Thursday, May 2, 2024

సంపాదకీయం: శ్రీలంక బ్యాలట్ యుద్ధం

- Advertisement -
- Advertisement -

 

sampadakiyamశ్రీలంక పార్లమెంటు ఎన్నికలకు తెర లేచింది. దేశాధ్యక్షుడు గోటాబయ రాజపక్స సోమవారం నాడు పార్లమెంటును రద్దు చేసి ఏప్రిల్ 25న ఎన్నికలు జరిపించడానికి ఆదేశాలు జారీ చేశాడు. ప్రస్తుత పార్లమెంటు పదవీ కాలం మరి 6 మాసాలున్నప్పటికీ రాజ్యాంగం ఇచ్చిన అధికారాలతో అధ్యక్షుడు దానికి స్వస్తి చెప్పాడు. ఐదేళ్ల పదవీ కాలం గల శ్రీలంక పార్లమెంటును నాలుగున్నరేళ్ల తర్వాత ఎప్పుడైనా రద్దు చేసే అధికారాన్ని దేశాధ్యక్షునికి ఆ దేశ రాజ్యాంగం కట్టబెట్టింది. గత నవంబర్‌లో జరిగిన ఎన్నికల ద్వారా అధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకున్నప్పటి నుంచి గోటాబయ రాజపక్స ప్రస్తుత పార్లమెంటు పట్ల అసంతృప్తిగానే ఉన్నారు.అందుకు మూల కారణం 2015లో పార్లమెంటు ఆమోదించిన రాజ్యాంగ సవరణ, దాని ద్వారా వచ్చిన 19ఎ అధికరణ. 2015లో అప్పటి అధ్యక్ష, ప్రధానులైన మైత్రీపాల సిరిసేన, రణిల్ విక్రమ సింఘేల ప్రభుత్వం ఈ అధికరణను రాజ్యాంగంలో చేర్చింది. దేశాధ్యక్ష పీఠానికి అంతవరకు ఉండిన విశేష, నిరంకుశ అధికారాలను ఈ అధికరణ తొలగించింది. దేశంలో పాలన మెజారిటీ సింహళీయుల అభీష్టం మేరకు కాకుండా అక్కడున్న తమిళ, ముస్లిం మైనారిటీల అభిప్రాయాలను సైతం గౌరవించే విధమైన ఒక మాదిరి వికేంద్రీకృత లక్షణంతో నడవాలనే ఉద్దేశం ఈ అధికరణ వెనుక ఉంది. అందుచేత అధ్యక్షుడు అంతవరకు అనుభవిస్తూ వచ్చిన తిరుగులేని ఆధిపత్యానికి అది కత్తెర వేసింది.

అధ్యక్షుడు అనుభవిస్తూ వచ్చిన పలు కీలక అధికారాలను పార్లమెంటుకు, ప్రభుత్వ నియామకాల ద్వారా ఏర్పాటయ్యే స్వతంత్ర కమిషన్లకు అప్పగించింది. న్యాయ వ్యవస్థ, పోలీసు, పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఎన్నికల కమిషన్ వంటి అతి ప్రధానమైన వ్యవస్థలకు నియామకాలు చేసే అధికారాలను ఈ కమిషన్‌లకు కట్టబెట్టింది. అధ్యక్షుడు, ప్రధాని పదవులను సమాంతర వ్యవస్థలుగా మార్చివేసింది. అంతేకాదు అధ్యక్షుడు ఎన్ని పదవీకాలాల పాటైనా కొనసాగే వెసులుబాటును తొలగించి ఆ పదవీ కాలాన్ని రెండు పర్యాయాలకే పరిమితం గావించింది. 2018 అక్టోబర్ 26 నుంచి డిసెంబర్ 15 వరకు సాగిన రాజ్యాంగ సంక్షోభం అధ్యక్ష, ప్రధాని పదవుల మధ్య వైరుధ్యాన్ని చాటింది. అప్పటి అధ్యక్షుడు మైత్రీపాల సిరిసేన ప్రధాని పదవి నుంచి విక్రమ సింఘేని తొలగించి ఇప్పటి అధ్యక్షుని సోదరుడు మహింద రాజపక్సను నియమించడం వివాదాస్పదమైంది. అలాగే అధ్యక్షుడు పార్లమెంటును ఎప్పుడుబడితే అప్పుడు రద్దు చేయడం కుదరదని సుప్రీంకోర్టు తేటతెల్లం చేయడంతో అప్పుడే జరిగి ఉండవలసిన పార్లమెంటు ఎన్నికలు వాయిదా పడ్డాయి.

గత ఏడాది ఈస్టర్ ఆదివారం నాడు శ్రీలంక చర్చిలలో, టూరిస్టు హోటళ్లలో సంభవించిన భీకరమైన ఐసిస్ దాడుల బాంబు పేలుళ్లు 250 మందికి పైగా అమాయకులను బలి తీసుకున్నాయి. ఆ దారుణ మారణ హోమానికి 2015 నాటి 19ఎ అధికరణ నుంచి ఉత్పన్నమైన అవ్యవస్థే కారణమనే అభిప్రాయం చోటు చేసుకొని అంతకు ముందరి కేంద్రీకృత నిరంకుశ కార్యనిర్వాహక వ్యవస్థకు అనుకూలుడైన గోటాబయ రాజపక్స అధ్యక్షుడుగా ఎన్నిక కావడానికి కారణమైంది. అప్పటి నుంచి 19ఎ అధికరణను చాప చుట్టి సముద్రంలో కలిపివేయడానికి గోటాబయ కంకణం కట్టుకున్నాడు. ఈస్టర్ పేలుళ్లను ముందుగానే పసిగట్టి నిరోధించలేకపోయిన అసమర్థుడైన పోలీసు అధినేత ఉజిత్ జయసుందరను తొలగించే అధికారాలు సైతం తనకు లేవని గోటాబయ రాజపక్స వాపోతున్నాడు.

పోలీసు అధిపతికి కూడా తన సీనియర్ అధికారులను ఎంచుకునే అధికారం లేదని పోలీసు వ్యవస్థతో సంబంధం లేనివారితో నిండిపోయే కమిషన్‌కు మాత్రమే ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజల నుంచి ఎన్నికైన ప్రతినిధులున్నప్పటికీ కీలకమైన అధికార పీఠాలకు నియామకాలను కమిషన్లు చేపట్టడం ఎంత వరకు సబబని ఆయన ప్రశ్నిస్తున్నాడు. ప్రస్తుత రాజ్యాంగాన్ని సవరించి 1978 నాటి దానిని పునరుద్ధరిస్తానని గోటాబయ రాజపక్స అధ్యక్ష పదవీ ప్రమాణ స్వీకార వేదిక మీది నుంచే ప్రకటించారు. అది జరగాలంటే 225 మంది సభ్యులున్న శ్రీలంక పార్లమెంటులో ఆయన పార్టీకి మూడింట రెండు వంతులకు తక్కువకాని బలం చేకూరాలి. మొన్నటి అధ్యక్ష ఎన్నికలలో మాదిరిగా మెజారిటీ సింహళీయ ఓటర్లందరూ అనుకూలంగా ఓటు వేసినా అది సాధ్యమవుతుందో లేదో చూడాలి. ఇప్పటికే సుదీర్ఘ తమిళ ఈలం ఉద్యమంలో ఎంతో రక్తపాతాన్ని చవిచూసిన శ్రీలంక మళ్లీ గోటాబయ రాజపక్స సంపూర్ణ నిరంకుశాధిపత్యంలోకి జారిపోయే విధంగా పార్లమెంటు ఎన్నికల్లో ఆయన పార్టీకి తిరుగులేని మెజారిటీ లభిస్తే అక్కడి మైనారిటీల పరిస్థితి ఏమిటనేది అసలైన ప్రశ్న.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News