉమ్మడి ఆందోళనలు, ప్రదర్శనలు నిర్వహిస్తామని సమావేశం అనంతరం ఈ సమావేశంలో పాల్గొన్న 19 పార్టీల నేతలు ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు. రాష్ట్రాల్లో నెలకొన్న కరోనా పరిస్థితులను బట్టి ఆయా పార్టీల రాష్ట్ర విభాగాలు ఎలాంటి ఆందోళనలు చేపట్టాలో నిర్ణయిస్తాయని వారు ఆ ప్రకటనలో తెలిపారు. ధర్నాలు, నిరసన ప్రదర్శనలు, హర్తాళ్లు తదితర రూపాల్లో ఈ ఆందోళనలు ఉంటాయని వారు తెలిపారు. మెరుగైన భవిష్యత్తు కోసం మన లౌకికవాద, ప్రజాస్వామిక, సమాఖ్య స్వరూపాన్ని సర్వశక్తులు ఒడ్డి కాపాడుకోవాలని దేశ ప్రజలకు తామంతా పిలపునిస్తున్నామని వారు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

సంయుక్త ప్రకటనలో ఈ పార్టీల నేతలు ప్రభుత్వం ముందు 11 డిమాండ్లను ఉంచారు. కాగా ఆగస్టు 15న ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ప్రసంగాన్ని వీరు తీవ్రంగా దుయ్యబడుతూ, దేశ ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలకు సంబంధించిన ఒక్క అంశంపైన కూడా ఈ ప్రసంగం దృష్టిపెట్టలేదని విమర్శించారు. కాగా దేశంలో నెలకొన్న ప్రస్తుత గందరగోళ పరిస్థితుల దృష్టా భావసారూప్యం కలిగిన పార్టీల సమావేశాన్ని ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్ అధ్యక్షురాలు చొరవ తీసుకోవడాన్ని ఎన్‌సిపి అధినేత శరద్ పవార్ అభినందించారు. ప్రజాస్వామ్యం, లౌకికవాదం పట్ల నమ్మకం ఉన్న పార్టీలన్నీ ఒక్క తాటిపైకి వచ్చి నిర్ణీత కాలవ్యవధితో కూడిన కార్యాచరణను రూపొందించాలని ఆయన ఒక ట్వీట్‌లో పిలుపునిచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News