Thursday, May 16, 2024

ఎస్‌ఎస్‌ఎల్‌వి ప్రయోగం అనుకున్న ఫలితాలు ఇవ్వలేదు : ఇస్రో వెల్లడి

- Advertisement -
- Advertisement -

SSLV launch did not give expected results: ISRO reveals

శ్రీహరికోట : ఇస్రో కొత్తగా అభివృద్ది చేసి తొలిసారి ప్రయోగించిన చిన్న ఉపగ్రహ వాహక నౌక (ఎస్‌ఎస్‌ఎల్‌వి) ప్రయోగానికి ఆది లోనే అవాంతరాలు ఎదురయ్యాయి. ఈవోఎస్02, ఆజాదీశాట్ ఉపగ్రహాలను కక్షలో ప్రవేశ పెట్టడమే లక్షంగా ఆదివారం జరిగిన ఈ ప్రయోగం అనుకున్న ఫలితాలు ఇవ్వలేదని ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ వెల్లడించారు. ఆదివారం ఉదయం 9.18 గంటలకు తిరుపతి జిల్లా సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్(షార్) లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి ఎస్‌ఎస్‌ఎల్‌వి నింగి లోకి దూసుకెళ్లింది. ఈ రాకెట్ ఈవోఎస్ 02, ఆజాదీ శాట్ ఉపగ్రహాలను మోసుకెళ్లింది. ఈవోఎస్ 02 ఉపగ్రహం బరువు 140 కిలోలు. ఇది భూమిని పరిశీలిస్తుంది. ఆజాదీశాట్ బరువు 8 కిలోలు. 75 ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 750 మంది విద్యార్థులు దీన్ని రూపొందించారు. తొలి మూడు దశలు అనుకున్నట్టుగానే పూర్తయ్యాయి. కానీ ఉపగ్రహాలను కక్ష లోకి ప్రవేశ పెట్టే టెర్మినల్ దశలో సంబంధాలు తెగిపోయి సమాచారం లభ్యం కాలేదు.

దీంతో తుది ఫలితాల్ని ప్రకటించడానికి ఇస్రో వాయిదా వేసింది. సమాచారాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఉపగ్రహాలు నిర్దేశిత కక్ష లోకి చేరాయో లేదో ప్రకటిస్తామని సోమనాథ్ ఉదయం ప్రకటించారు. సమాచారాన్ని పూర్తిగా విశ్లేషించిన శాస్త్రవేత్తలు ఉపగ్రహాలు నిర్దేశించిన కక్ష లోకి కాకుండా ఇతర అస్థిర కక్ష లోకి చేరుకున్నట్టు గుర్తించామని ఇస్రో ఆదివారం మధ్యాహ్నం వెల్లడించింది. దీంతో ఎస్‌ఎస్‌ఎల్‌వి డి1 పేరిట చేపట్టిన ఈ ప్రయోగం పూర్తిస్థాయి లక్షాల్ని చేరుకోలేక పోయామని తెలిపింది. సెన్సార్ వైఫల్యాన్ని గుర్తించి దాన్ని నివృత్తి చేయడంలో తలెత్తిన ఓ లాజిక్ వైఫల్యం వల్లనే ఈ సమస్య ఏర్పడినట్టు గుర్తించామని పేర్కొంది. దీంతో ఉపగ్రహాలు నిర్దేశించిన 356 కిమీ దీర్ఘ వృత్తాకార కక్షలో కాకుండా 356 x 76 కిమీ వలయాకార కక్ష లోకి చేరాయని తెలిపింది. ఫలితంగా ఈ ఉపగ్రహాలు నిరుపయోగమైనట్టు వెల్లడించింది. ఈ ఘటనపై ఓ కమిటీని నియమిస్తామని , ఆ కమిటీ పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసి సిఫార్సులు చేస్తుందని ఇస్రో తెలియజేసింది. ఈ సిఫార్సులను అమలు చేసి తిరిగి ఎస్‌ఎస్‌ఎల్‌వి డి 2 పేరిట ప్రయోగం చేపడతామని వెల్లడించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News