Monday, April 29, 2024

ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి: మామిళ్ల రాజేందర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తుందని, ఉద్యోగులు కూడా ప్రభుత్వానికి పేరు తీసుకురావడానికి తమవంతు కృషి చేస్తున్నారని టిఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ పేర్కొన్నారు. ఈ తొమ్మిది సంవత్సరాల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక పథకాలను పేదలకు అందేలా ఉద్యోగులు అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా టిఎన్జీఓ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు డా.ముజీబ్‌హుస్సేనీ ఆధ్వర్యంలో ‘హైదరాబాద్ టిఎన్జీఓ తెలంగాణ ఉద్యోగుల ధూంధాం’ కార్యక్రమం నాంపల్లిలో ఘనంగా జరిగింది.

ఈ ధూంధాంకు భారీ సంఖ్యలో ఉద్యోగులు హాజరుకాగా, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆయాచితం శ్రీధర్, బిఆర్‌ఎస్ హైదరాబాద్ జిల్లా ఇన్‌చార్జీ దాసోజు శ్రావణ్, టిఎన్జీఓ ప్రధాన కార్యదర్శి జగదీశ్వర్, ట్రెసా రాష్ట్ర అధ్యక్షుడు వంగ రవీందర్‌రెడ్డి, నాలుగోతరగతి ఉద్యోగుల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిన్‌హసన్, టిఎన్జీఓ హైదరాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి విక్రమ్‌కుమార్, అసోసియేట్ అధ్యక్షుడు కెఆర్ రాజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా టిఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ మాట్లాడుతూ ఉద్యోగుల పెండింగ్ సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. బిఆర్‌ఎస్ హైదరాబాద్ జిల్లా ఇన్‌చార్జీ దాసోజు శ్రావణ్, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆయాచితం శ్రీధర్‌లు మాట్లాడుతూ ఒకప్పుడు సమైక్య పాలనలో తెలంగాణ ఉద్యోగులకు తీవ్ర అన్యాయం జరిగిందని, సమైక్య పాలకులు తెలంగాణ ఉద్యోగులను అణచివేశారని వారు పేర్కొన్నారు. సిఎం కెసిఆర్ ఆధ్వర్యంలో కోట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగులకు అన్ని రకాలుగా న్యాయం జరిగిందని అందరూ సంతోషంగా ఉన్నారని వారు పేర్కొన్నారు. హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు ముజీబ్‌హుస్సేనీ మాట్లాడుతూ ఉద్యోగుల కోసం అనేక కార్యక్రమాలను చేపడుతున్నామని, అవన్నీ విజయవంతం అయ్యాయని ఆయన తెలిపారు. రానున్న రోజుల్లో ఉద్యోగుల కోసం మరిన్ని మంచి కార్యక్రమాలు చేపట్టడానికి తాను కృషి చేస్తానని ముజీబ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా 25 మంది ప్రత్యేక తెలంగాణ కోసం పోరాడిన ఉద్యమ కారులను సన్మానించారు. దీంతోపాటు హైదరాబాద్ జిల్లాలోని 58 మంది యూనిట్ అధ్యక్ష, కార్యదర్శలు, ప్రాథమిక సభ్యులను మొమోంటోతో సత్కరించారు. ఈ ధూంధాంలో భాగంగా ఆట, పాటలతో కళాకారులు ఉద్యోగులను అలరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News