Saturday, April 27, 2024

25 తీగల సరోద్ కాదు తబలా అంటేనే నాకు ఎంతో ఇష్టం

- Advertisement -
- Advertisement -

Tabla was my first love: Amjad Ali Khan

న్యూఢిల్లీ: సరోద్ మాస్ట్రోగా పేరున్న ఉస్తాద్ అంజద్‌అలీఖాన్ తన మొదటి ప్రేమ తబలాకేనని, 25 తీగల పరికరానికి(సరోద్‌కు) కాదని స్పష్టం చేశారు. సంసద్ టివి కోసం కాంగ్రెస్ ఎంపి శశిథరూర్ ఉస్తాద్‌ను ఇంటర్వూ చేయగా తన బాల్యంలోని పలు ఆసక్తికర సంఘటనలను ఆయన గుర్తు చేసుకున్నారు. బాల్యంలో తబలా పట్ల మక్కువ చూపానని, దాంతో ఆందోళన చెందిన తన తండ్రి దానిని కొన్ని నెలలపాటు తనకు కనిపించకుండా దాచారని ఉస్తాద్ తెలిపారు. రిథమ్ అర్థం కావాలంటే ప్రతి సంగీతకారుడికి తబలా ఎంతో ముఖ్యమని ఆయన అన్నారు. తాను ఎంతోమంది యువ తబలా కళాకారుల్ని ప్రోత్సహించానని తెలిపారు. సంగీతం పట్ల అంతగా ఆసక్తి చూపడానికి కారణమేమిటని థరూర్ అడగగా, ప్రతి మనిషి ఓ రిథమ్‌తో జన్మిస్తారు. కొందరు దానిని గుర్తిస్తారు. కొందరు గుర్తించలేకపోతారని ఆయన అన్నారు.

ప్రపంచంలో ధ్వని ఉన్నది, భాష ఉన్నది. తనకు అర్థమయ్యేది భాష కాదు, ధ్వని అని ఆయన అన్నారు. అందుకు తాను దేవునికి కృతజ్ఞుడినని అన్నారు. ధ్వని పారదర్శకమైనదని, అది ఎవరినీ మోసం చేయదని అన్నారు. ఉస్తాద్ తండ్రి హఫీజ్ అలీఖాన్ కూడా సరోద్ కళాకారుడే. ఆ కుటుంబం నుంచి ఉస్తాద్ ఆరో తరానికి చెందినవారు. 1960ల నుంచి ఉస్తాద్ పలు అంతర్జాతీయ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 75 ఏళ్ల ఉస్తాద్ తాను సంగీతకారుల కుటుంబంలో పుట్టడం తన అదృష్టమన్నారు. తల్లిదండ్రులు సంగీతకారులు కాకున్నా తమ సృజనాత్మకతతో రాణించారంటూ పండిట్ రవిశంకర్, ఉస్తాద్ అల్లాఖాన్, ఉస్తాద్ అల్లాఉద్దీన్‌ఖాన్, పండిట్ భీమ్‌సేన్‌జోషి, పండిట్ కుమార్ గాంధర్వలను ఆయన గుర్తు చేశారు.

వారంటే తనకు ఎంతో గౌరవమన్నారు. ఉస్తాద్ ఇద్దరు కుమారులు అమాన్ అలీబంగాష్, అయాన్ అలీబంగాష్ కూడా సరోద్ కళాకారులే. వీరు ఈ కుటుంబంలో ఏడోతరంవారు. ఎనిమిదో తరానికి చెందిన తన ఇద్దరు మనవళ్లు కూడా సంగీతం పట్ల మక్కువ చూపుతున్నారంటూ ఉస్తాద్ మురిసిపోయారు. లాక్‌డౌన్ సమయంలో తొమ్మిదేళ్ల తన ఇద్దరు మనవళ్లు రోజుకు రెండుగంటలపాటు రాగ్‌తిలక్‌కమోద్‌ను ప్రాక్టీస్ చేశారని ఆయన తెలిపారు. వాటిని యూట్యూబ్‌లో పెట్టారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News