Wednesday, December 4, 2024

రోదసి రంగంలో స్టార్టప్‌లకు కీలక పాత్ర

- Advertisement -
- Advertisement -

ప్రపంచ మార్కెట్‌లో మరింత వాటా సాధించేందుకు తన అంతరిక్ష కార్యకలాపాల పెంపు కోసం భారత్ చూస్తున్నందున ప్రైవేట్ రంగం, స్టార్టప్‌లు కీలక పాత్ర పోషించవలసి ఉంటుందని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చైర్మన్ ఎస్ సోమనాథ్ శుక్రవారం ఉద్ఘాటించారు. తిరువనంతపురంలో కేరళ స్టార్టప్ మిషన్ (కెఎస్‌యుఎం) నిర్వహించిన దేశ ప్రధాన స్టార్టప్ ఉత్సవం హడిల్ గ్లోబల్ 2024లో ‘ఇస్రో లక్షం, భారత అంతరిక్ష సాంకేతిక సంస్థల వృద్ధి’ కార్యక్రమంలో సోమనాథ్ ప్రసంగించారు. కోవలంలో స్టార్టప్ ఉత్సవం రెండవ రోజు సోమనాథ్ ప్రసంగిస్తూ, ‘అంతరిక్ష శక్తిగా గుర్తింపు ఉన్నప్పటికీ ప్రపంచ వాణిజ్యంలో భారత వాటా 386 యుఎస్ బిలియన్ డాలర్లతో కేవలం రెండు శాతం. దీనిని 2030 నాటికి 500 బిలియన్ యుఎస్ డాలర్లకు 2047 నాటికి 1.5 ట్రిలియన్ యుఎస్ డాలర్ల స్థాయికి పెంచాలని భారత్ యోచిస్తోంది’ అని తెలియజేశారు.

ప్రైవేట్ రంగంలో వాణిజ్య కార్యకలాపాల అవకాశాల గురించి సోమనాథ్ ప్రస్తావిస్తూ, భారత్ వద్ద కేవలం 15 పని చేసే రోదసీ ఉపగ్రహాలు ఉన్నాయని, అది ఒక విధంగా చిన్న సంఖ్య అని చెప్పారు. రోదసి టెక్నాలజీలో దేశం నైపుణ్యం, ఉపగ్రహ తయారీ సంస్థల సంఖ్య పెరుగుదలను పరిగణనలోకి తీసుకుంటే అంతరిక్షంలో భారత్‌కు కనీసం 500 ఉపగ్రహాలు ఉండవలసిన ఆవశ్యకత ఉందని సోమనాథ్ తెలిపారు. ‘ఇప్పుడు ఉపగ్రహాలను తయారు చేసి, అంతరిక్షంలో ప్రవేశపెట్టే సామర్థం ఉన్న అనూక మంది ప్రైవేట్ వ్యక్తులు మార్కెట్‌లో ఆవిర్భవిస్తున్నారు. తుదకు ప్రైవేట్ లాంచ్‌ప్యాడ్‌లు కూడా వస్తున్నాయి’ అని ఆయన చెప్పారు.2014లో ఏకైక అంతరిక్ష సంబంధిత స్టార్టప్ ఉండగా, ఆ సంఖ్య 2024 నాటికి 250 పైగా పెరిగిందని, ఒక్క 2023 సంవత్సరంలోనే రోదసి స్టార్టప్‌లు రూ. 1000 కోట్లకు పైగా పెట్టుబడులు ఆకర్షించాయని, ఇప్పుడు 450 ఎంఎస్‌ఎంఇలు, 50 పైగా బడా సంస్థలు రోదసి రంగానికి చురుకుగా సేవలు అందిస్తున్నాయని సోమనాథ్ చెప్పినట్లు కెఎస్‌యుఎం వెల్లడించింది. ఇస్రో వివిధ ప్రాజెక్టులపై 61 దేశాలతో సహకరిస్తోందని సోమనాథ్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News