Saturday, April 27, 2024

మోటారు ప్రమాదాల క్లెయిమ్‌లకు పోలీస్ స్టేషన్లలో ప్రత్యేక విభాగాలు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: మోటారు ప్రమాదాల క్లెయిమ్‌ల పరిష్కారానికి పోలీస్ స్టేషన్లలో ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు రాష్ట్రాలను ఆదేశించింది. మూడునెలల్లోగా అన్ని పోలీస్ స్టేషన్లలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశాల్లో సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. బహిరంగ ప్రదేశంలో మోటారు వాహనం రోడ్డు ప్రమాదానికి గురైందని సమాచారం అందగానే..సెక్షన్ 159 మోటార్ వెహికల్ చట్ట సవరణ ప్రకారం స్టేషన్లలోని ప్రత్యేక యూనిట్ చర్యలు ప్రారంభించాలి. మోటారు ప్రమాదాల క్లెయిమ్‌లపై నివేదికను మూడు నెలల్లోగా పోలీసులు ట్రిబ్యునల్‌లో నమోదు చేయాలని సుప్రీంకోర్టు పేర్కొంది. దేశవ్యాప్తంగా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన హోం డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అన్ని పోలీస్ స్టేషన్లలో లేదా కనీసం పట్టణ స్థాయిలోనైనా దర్యాప్తు చేయడానికి ఒక ప్రత్యేక విభాగాన్ని నిబంధనలకు అనుగుణంగా ఏర్పాటు చేయాలి.

తద్వారా మోటారు ప్రమాద కేసుల క్లెయిమ్‌లు పరిష్కరించడం సులభతరం అవుతుందని జస్టిస్ ఎస్‌ఎ నజీర్, జస్టిస్ జెకె మహేశ్వరితో కూడిన ధర్మాసనం తెలిపింది. ఎఫ్‌ఐఆర్ నమోదు చేయగానే ప్రత్యేక పరిశోధన అధికారి మోటార్ వాహనాల చట్ట సవరణ నిబంధనలు 2022ప్రకారం తొలి నివేదికను క్లెయిమ్స్ ట్రిబ్యునల్‌లో దాఖలు చేయాల్సి ఉంటుంది. నివేదిక దాఖలు చేయడానికి ముందే రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లైసెన్స్, వాహనం ఫిట్‌నెస్, పర్మిట్ తదితర ముఖ్య అంశాలను పోలీస్ అధికారి సహకారంతో పరిశీలించి పొందుపరచాలి అని సుప్రీంకోర్టు తెలిపింది. ఈ ప్రక్రియలో పరిశోధక అధికారి పాత్ర కీలకం కానుంది. సదరు అధికారి లేదా న్యాయ ప్రతినిధి, డ్రైవరు, యజమాని, బీమా కంపెనీలకు నిబంధనల ప్రకారం తీసుకున్న చర్యలను తెలిపాలి. మోటారు వాహనాల సవరణ చట్టం, నిబంధనలు తెలిపేలా ఏదైనా సాంకేతిక ఏజెన్సీ సమన్వయంతో ఉమ్మడి వెబ్ పోర్టల్ లేదా ప్లాట్‌ఫారమ్‌ను అభివృద్ధి చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు రాష్ట్రాల అధికారులను ఆదేశించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News