Monday, April 29, 2024

వైఎస్‌ఆర్‌టిపికి ఇందిరా శోభన్ రాజీనామా

- Advertisement -
- Advertisement -

 

Indira Shoban resigned from YSRTP

ప్రకటించిన వెంటనే ఆమెతో మాట్లాడి
బుజ్జగించిన వైఎస్

మనతెలంగాణ/హైదరాబాద్ : వైఎస్‌ఆర్‌టిపి అధినాయకురాలు షర్మిలకు బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ కీలకనేత ఇందిరాశోభన్ రాజీనామా చేస్తున్నట్లు శుక్రవారం నాడు కీలక ప్రకటన చేశారు. పార్టీ పదవికి తాను రాజీనామా చేస్తున్నట్లు ఇందిరాశోభన్ ఓ ప్రకటనలో తెలియజేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు ఆమె పంపారు. అసలు ఎందుకు రాజీనామా చేయాలని అనుకున్నారు..? రాజీనామా వెనుక అసలు కారణాలేంటి..? రాజీనామా చేసిన తర్వాత ఏం చేయబోతున్నారు..? అనే విషయాలను ప్రకటనలో నిశితంగా ఇందిరాశోభన్ ఆ లేఖలో వివరించారు. ఇప్పటికే ఒకరిద్దరు పార్టీకి రాజీనామా చేయగా తాజాగా కీలక నేత ఇందిరాశోభన్ కూడా గుడ్ బై చెప్పింది.
కాగా ఇందిరాశోభన్ పార్టీలో చేరినప్పట్నుంచి వైఎస్‌ఆర్‌టిపి తరఫున పెట్టే మీటింగ్స్, సభలకు, డిబేట్స్‌లో కీలకంగా వ్యవహరించింది. అదేవిధంగా వైఎస్‌ఆర్‌టిపి పార్టీ ఆవిర్భావం రోజున ఇందిరాశోభన్ స్పీచ్ కార్యకర్తల్లో ఎంతో ఉత్తేజాన్ని నింపింది.

లేఖలో పేర్కొన్న అంశాలు 

నా శ్రేయోభిలాషులకు, మీడియా మిత్రులకు నమస్కారం. నన్ను ఇంతకాలం ఆదరిస్తూ, అభిమానిస్తూ ప్రజాజీవితంలో ముందుకు నడిపిస్తున్న తెలంగాణ ప్రజలకు, మీడియా మిత్రులకు నా హృదయపూర్వక ధన్యవాదములు. తెలంగాణ ఉద్యమంలో రాష్ట్ర సాధన కోసం కలిసి కోట్లాడినం. తెలంగాణ ఆకాంక్షలు నెరవేరాలని కలలుగన్నం. వాటిని సాకారం చేసుకునేందుకు ప్రజలతో మమేకమైన నన్ను.. మీరంతా ఆశీర్వదిస్తూనే ఉన్నారు. అందుకు జీవితాంతం మీకు రుణపడి ఉంటాం. శుక్రవారం నాడు ఒక కీలక నిర్ణయం తీసుకున్నాను. అది మీరు కోరుకుంటున్నట్లుగానే షర్మిలక్క వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, పదవులకు రాజీనామా చేశాను అని ఆమె లేఖలో పేర్కొన్నారు.

ఆంధ్రా పార్టీలో ఉండకూడదని 

ఇండిరా శోభన్ రాజీనామాకు కారణం ఏంటంటే అమరవీరుల ఆశయాల సాధన కోసం, అన్నదాతల జీవితాల్లో ఆనందం కోసం, యువతకు, నిరుద్యోగులకు న్యాయం కోసం, దళిత, బహుజనుల, సబ్బండ వర్గాల సాధికారత కోసం, మైనార్టీల బతుకు బాగుకోసం, గిరిజనుల జీవితాల్లో వెలుగుల కోసం, మహిళలకు సమాన వాటా కోసం, కొట్లాడుతూనే ఉన్నాను. నా బొందిలో ప్రాణం ఉన్నంత వరకు కొట్లాడుతూనే ఉంటా. అందుకు ఆంధ్రాకు చెందిన షర్మిలక్క వైఎస్‌ఆర్‌టిపిలో ఉండకూడదని అభిమానులు, శ్రేయోభిలాషులు, తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు తాను పార్టీకీ రాజీనామా చేశానని ఇందిరాశోభన్ ఆ పకటనలో వెల్లడించారు.

రాజీనామా తర్వాత కాంగ్రెస్ గూటికి 

కాంగ్రెస్ పార్టీ ఎంపి రేవంత్ రెడ్డికి టిపిసిసి పదవి ఇచ్చిన తర్వాత ఇందిరాశోభన్ తిరిగి కాంగ్రెస్ తీరం పుచ్చుకోనున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైన విషయం విషయం తెలిసిందే. ఈక్రమంలో ఇందిరాశోభన్ అనతికాలంలో కాంగ్రెస్ పార్టీలో క్రీయాశీలక పాత్ర పోషించనున్నట్లు ఆమె వర్గీయులు వెల్లడిస్తున్నారు.

ఇందిరకు.. షర్మిల ఫోన్ 

వైఎస్‌ఆర్‌టిపికి ఇందిరాశోభన్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన వెంటనే వైఎస్ షర్మిల ఇందిరాశోభన్‌కు ఫోన్ చేసి మాట్లాడారు. సుమారు అరగంటకుపైగా వీరిద్దరి మధ్య పలు విషయాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. అంతేకాదు.. ప్రాధాన్యత పరంగా ఎలాంటి లోటు ఉండదని ఇందిరాశోభన్‌కు షర్మిల హామీ కూడా ఇచ్చారు. అయితే.. షర్మిలకు ఆమె ఏమని రిప్లయ్ ఇచ్చారన్నది చర్చనీయాంశంగా మారింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News