Monday, April 29, 2024

ఆంధ్ర విషపు కౌగిలిలో ఫూలే బలి!

- Advertisement -
- Advertisement -

అణగారిన కులాల నుండి వచ్చిన జ్యోతిరావు ఫూలే 1834- 38 ప్రాంతంలో మరాఠీ పాఠశాలలో విద్యను ప్రారంభిస్తే ఆధిపత్య బ్రాహ్మణీయ వర్గాలు అడ్డుకుని బలవంతంగా విద్యను మానిపించేందుకు బెదిరింపులకు దిగినారు. పిల్లిని బంధిస్తే పులి అవుతుందో లేదో తెలియదు కానీ స్వాతంత్య్రానికి పూర్వమే బహుజనులు అందులో బహుజన ఆడబిడ్డలకు విద్యనందించాలన్న తాపత్రయంతో వీరోచితంగా పోరాడి సాధించిన ఫూలేకు చరిత్రలో సంఘ సంస్కర్తగా రావాల్సిన ప్రాచుర్యం అందకుండా ఆంధ్రప్రాంతంలో పుట్టి పెరిగిన వారిని సంఘ సంస్కర్తగా ముద్రించి ఫూలెను మళ్ళీ వెనుకబాటుతనానికే గురి చేశారు అన్నది ఇట్టే తేటతెల్లం అవుతుంది.

వత్ భారత దేశంలో స్త్రీలకు అందులో శూద్రాతి శూద్రులకు విద్యనందించాలని నినదించిన మహాత్మా జ్యోతిరావు ఫూలే ఆంధ్రా విషపు కౌగిలిలో బలి అయ్యారా అంటే అవుననే సమాధానం వస్తున్నది. బహుజన వాదం విస్తరించి పునాదుల్లోకి వెళ్లి ఆధిపత్య అహంకారానికి ప్రతీకగా నిలిచిన జ్యోతిరావు ఫూలేను తెలుగు రాష్ట్రాలలో మరుగున పడేలా చెయ్యడంతో పాటు యావత్ భారత దేశంలోనే ఆనవాళ్ళు కనిపించకుండా జరిగిన కుట్ర ఆంధ్రా ప్రాంతం నుండే మొదలు అయిందన్న వాస్తవాలు బహుజనంలో వొళ్ళు గగుర్పాటుకు గురిచేస్తున్నాయి. అవిభక్త మద్రాస్ రాష్ట్రంలో భాగంగా ఉండి విడిపోయిన ఆంధ్ర ప్రాంతం బ్రిటిష్ ఏలుబడిలో ఉండడమే ఇందుకు కారణంగా కనిపిస్తోంది.

బ్రిటిష్ ఏలుబడిలో ఉండడంతో ఇంగ్లీషు లాంటి భాష మీద గట్టి పట్టు సాధించిన ఆంధ్ర ప్రాంతీయులు అప్పటికే అందుబాటులో ఉన్న సాంకేతికతను అడ్డు పెట్టుకుని ఈ కుట్రలకు తెర లేపినట్లు స్పష్టంగా అర్థమవుతుంది. గల్లీ నుండి ఢిల్లీ వరకు ఎవరెవరు ఏ ఏ రంగాలలో నిష్ణాతులన్న విషయం కనిపెట్టిన ఆంధ్రులు భవిష్యత్‌లో తమకు ఎక్కడెక్కడ బ్రేక్ పడుతుందోనన్న నిజాన్ని గుర్తించిన మీదటనే అటువంటి వారి చరిత్రను తొక్కిపెట్టడమే కాకుండా అటువంటి చారిత్రాత్మక నేపథ్యం కలిగిన వ్యక్తులను పోలి ఉండే వారిని తెర మీదకు తెచ్చి అసలు వారిని తొక్కిపెట్టే కుతంత్రాలకు నాడే శ్రీకారం చుట్టారు. అప్పటికే ఆంధ్రప్రాంతంలో ప్రచురణ సంస్థలు ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవడం, సినీరంగం విస్తరించిన నేపథ్యంలో కవులు, కళాకారులు పుట్టుకరావడం ఒక ఎత్తు అయితే ఆనాటి కవులు సృష్టించిన పాత్రలతో వీరే నిజమైన హీరోలు అని ప్రజలు భ్రమించించేలా రాసిన కథలు వాడకంలోకి రావడంతో జ్యోతిరావు ఫూలే చరిత్ర వెలుగులోకి రాకుండా పోయింది అనేది ముమ్మాటికీ నిజం.

అందుకు ఆధారాలు లేక కాదు. ఇప్పుడు ఇందులో అవి జోప్పిస్తే అసలు కథ డైవర్ట్ అవుతుందన్న మీమాంసతోటే అందులోకి పోవడం లేదు. అటువంటి విషపు రాతల కారణంగానే విద్య విశ్వకరణను సమర్థించిన మొట్టమొదటి సంఘ సంస్కర్త జ్యోతిరావు ఫూలే లాంటి మహనీయులకు తెలుగుగడ్డ మీదనే కాదు యావత్ భారత దేశంలోనే సముచిత గౌరవం లభించలేదు అన్నది బహుజనులను వెంటాడుతుంది. సామాజిక సంస్కరణలకు కేంద్ర బిందువుగా మారడమే కాకుండా నాడున్న ఆధిపత్య వర్గాల అణ చివేతలను ప్రతిఘటిస్తూ బ్రహ్మణీయవాదాన్ని ఎదుర్కొన్న ధీశాలి మహాత్మా జ్యోతిరావు ఫూలే లాంటి వారికి ఈ పరిస్థితి ఎదురైయ్యింది అంటే చరిత్రను పెకిలిస్తే ఇంకెన్ని నిజాలు ఆ తవ్వకాలలో బయట పడతాయో అన్న సందేహం ప్రతి బహుజనుడిని తొలిచివేస్తుంది.

చతుర్వర్ణ (కుల వ్యవస్థ)ను కూకటివేళ్లతో సహా పెకిలించడంతో పాటు దిగువ కులాలకు విద్యతో పాటు సమాన హక్కులను కల్పించేందుకు గాను 1873 సెప్టెంబర్ 24 న సత్యశోధక్ సమాజ్ (సొసైటీ ఆఫ్ సీకర్స్ ఆఫ్ ట్రూత్) సంస్థను ప్రారంభించారు. అంతటితో ఆగని ఆయన 1882 ప్రాంతంలో బ్రిటిష్ వలసవాదులకు బహుజనులు విద్యకు దూరంగా ఉండడంతో ఎదుర్కొంటున్న అసమానతలను ఏకరువుపెడుతూ నివేదికల రూపంలో నివేదించి ప్రత్యేక పాఠశాలల ఏర్పాటు గావించారు. అంతటితో కూడా సంతృప్తి చెందక విద్యావంతురాలైన తన సతీమణి సావిత్రి బాయితో కలసి ఆడపిల్లలకు అందులో బహుజనులకు చెందిన ఆడపిల్లల కోసమై 1848లో పుణెలో మొట్టమొదటి బాలికల పాఠశాలను ప్రారంభించిన ఫూలే 1851 నాటికి మరో రెండు పాఠశాలలు ప్రారంభించి ఆకాశం లో సగభాగమైన జనాభాలో మెజారిటీకి చెందిన బహుజన ఆడబిడ్డలకై ప్రారంభించిన సంస్కర్తగా జ్యోతిరావు ఫూలే చరిత్రలోనే శాశ్వతంగా నిలిచిపోయారు.

అంతే కాదండోయ్ 1855 రాత్రి బడి ప్రారంభించి సమాజంలో సగానికి మించి ఉన్న జనాభాను విద్యావంతులుగా తీర్చి దిద్దేందుకు శ్రీకారం చుడితే తట్టుకోలేక ఆధిపత్య వర్గాలు 1849 లో ఫూలేను కుటుంబం నుండి బహిష్కరించి మానసిక ఆనందాన్ని పొందారు. అయినా బడుగులు బానిసలుగా ఉండడానికి వీలు లేదంటూ అందుకు ఆయా వర్గాలలో చైతన్యం పెంపొందించేందుకుగాను దీనబంధు పత్రికను స్థాపించి భవిష్యత్ భారత దేశంలో బడుగుల పాత్రపై అనేక రకాల వ్యాసాలు అందించారు. దానికి తోడు భావజాల ప్రచారానికై తాను రాసిన గులాంగిరి సేద్యం గాని చర్మకోలా గ్రంధాలు వర్తమానానికి స్ఫూర్తిదాయకంగా నిలిచాయి.

బొల్లం శివశంకర్
(కో- కన్వీనర్ యునైటెడ్ ఫూలే ఫ్రంట్)

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News