Monday, April 29, 2024

సోనూ సూద్ 20 కోట్ల పన్ను ఎగ్గొట్టారు

- Advertisement -
- Advertisement -

Sonu Sood evaded Rs 20 crore tax Says IT Dept

ఐటి శాఖ ప్రకటన

న్యూఢిల్లీ: ప్రముఖ నటుడు సోనూ సూద్ రూ.20 కోట్లకు పైగా పన్ను ఎగవేసినట్లు శనివారం కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సిబిడిటి)వెల్లడించింది. ఇటీవల ఐటి విభాగం సోనూ సూద్ నివాసాలు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. శుక్రవారం వరకు మూడు రోజుల పాటు ఈ సోదాలు చేపట్టింది. పన్ను ఎగవేత ఆరోపణలతో అధికారులు ఆయన లావాదేవీలను పరిశీలించారు. ఈ క్రమంలో ఐటి విభాగంనుంచి ఈ ప్రకటన వెలువడింది. అలాగే సోనూ సూద్ ఫారిన్ కంట్రిబ్యూషన్ (రెగ్యులేషన్) యాక్ట్‌ను కూడా ఉల్లంఘించినట్లు ఐటి అధికారులు వెల్లడించారు. దాని కింద క్రౌడ్ ఫండింగ్ ద్వారా విదేశీ దాతలనుంచి రూ. 2.1 కోట్లను సేకరించినట్లు తెలిపారు. సోనూసూద్‌తో పాటు ఆయన సహచరుల కార్యాలయాల్లో కూడా పన్ను ఎగవేతకు సంబంధించిన ఆధారాలను గుర్తించినట్లు వెల్లడించారు.

కొవిడ్ మహమ్మారి వేళ ఆపన్న హస్తం చాచి రియల్ హీరో అనిపించుకున్నారు సోనూ సూద్. ఆయన చేసిన సేవా కార్యక్రమాలతో దేశ ప్రజల మనస్సుల్లో నిలిచిపోయారు. కాగా కరోనా మొదటి వేవ్ సమయంలో ఆయన ఏర్పాటు చేసిన దాతృత్వ సంస్థ రూ.18 కోట్లకు పైగా విరాళాలను సేకరించినట్లు అధికారులు తెలిపారు. అందులో రూ. 1.9 కోట్లను మాత్రమే సహాయ కార్యక్రమాలకు వినియోగించారని, మిగతా డబ్బు ఆ సంస్థ ఖాతాలోనే ఉండిపోయిందని తెలిపారు. పన్ను ఎగవేత కోసం ఖాతాలను పుస్తకాల్లో రుణాలుగా మభ్య పెట్టారని అధికారులు తెలిపారు. సోనూ సూద్ ఇళ్లు, కార్యాలయాల్లో మూడు రోజులపాటు జరిపిన సోదాల్లో పన్ను ఎగవేతకు సంబంధించి పలు పత్రాలు దొరికినట్లు అధికారులు తెలిపారు.

ఇటీవల ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన దేశ్ కా మెంటార్స్ అనే సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా పని చేస్తున్నట్లు సోనూసూద్ ప్రకటించిన నేపథ్యంలో ఆదాయం పన్ను శాఖ దాడులు జరగడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. సోనూ సూద్ కంపెనీకి, లక్నోకు చెందిన రియల్ ఎస్టేట్ సంస్థకు మధ్య జరిగిన ఒప్పందంపై ఆదాయం పన్ను శాఖ అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ ఒప్పందంలో సోనూసూద్ పన్ను ఎగవేసారని ఐటిశాఖ అనుమానం వ్యక్తం చేసింది. కాగా రాజకీయ కక్షతోనే సోనూసూద్‌పై కేంద్రం ఐటి దాడులు చేయిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News