Sunday, April 28, 2024

అన్ని ప్రాంతాలకు ‘నైరుతి’

- Advertisement -
- Advertisement -

Southwest Monsoon arrived in Telangana

హైదరాబాద్ : రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు శుక్రవారం నైరుతి రుతుపవనాలు విస్తరించాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో గత సంవత్సరం మాదిరిగా అధికంగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే 2017 సంవత్సరంలో సాధారణ వర్షపాతం (98 శాతం) నమోదవుతుందని అంచనా వేయగా 95 శాతం నమోదయ్యిందని, 2018 సంవత్సరంలో సగటు వర్షపాతం 96 నుంచి 104 శాతం నమోదవుతుందని అంచనా వేయగా 9 శాతం తక్కువగా నమోదయ్యిందని వాతావరణ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. 2019 సంవత్సరాన్ని చూసుకుంటే జూన్‌లో ఆశించిన మేర వర్షాలు కురవకపోవడం, జూలై చివరివారంలో రాష్ట్రవ్యాప్తంగా కురిసిన వర్షపాతంతో వాతావరణ శాఖ ఆశించిన విధంగా సాధారణ వర్షపాతం నమోదయ్యిందని, ఆగష్టు, సెప్టెంబర్ చివరివారంలో కురిసిన వర్షపాతంతో సాధారణ కన్నా 6 శాతం అధికంగా వర్షపాతం నమోదయ్యిందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొంటున్నారు.

ఇదే సంవత్సరం అత్యధిక వర్షపాతం కుమురం బీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాలు మొదటి మూడు స్థానాలను దక్కించుకోగా, ఉత్తర తెలంగాణలో అధిక వర్షపాతం నమోదయ్యిందని అధికారులు పేర్కొన్నారు. 30 సంవత్సరాల వర్షాలను బేరీజు వేసుకొని సాధారణ వర్షపాతాన్ని అధికారులు లెక్కిస్తుండగా కొన్నిసార్లు వారు వేసిన అంచనాలు తప్పుతున్నాయి. అయితే ఈ సంవత్సరం కూడా సాధారణం కన్నా అధికంగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.

48 గంటల్లో రుతుపవనాలు విస్తరించే అవకాశం

మధ్య మహారాష్ట్ర, మరఠ్వాడలోని మరికొన్ని ప్రాంతాలు, విదర్భలో కొన్ని ప్రాంతాలు, చత్తీస్‌గఢ్‌లో మరికొన్ని ప్రాంతాలు, బంగాళాఖాతంలో మిగిలిన ప్రాంతాలు, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, ఒరిస్సా, పశ్చిమబెంగాల్‌లో చాలా ప్రాంతాలు, సిక్కింలోని మొత్తం ప్రాంతాల్లోకి శుక్రవారం నైరుతి విస్తరించిందని అధికారులు పేర్కొన్నారు. మధ్య అరేబియా సముద్రంలో మరికొన్ని ప్రాంతాలు, మహారాష్ట్రలో మిగిలిన ప్రాంతాలు (ముంబైతో సహా), ఒరిస్సా, పశ్చిమబెంగాల్, చత్తీస్‌గఢ్ లో మరికొన్ని ప్రాంతాలు, దక్షిణ గుజరాత్‌లో కొన్ని ప్రాంతాలు, దక్షిణ మధ్యప్రదేశ్, జార్ఖండ్, బీహార్ ప్రాం తాలలోకి నైరుతి రుతుపవనాలు రాగల 48 గంటల్లో విస్తరించే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

ఒరిస్సా దాని పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం

ఉత్తర కోస్తాంధ్ర దానిని ఆనుకొని ఉన్న కోస్తా ఒరిస్సా దాని పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతోందని, దీనికి అనుబంధంగా 7.6 కి.మీల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, ఇది ఎత్తుకు వెళ్లే కొద్దీ నైరు తి దిశ వైపునకు వంపు తిరిగి ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తూర్పు- పశ్చిమ shear zone 17.0 deg. Lat. వెంబడి 3.1 కి.మీ ఎత్తు వద్ద పెనిన్సులర్ భారతదేశం మీదుగా 7.6 కి.మీ ఎత్తు వరకు ఏర్పడింది. ఇది ఎత్తుకు వెళ్లే కొద్దీ దక్షిణ దిశ వైపునకు వంపు తిరిగి ఉంద ని తెలిపారు. ఆగ్నేయ మధ్యప్రదేశ్ దాని పరిసర ప్రాంతాల్లో 1.5 కి.మీల ఎత్తు వద్ద ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, ఈ నేపథ్యంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు శని, ఆది, సోమవారాల్లో అనేక చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు

ముఖ్యంగా ఆదిలాబాద్, కోమరంభీం, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, రాజన్నసిరిసిల్ల, కరీంనగర్, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ములుగు, వరంగల్- పట్టణం, వరంగల్ -గ్రామీణం, ఖమ్మం జిల్లాలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

సిద్దిపేటలో 216.5 మిల్లీమీటర్ల వర్షపాతం

రాష్ట్రవ్యాప్తంగా కురిసిన వర్షాలను చూసుకుంటే శుక్రవా రం ఉదయం 8.30 గంటల వరకు సిద్దిపేటలో 216.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, పెద్దపల్లిలో 124, వరంగల్ అర్భన్ 114.3, రాజన్న సిరిసిల్ల 101.8, హైదరాబాద్ 91, జనగాం 91, కుమురంబీం ఆసిఫాబాద్ 85.3, రంగారెడ్డి 84.8, మంచిర్యాల 78.5, కరీంనగర్ 78.5, మేడ్చల్ మల్కాజిగిరి 60.3, భద్రాద్రి కొత్తగూడెం 46.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది.

Southwest Monsoon arrived in Telangana

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News