Home తాజా వార్తలు భానుడి ఉగ్రరూపం

భానుడి ఉగ్రరూపం

Sun-intensity

 వడగాల్పుల తీవ్రత.. ఉక్కపోత అధికం…
బయటకు వెళ్లలేక.. ఇంట్లో ఉండలేక…
కూలర్లు, ఏసీలు ఉన్నా ప్రయోజనం నిల్
సేద దీరేదెలా? భానుడి ప్రకోపం చల్లారేదెన్నడూ…!?

హైదరాబాద్ : అటు దేశ, ఇటు రాష్ట్రవ్యాప్తంగా భానుడు ఉగ్రరూపం కొనసాగుతోంది. రోజు రోజుకు ఉష్ణోగ్రతలు తీవ్రత రమవుతున్నాయి. వడగాల్పులు, ఎండల తీవ్రతతో జనం అల్లల్లాడిపోతున్నారు. వృద్ధులు, పిల్లలు, మహిళల పరిస్థితయితే చెప్పనవసరం లేదు. వేకువ జాము నుంచి ఉదయం 10 గంటల లోపు పనులేవైనా ఉంటే ముగించుకుని తిరిగి ఇళ్లకు పరిమితమయ్యే విధంగా పలువురు కార్యాచరణ సిద్ధపర్చుకున్నారు.

వేడిమి సమయంలో బయటకు అత్యవసరంగా వెళ్లాల్సిన వారు తగు జాగ్రత్తలతో ఇళ్ల నుంచి బయటపడుతున్నారు. పలువురు ఎండ వేడిమి నుంచి తమను తాము కాపాడుకునేందుకు గొడుగులను సైతం వెంటబెట్టుకుని వెళుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 42 డిగ్రీల నుంచి 46 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదు కానుండటం.. అంతే స్థాయిలో వడగాలుల ఉధృతి పెరగడంతో ప్రజానీకం ఉక్కిరి బిక్కిరవుతున్నారు.

కొన్ని ప్రాంతాల్లో ఎండ తీవ్రతకు ఇళ్లల్లో సైతం జనం పలు రకాల ఇబ్బందులనెదుర్కొంటున్నారు. రాష్ట్రంలోని ఆదిలాబాద్, జగిత్యాల, మిర్యాలగూడలలో 46 డిగ్రీలు, బోధన్, నిర్మల్, నిజామాబాద్‌లలో 45 డిగ్రీలు, మంచిర్యాల, కామారెడ్డి, కరీంనగర్‌లలో 44 డిగ్రీలు, మహబూబ్‌నగర్, వరంగల్‌లో 43 డిగ్రీలు, హైదరాబాద్, కొత్తగూడెం, పాల్వంచలలో 42 డిగ్రీలకు పైబడి ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ఎండ వేడిమికి తాళలేక జనం విలవిల్లాడుతున్నారు. రాష్ట్రంలో జూన్ 8 కల్లా రుతుపవనాలు వస్తాయని తొలుత భావించినప్పటికీ అవి కూడా అందని పండులా మరో ఐదు రోజులు రాకపోవచ్చన్న మరో పిడుగులాంటి వార్త ప్రజలను మరింత ఆందోళనకు గురిచేస్తోంది.

రోజురోజుకు భానుడు ప్రకోపం తీవ్రతరమవుతుండటం ఉష్ణోగ్రతలు నానాటికి పెరుగుతూ పోవడంతో ఎండ వేడిమి నుంచి ఉపశమనం మాట అలా ఉంచి.. ఎలా తట్టుకోవాలనే దానిపై జనం దృష్టి సారిస్తున్నారు. కొందరు ఇళ్లల్లో కూలీలు, ఏసీలకు పనిచెప్పినప్పటికీ అవి కూడా ప్రచండ భానుడి ప్రకోపం ముందు నిలువలేకపోతున్నాయా? అన్న అనుమానం సైతం వ్యక్తమవ్వక మానదు.

లాక్‌డౌన్ లేని పక్షంలో….

ఇదిలా ఉండగా, కరోనా లాక్‌డౌన్ వేళ ప్రజలంతా ఇంటి పట్టునే ఉన్నారు. అదే లాక్‌డౌన్ లేని పక్షంలో నిప్పుల కొలిమిని తలపిస్తోన్న భానుడి భగభగలకు, వడగాల్పులకు ఎందరో వడదెబ్బకు గురై ప్రాణాలు కోల్పోవాల్సిన అనైతిక స్థితి ఉండేదంటే అతిశయోక్తి కాదు. లాక్‌డౌన్ సడ ంపుల నేపథ్యంలో క్రమేపి జనజీవనం తిరిగి ప్రారంభమైనా ఎండ వేడిమికి ఇళ్ల నుంచి బయటకు వచ్చే కన్నా ఇళ్లల్లోనే ఉండి సెదతీరడం ఎంతో శ్రేయస్కరమని భావించిన ప్రజలు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ ఇళ్లకే పరిమితమయ్యారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. ప్రచండ భానుడి ప్రకోపం ఇంకెంతకాలం కొనసాగుతుందో చెప్పలేని పరిస్థితి ఉందని అంటున్నారు.

జనం నెత్తిన మరో పిడుగు లాంటి వార్త…

ఉత్తరాది సహా దేశంలోని పలు ప్రాంతాల్లో కొనసాగుతున్న వడగాల్పులు మరో 24 గంటలు కొనసాగుతాయని భారత వాతావరణ విభాగం(ఐఎండి) బుధవారం వెల్లడించింది. బంగాళాఖాతంలో నైరుతీ రుతుపవనాలు మరింత బలపడినప్పటికీ మరో ఒకట్రెండు రోజులు అధిక ఉష్ణోగ్రతలు, వేడిగాలులు కొనసాగుతాయని తెలిపింది. ఉత్తర, మధ్య భారత్‌లో పలు ప్రాంతాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతూ వేడిగాలులు వీస్తున్నాయని, కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రత 47 డిగ్రీల సెల్సియస్ దాటుతోందని ఐఎండి వెల్లడించింది. రానున్న 24 గంటల్లో తెలంగాణ, ఒడిశా, బీహార్, జార్ఖండ్, పంజాబ్, కర్ణాటకలలో వేడిగాలులు వీస్తాయని పేర్కొంది. పశ్చిమ రాజస్థాన్, విదర్భలలో అత్యధిక ఉష్ణోగ్రతలలో వడగాలులు వీస్తాయని ఐఎండి తెలిపింది.

సేద తీరేదెలా…?

ఎప్పటికప్పుడు వాతావరణం చల్లబడుతుందని, భానుడి ప్రకోపం నుంచి ఉపశమనం లభించవచ్చని ఆశగా ఎదురుచూస్తున్న రాష్ట్ర ప్రజలకు ఆశనిపాతమే మిగులుతోంది. మరోవైపు వడగాల్పుల తీవ్రత, ఉక్కపోత అధికమవుతోంది. దీంతో, ఎండ వేడిమి నుంచి సేద దీరేదెలా? అని జనం మదన పడుతున్నారు. ఇంటి నుంచి బయటకు అడుగుపెట్టలేని పరిస్థితి.. ఇంట్లో ఉండలేని పరిస్థితితో జనం ఒక రకంగా ఉక్కిరి బిక్కిరవుతున్నారనే చెప్పొచ్చు. ఎండ తీవ్రత ఎంత ఉన్నా తట్టుకోవచ్చు కానీ.. వడగాల్పులు, ఉక్కపోతను భరించడం కష్టమని జనం వాపోతున్నారు. భానుడి ప్రకోపం ఎప్పుడు చల్లారేనా? అని ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు.

Sun intensity intensifies in Telangana