Saturday, May 4, 2024

అవకాశాలను అందిపుచ్చుకుని పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలి

- Advertisement -
- Advertisement -

భద్రాద్రి కొత్తగూడెం : అవకాశాలను అందిపుచ్చుకుని పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలని రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు తెలిపారు. మంగళవారం తెలంగాణ రాష్ట్ర ఆవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జిల్లా పరిశ్రమల కేంద్రం ఆధ్వర్యంలో నవభారత్‌లో నిర్వహించిన తెలంగాణ పారిశ్రామిక ప్రగతి కార్యక్రమంలో విప్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ఏర్పాటుకు ముందు పరిశ్రమలు స్థాపించాలంటే ఒక్కో కార్యాలయం చుట్టూ, అదేవిధంగా బ్యాంకుల చుట్టూ, చెప్పులు అరిగేలా తిరిగిన పరిస్థితి నుంచి నేడు 15 రోజుల్లో సులభంగా అన్ని అనుమతులు మంజూరు చేస్తున్నామని చెప్పారు.

టిఎస్‌ ఐపాస్ ద్వారా పరిశ్రమలు ఏర్పాటు ప్రక్రియ సులభతరంగా చేయడంతో పారిశ్రామిక వేత్తలు ముందుకు వస్తున్నారన్నారు. పెట్టుబడులు రావాలంటే ఆషామాషి కాదని, అందుకు తగిన సెక్యూరిటీ ఉండాలని, నేడు మన రాష్ట్రంలో అలాంటి సెక్యూరిటి ఉంది కావున పరిశ్రమలు ఏర్పాటుకు ముందుకు వస్తున్నాయన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు శాంతి భధ్రతలు, సౌకర్యాలు, రాయితీలతో పాటు నీరు, బొగ్గు, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలు నేడు రాష్ట్రంలో కల్పిస్తున్నామని వివరించారు. అవకాశాలకు స్వర్గధామం భద్రాద్రి జిల్లా అని పేర్కొన్నారు. రాష్ట్ర ఏర్పాటు నుంచి ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రం చేపట్టిన పారిశ్రామికరణ వల్ల ప్రపంచ దేశాలు, సంస్థలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్నాయన్నారు.

రాష్ట్ర ప్రజలకు బంగారు భవిష్యత్తు అందించాలన్న విజన్ ముఖ్యమంత్రికి ఉంది కావున నేడు పోటీపడి అభివృద్ధిని సాధించేందుకు ఆలోచన చేస్తున్నట్లు చెప్పారు. పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను యువత సద్వినియోగం చేసుకుని ఆర్థికాభివృద్ధిని సాధించాలన్నారు. అనంతరం కొత్తగూడెం ఎంఎల్‌ఎ వనమా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్ర ఏర్పాటు తదుపరి విద్యా, ఉద్యోగ అవకాశాల కల్పనకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రం అవతరించిన తరువాత నేడు పల్లెలు, పట్టణాలు అద్భుతంగా అభివృద్ధి చెందుతున్నాయని అన్నారు. నేడు అన్ని రంగాలకు నిరంతరాయంగా 24 గంటలు ఉచిత విద్యుత్ ఇవ్వడం వల్ల పరిశ్రమలు ఏర్పాటుకు ముందుకు వస్తున్నారని చెప్పారు.

సులభతర అనుమతి విధానం, పరిశ్రమలకు రాయితీలు కల్పించడంలో పరిశ్రమల ఏర్పాటు ప్రక్రియ సులభతరమైందని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ప్రత్యేక రాయితీలు కల్పిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణనే అని స్పష్టం చేశారు. ఇల్లందు ఎంఎల్‌ఎ హరిప్రియ మాట్లాడుతూ అభివృద్ధి జరగాలంటే పారిశ్రామిక రంగం చాలా ముఖ్యమన్నారు. ఎంఎస్‌ఎంఈ ద్వారా గ్రామాలు, మండలాల్లో పారిశ్రామిక విప్లవం రావాలని తెలిపారు. ఏజెన్సీ ప్రాంతమైన మన జిల్లాలో పరిశ్రమలు ఏర్పాటు ఆవశ్యకత ఎంతో ఉందని, పరిశ్రమల పార్కులు ఏర్పాటు చేయాలని చెప్పారు. పరిశ్రమల ఏర్పాటులో నేడు తెలంగాణ దేశానికి దిక్సూచిగా నిలుస్తుందప్పారు. జిల్లా కలెక్టర్ అనుదీప్ మాట్లాడుతూ భద్రాద్రి జిల్లా పరిశ్రమలకు పెట్టింది పేరన్నారు.

తొమ్మిది సంవత్సరాల ప్రస్తానాన్ని పూర్తి చేసుకుని 10వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న దేశంలోనే యువ రాష్ట్రమని తెలిపారు. ప్రగతిలో దిక్సూచిగా, ప్రతీ రంగంలో ఆదర్శంగా నిలుస్తున్నామని చెప్పారు. నేడు ఆ పరిశ్రమలు సాధించిన ప్రగతిని ఘనంగా నిర్వహించుకుంటున్నామని చెప్పారు. సింగరేణి, బిటిపిఎస్, నవభారత్, కేటిపిఎస్, బిపిఎల్ ద్వారా పెట్టుబడులు ద్వారా ఉపాధి లభించినట్లు తెలిపారు. నాణ్యమైన విద్యుత్, మంచినీరు వంటి సాకర్యాలుంటేనే పరిశ్రమలు వస్తాయని పేర్కొన్నారు. కొవిడ్ వంటి విషమ పరిస్థితుల్లో మన రాష్ట్రానికి ఆక్సీజన్ సరఫరా చేశారని పరిశ్రమల సేవలను అభినందించారు.

జిల్లాలో ఈ 9 సంవత్సరాల్లో 22వేల కోట్ల పెట్టుబడితో పరిశ్రమలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.పారిశ్రామిక అభివృద్ధికి తోడ్పడిన సంస్థల అధికారులను శాలువాలు, మెమొంటోలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల శాఖ మేనేజర్ సీతారాం, ఎస్‌సి కార్పొరేషన్ ఈడి సంజీవరావు, కెటిపిఎస్ 5,6 దశల సిఈ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News