Friday, April 26, 2024

పాత్రికేయ శిఖరం రవీష్‌కుమార్

- Advertisement -
- Advertisement -

వార్తా పత్రికల పుట్టుకకు సమాచార వ్యాప్తియే ప్రధాన కారణం. పరతంత్ర కాలంలో పుట్టుకొచ్చిన పత్రికలు స్వరాజ్య కాంక్ష ధ్యేయంగా నడిచాయి. స్వతంత్ర పోరు లో దినవారి సమాచారం కోసం ప్రజలు పత్రికల కోసం ఎదురుచూసేవారు. స్వాతంత్య్ర అనంతరం కూడా దేశాభివృద్ధి లో పత్రికల పాత్రకు ఎంతో గణనీయంగా సాగింది. ప్రభుత్వాల పాలనపై పత్రికలు నిశిత పరిశీలనతో ఉన్నదున్నట్లు రాసి ’ఫోర్త్ ఎస్టేట్’ గౌరవాన్ని ఇనుమడింపజేసేవి. ఇలా పాలనలోని కుతంత్రాలను వార్తల ద్వా రా ప్రజలకు తెలియజేసే బాధ్యతని పత్రికలు తమ విద్యుక్త ధర్మంగా భావించేవి. ఈ క్రమంలో పత్రికలు ప్ర భుత్వ కన్నెర్రకు గురై ఇబ్బందులను కూడా ఎదుర్కొనే వి. అలాంటి సర్కారీ వివక్షను ఆయా పత్రికా యాజమాన్యాలు సవాలుగా తీసుకోని వెరవకుండా వార్తలు రాస్తూ చట్టపర భద్రతలో కొనసాగేవి. పెట్టుబడిదారులే య జమానులైనా పత్రికా నిర్వాహకులకు తగినంత స్వేచ్ఛ ఉండేది. ధీర పాత్రికేయులకు యాజమా న్యం నుండి గుర్తింపు, రక్షణ, ప్రో త్సాహం, ప్రశంసలు లభించేవి.
ఇప్పుడు కాలం మారింది. పెట్టుబడిదారులు రాజకీయాల్లోకి వచ్చేశారు.

సమాచార వ్యవస్థను తమ గుప్పిట్లోకి తీసుకుంటున్నారు. వారి రాజకీయ ప్రయోజనమే పత్రికల, టివి చానళ్ల లక్ష్యంగా మారింది. ప్రభుత్వాన్ని విమర్శించేందుకు రాతగాళ్లకు స్వేచ్ఛనిచ్చిన నిన్నటి పత్రికాధిపతులు ఇప్పుడు అందుకు సిద్ధంగా లేరు. ఇంత కాలం పాత్రికేయులకు రక్షణగా నిలిచి ప్రభుత్వంతో తలపడే యాజమాన్యాలు ఇప్పుడు తలలు వాల్చేస్తున్నాయి. ప్రభుత్వాలు ఏకంగా రచయితలను, పాత్రికేయులను లక్ష్యంగా చేసుకొని దాడులకు సిద్ధపడుతున్నాయి. ఓ టివి ఛానల్ నుండి వరుసగా విమర్శలు ఎదుర్కొన్న వ్యాపారి అదే టివి ఛానల్ లో పెట్టుబడి పెట్టి నిలదీసిన నోరు తోనే ప్రశంసలు కురిపించుకుంటున్నాడు. తన వ్యాపార సామ్రాజ్యంలోని లొసుగులను వెలుగులోకి రాకుండా జాగ్రత్త పడుతున్నాడు. దీనితో బతుకుతెరువు కోసం సర్దుకుపోయేవారు పోగా వృత్తి నిబద్దత, నిజాయితీ గల పాత్రికేయులకు మాత్రం ఈ పరిస్థితి సంకటాల్ని సృష్టిస్తోంది. పార్టీ మారిన రాజకీయ నేతలు టీవీ డిబేట్లలో నిన్నటి దాకా కీర్తించిన పార్టీకి నేడు నిందించడానికి వెనుకాడనట్లు పార్టీల వారీగా విడిపోయిన ఛానళ్లలో పనిచేసేవారు కూడా ఛానల్ మారితే కనబడని కండువాను మార్చక తప్పడం లేదు.

పాత్రికేయవృత్తి అభిరుచి, ఆసక్తితో మొదలై ఇప్పుడు కూటి కొరకు కోటి విద్యల్లో ఒకటిగా మిగిలిపోయింది. అయితే అందరిలో కొందరైనా తప్పును తప్పని చెప్పే తన వ్యక్తిత్వాన్ని చంపుకోలేక, ఉద్యోగం కల్పించిన సకల సౌకర్యాలను వదిలేసి స్వేచ్చావాయువుల కోసం బయటికి వస్తున్నారు. ఈ మధ్య ఎన్డీటీవీ లో 29.81% భాగస్వామ్యాన్ని గౌతమ్ అదానీ కొనుగోలు చేసినట్లు వార్తలు వచ్చా యి. ఆ క్రమంలో అందులో పనిచేస్తున్న ప్రముఖ పాత్రికేయుడు రవీ ష్ కుమార్ రాజీనామా చేయడం ఓ నిరసనాత్మక సంచలనమే.రవీష్‌కు ఎన్డీటీవీకి ఉన్న అనుబంధం సామాన్యమైనది కాదు. ఢిల్లీ యూనివర్సిటీలో చదువు పూర్తయిన వెంటనే 1996లో ఆయన ఎన్డీటీవీలో చేరారు. చిన్న స్థాయి ఉద్యోగి నుండి ఎన్డీటీవీ హిందీ ఛానల్ కు ఎడిటర్ ఇన్ చీఫ్ దాకా ఎదిగారు. 26 ఏళ్లపాటు తన శ్రమ, కృషి, మేధస్సును దాని వృద్ధికి ధారపోశారు. తన శాశ్వత చిరునామా ఎన్డీటీవీ అనుకొని సాగారు.

ఆ ఛానల్ లో వివిధ కార్యక్రమాల రూపకర్తగా దాని వీక్షకుల సంఖ్యను, రేటింగ్ ను పెంచగలిగారు. గత అయిదేళ్లుగా ఆయన స్వయంగా నిర్వహిస్తున్న ప్రైమ్ టైమ్ ప్రోగ్రాం అత్యధిక వీక్షక ఆదరణ పొందడంతో పాటు ప్రభుత్వ కన్నెర్రకు కారణమైంది. ప్రతిరోజూ రాత్రి తొమ్మిది గంటలనుండి దాదాపు 45 నిమిషాలపాటు సాగే ఈ కార్యక్రమంలో ఆయన కేంద్రంలోని బిజెపి పాలనను దుయ్యబట్టడంతో వ్యక్తిగతంగా రవీష్ తో పాటు ఎన్డీటీవీ కూడా చిక్కుల్ని ఎదుర్కొంది. రవీష్ ప్రైమ్ టైమ్ ఆరంభించిన నుండి ఏడాదికో కేసు మాదిరి రకరకాల దర్యాప్తులను ఆ ఛానల్ ఎదుర్కొంది. 2015 లో ప్రకటనదారులపై ఒత్తిడి తెచ్చి ఛానల్ ఆదాయానికి గండి కొట్టడం జరిగింది. 2016 లో విశేష ప్రజాదరణ పొందుతున్న హిందీ ఛానల్ ను కొంతకాలం ప్రభుత్వం నిషేధించింది. అయినా తమ దారికి రాని ఛానల్ ని దాని యాజమాన్యంలో భారీ వాటా కొనుగోలుతో ఇప్పుడు ముక్కుతాడు వేశారు.
అయితే గౌతమ్ అదానీకి ఆ అవకాశం ఎలా చిక్కింది అనేది ఆసక్తికరమైన అంశం. ఎన్డీటీవీ వ్యవస్థాపకులైన ప్రశాంత్ రాయ్ మరియు రాధికా రాయ్ దంపతులు దాని విస్తరణ కోసం 2008 లో ఓ బ్యాంక్ నుండి రూ. 375 కోట్లు అప్పు తీసుకొన్నారు. అయితే దాన్ని సకాలంలో చెల్లించలేక ఆ అప్పును విసిపిఎల్ సంస్థకు బదిలీ చేసి ఛానల్ లో దానికి 29 % వాటాను కట్టబెట్టారు. అప్పటికి రాయ్ దంపతులకు 32 % వాటా ఉంది. పబ్లిక్ ఇష్యూ ద్వారా అప్పటికే ఎన్డీటీవీలో 8.26 % వాటా ఉన్న అదానీ విసిపిఎల్ నుండి 29 % వాటా కొనడంతో ఛానల్ పై ఆయన హక్కు 37 .44 % అయింది. దీనితో ఇప్పుడు ఎన్డీటీవీలో అతిపెద్ద వాటాదారుడు గౌతమ్ అదానియే. ఆగస్టు 2022 లో ఈ కొనుగోలు ప్రధానవాటాదారులకు తెలియకుండానే జరిగిపోయింది.

బోర్డులో డైరెక్టర్ల మార్పిడికి రంగం సిద్ధం కాగానే అదానీ మద్దతుదారులతో తమకు పొసగదని ప్రణయ్ రాయ్, రాధికా రాయ్ 29 నవంబర్ నాడు తమ నిర్ణాయక మండలి సభ్యత్వానికి రాజీనామా చేశారు, అవి వెంటనే ఆమోదం పొందాయి. ఆ మర్నాడే రవీష్ ఎన్డీటీవికి తన రాజీనామాను సమర్పించారు. 48 ఏళ్ల వయసులో ఏడాదికి రూ.3 కోట్ల ప్యాకేజీపై దేశంలోనే నెంబర్ వన్ గా పేరొందిన రవీష్ కుమార్ ఎన్డీటీవీ పాత్రికేయ అనుబంధం ఇలా ముగిసింది. ఇదంతా ముందే ఊహించిన రవీష్ తన గొంతును విరామరహితంగా వినిపించేందుకు సొంత యూట్యూబ్ ఛానల్ ని జూన్ 2022 లో ఆరంభించారు. ఇప్పటికి దానికి 30 లక్షల మంది సబ్ స్క్రైబర్స్ ఉన్నారు. తన రాజీనామా అనంతరం ఆయన తన యూట్యూబ్ ప్రసంగాన్ని వారం రోజుల్లో 20 లక్షల మంది చూశారు.

లక్షన్నర వీక్షకులు రవీష్ కు భావి శుభాకాంక్షలను తెలిపారు. ఆ ప్రసంగంలో ఆయన దేశంలో జర్నలిజం దౌర్భాగ్య పరిస్థితిని కూడా ఉటంకించారు. ఇవ్వాళ దేశ జర్నలిజంలో చీకటి యుగం సాగుతుందని, దేశంలో లెక్కలేనన్ని వార్తా సంస్థలున్నా అన్నీ నీతి తప్పాయని, ప్రసార మాధ్యమాల పర్యావరణమే కుప్పకూలి ధ్వంసమై పోయిందని అన్నారు. వీష్ రాజీనామా పట్ల దేశంలోని కొన్ని పత్రికలు, యూట్యూబ్ చానళ్ళు విస్మయం ప్రకటించి, కష్టకాలంలో ఆయనకు మద్దతుగా నిలిచాయి. రవీష్ రాజీనామా పట్ల కొన్ని వర్గాలు సంబరాలు చేసుకోవడాన్ని కరణ్ థాపర్ ఖండించారు. ఆయన యూట్యూ బ్ ఛానల్ కూడా నడవకుండా ప్రభుత్వం ఆ సంస్థపై ఒత్తిడి తెచ్చే అవకాశముందని అంటున్నారు. దేశ పౌరుడిగా మిగితా జనం తరపున రవీష్ సంధించే ప్రశ్నలకు జవాబు చెప్పలేని ప్రభుత్వం ఆయన గొంతు నొక్కేసే చర్యలు రాజ్యాంగ పరంగా వచ్చిన వాక్ స్వాతంత్య్రనికే మరణశాసనం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News