Friday, April 26, 2024

ప్లాస్మా వ్యాపారం చేస్తే కఠిన చర్యలు..!

- Advertisement -
- Advertisement -

Strict measures if plasma is traded

 ప్రత్యేక టీం ద్వారా నిఘా పెట్టనున్న అధికారులు
ప్రైవేట్ హాస్పిటల్స్‌పై సర్కార్ సీరియస్
సిఎంకు నివేదిక అందియనున్న ఆరోగ్యశాఖ

హైదరాబాద్ : రాష్ట్రంలో ప్లాస్మా వ్యాపారం చేస్తే కఠిన చర్యలు ఉంటాయని వైద్యారోగ్యశాఖ హెచ్చరించింది. రక్తం, ప్లాస్మా లాంటి పదార్ధాలను విక్రయించడం చట్టరిత్య నేరమని అలా చేసినా, వాటిని ప్రోత్సహించినా సదరు వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని డిఎంఇ డా రమేష్‌రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం ప్లాస్లాథెరఫీ కేవలం క్లినికల్ దశలో మాత్రమే జరుగుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు. దీనిలో భాగంగా ప్రభుత్వ ఆధీనంలో గాంధీ, ఇఎస్‌ఐ ఆసుపత్రుల్లో క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తుండగా, ఐసిఎంఆర్ నుంచి అనుమతి పొందిన కొన్ని ప్రైవేట్, కార్పొరేట్లలోనూ ట్రయల్స్ జరుగుతున్నట్లు ఆయన తెలిపారు. అయితే కరోనా నుంచి కోలుకున్న వ్యక్తులను కొన్ని హాస్పిటల్స్ ఏజెంట్ల ద్వారా సంప్రదించి ప్లాస్మా దానం చేస్తే డబ్బులు ఇస్తామని ప్రలోబాలకు గురిచేస్తున్నట్లు తమ దృష్టికి కూడా వచ్చిందని వైద్యశాఖ ఉన్నతాధికారుల్లో ఒకరు తెలిపారు. ఈక్రమంలో వాటిని అరికట్టేందుకు ప్రత్యేక టీంను కూడా ఏర్పాటు చేస్తున్నామని ఆయన అన్నారు. అతి త్వరలోనే కరోనా చికిత్సను నిర్వహించే ప్రైవేట్, కార్పొరేట్ హాస్పిటల్స్‌లో ఏర్పాట్లను పరిశీలిస్తామని వైద్యశాఖ అధికారులు పేర్కొంటున్నారు.

డబ్బు ఆశ చూపితే నేరం..

కరోనా నుంచి కోలుకున్న బాధితులు స్వతహాగా ప్లాస్మాను ఇస్తే ఎలాంటి ఇబ్బంది లేదని, కానీ ప్రలోబాలు, డబ్బుల కొరకు దానం చేస్తే ఖచ్చితంగా నేరంగా పరిగణించబడుతుందని అధికారులు వెల్లడిస్తున్నారు. ఇటీవల గ్రేటర్ పరిధిలోని రెండు మూడు హాస్పిటల్స్‌పై తమకు ఫిర్యాదులు అందాయని, వాటిపై పూర్తిస్థాయిలో ఎంక్వైరీ చేసి తప్పకుండా చర్యలు తీసుకుంటామని డిఎంఇ డా రమేష్‌రెడ్డి అన్నారు. ప్రైవేట్ హాస్పిటల్స్ వ్యాపారం చేస్తే ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని ఆయన హెచ్చరించారు. మరోవైపు ప్లాస్మాథెరఫీ చేసే ప్రైవేట్ హాస్పిటల్స్ సదరు బాధితుడి, దాత వివరాలను తప్పనిసరిగా ఆరోగ్యశాఖకు ఇచ్చే విధంగా అతి త్వరలోనే సర్కూలర్‌ను జారీ చేయనున్నట్లు ఆయన అన్నారు. దీనిలో భాగంగా రెండు రోజుల్లో వైద్యశాఖ ముఖ్య అధికారులతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.

అందరికీ ప్లాస్మా అవసరం లేదు…

ప్లాస్మాథెరఫీ చికిత్స అందరికీ అవసరం లేదని డిఎంఇ డా రమేష్‌రెడ్డి పేర్కొన్నారు. కేవలం క్రిటికల్ కండీషన్‌లో ఉన్న వారికి మాత్రమే నిర్వహించాలని ఐసిఎంఆర్ సూచించిందని, ఆ మార్గదర్శకాలను పాటించాలని ఆయన తెలిపారు. దీంతో పాటు కోలుకున్న ప్రతి కరోనా బాధితుడి నుంచి ప్లాస్మాను సేకరించడం వలన ఉపయోగం లేదని, కేవలం క్రిటికల్ కండీషన్ నుంచి కోలుకున్న వారిలోనే అత్యధిక శాతంలో యంటీబాడీలు ఉంటాయని ఆయన తెలిపారు. ప్లాస్మాథెరఫీ నిర్వహించేందుకు ప్రైవేట్, కార్పొరేట్ హాస్పిటల్స్ తప్పనిసరిగా ఐసిఎంఆర్ అనుమతి తీసుకోవాలని ఆయన సూచించారు. ఇదిలా ఉండగా, రాష్ట్రంలోని ప్రజలకు ఇబ్బందులకు కలుగకూడదనే ఉద్దేశ్యంతో అతి త్వరలో గాంధీ, ఇఎస్‌ఐలో ప్లాస్మా బ్యాంక్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ట్రయల్స్‌లో భాగంగా ప్రభుత్వ ఆధీనంలో ఇప్పటికే నలుగురు రోగులు ప్లాస్మాథెరఫీ ద్వారా కోలుకున్నారని గాంధీ వైద్యులు చెప్పారు.

ప్రైవేట్ హాస్పిటళ్లపై ఫిర్యాదుకు వాటాప్ నంబర్

రాష్ట్రంలోని ప్రైవేట్, కార్పొరేట్ హాస్పిటల్స్‌పై ప్రభుత్వం సీరియస్‌గా ఉంది. ఇటీవల వస్తున్న అధిక ఫీజులు వసూళ్లపై తనకు నివేదిక అందజేయాలని సిఎం వైద్యాధికారులకు సూచించినట్లు సమాచారం. ఈమేరకు పూర్తిస్థాయి వివరాలను నివేదిక రూపంలో తయారు చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఇదిలా ఉండగా కరోనా చికిత్సను అందించే ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రులు బెడ్ల వివరాలు, ధరల వివరాలు డ్యాష్ బోర్డు మీద తప్పనిసరిగా ప్రదర్శించాలని వైద్యశాఖ సూచించింది. అంతేగాక ప్రైవేట్ హాస్పిటల్స్‌పై ఫిర్యాదు చేసేందుకు 9154170960 వాట్సాప్ నంబర్‌ను కూడా అందుబాటులోకి తెస్తున్నట్లు ఆరోగ్యశాఖ అధికారులు చెప్పారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News