Tuesday, April 30, 2024

తాలిబన్ల బందీగా ఆఫ్ఘాన్

- Advertisement -
- Advertisement -

Taliban Victories In Afghanistan

ఇటీవల ఆఫ్ఘానిస్థాన్ నుంచి అమెరికన్ -నాటో (నార్త్ అట్లాంటిక్ ట్రిటీ ఆర్గనైజేషన్) దేశాల సైనిక బలగాలను సెప్టెంబర్ 2021 నాటికి ఉపసంహరించుకుంటామని జో బైడెన్ ప్రభుత్వం తీసుకున్న సంచనాత్మక నిర్ణయంతో ఆఫ్ఘాన్‌లో అస్థిరత్వ మంటలు రగులుట ప్రారంభమైంది. ఆఫ్ఘానిస్థాన్ ప్రభుత్వానికి, తాలిబన్లుకు మధ్య ఆధిపత్యపోరు అనాదిగా జరుగుతున్న విషయం తెలిసిందే. అమెరికా బలగాలు వెనక్కి తగ్గడం తో ఆఫ్ఘాన్ ప్రభుత్వానికి, తాలిబన్లకు మధ్య మరోసారి యుద్ధ వాతావరణం ప్రారంభమైంది.
ఆగస్ట్టున ఒకటో తేదీన కాందహార్ విమానాశ్రయంపై మిలిటెంట్ల దాడికి ప్రతిచర్యగా ఆఫ్ఘాన్ ప్రభుత్వం 24 గంటల పాటు ఉగ్ర రహస్య స్థావరాలను గురి పెట్టి వైమానిక దాడులు చేయగా 250కి పైగా తాలిబన్లు మరణించారని తెలిపింది. విదేశీ బలగాల ఉపసంహరణ పెరిగిన కొద్దీ తాలిబన్ల దాడులు, దురాక్రమణలు పెరుగుతున్నాయి. తాలిబన్లకు చేయూతను ఇచ్చేందుకు పాకిస్థాన్ ప్రేరేపిత 20కి పైగా ఉగ్రవాద సంస్థలు ముందుకు రావడంతో తాలిబన్లకు అనేక రెట్లు బలం చేకూరుతోంది. ప్రభుత్వ బలగాలు తాలిబన్లకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నప్పటికీ, అమెరికా లేదా రష్యా సాయుధ బలగాల సహాయం లేకుండా ఉగ్ర మూకను నిలువరించడం కష్టంగానే తోస్తున్నది. 1747లో ఏర్పడిన ఆఫ్ఘానిస్థాన్, అంతకు పూర్వం కొంత ఆఫ్ఘాన్, పాక్, కశ్మీర్‌లను కలిపి దురానీ పాలనకు చరమగీతం పాడి మహారాజ రంజిత్ సింగ్ అధీనంలోకి తీసుకోవడం, బ్రిటీష్ పాలకులతో మూడు ఆఫ్ఘాన్ యుద్ధాలు చవి చూడడం జరిగింది.
గతంలో రెండు అగ్ర రాజ్యాలైన అమెరి కా, రష్యాల మధ్య ఆధిపత్య పోరులో ఆఫ్ఘానిస్థాన్ భూభాగం యుద్ధ క్షేత్రంగా మారడం విదితమే. 1978 – 89 మధ్య కాలంలో రష్యా మద్దతుతో ఏర్పడిన కమ్యూనిస్టు పాలనకు చరమగీతం పాడడానికి పెషావర్‌లోని ముజాదీన్‌లు రష్యాకు వ్యతిరేకంగా పోరాడి 1989లో సఫలమైనారు. ప్రపంచ వ్యాప్తంగా విస్తరించి ఉన్న 57 ఇస్లామిక్ దేశాలు ఉగ్రవాద ఊడల్ని విశ్వవ్యాప్తం చేస్తూ, ప్రపంచ మనుగడకు ప్రమాదకరంగా మారాయి. నాటి పరిస్థితులకు అనుగుణంగా 1994లో అమెరికా పెంచి పోషించిన తాలిబన్ల పాలన 1996 నుంచి 2001 వరకు కొనసాగడం, షరియా నిబంధనలతో ఆఫ్ఘాన్ ప్రజలు నిలిగిపోవడం చూశాం. నేడు ఆఫ్ఘానిస్థాన్‌లో ప్రభుత్వానికి, తాలిబన్లకు మధ్య అంతర్గత పోరు జరుగుతోంది. ఆఫ్ఘాన్‌లోని ఖనిజ సంపదపై కన్నేసిన చైనా కూడా ఈ పోరాటాగ్నికి ఆజ్యం పోస్తున్నది.
ముసింల అంతర్గత విభేదాలు
ముస్లిం దేశాలన్నీ షియా, సున్నీ, అహ్మదీస్ లాంటి వర్గాల అంతర్గత విభేదాలతో వందల ఉగ్రవాద గ్రూపులు ప్రజలను భయభ్రాంతులను చేయడం జరుగుతున్నది. సున్నీలు అత్యధిక మెజారిటీ కలిగిన సిరియాలో షియా వర్గం రష్యా సహాయంతో ‘బషర్ అల్ అసద్’ పాలన కొనసాగుతున్నది. సున్నీ వర్గ ప్రజలు ఐయస్‌ఐయస్ ఉగ్రసంస్థతో కలిసి బషర్ అల్ అసద్‌ను గద్దె దించడానికి విఫలయత్నం చేశారు. షియా వర్గం అధికంగా ఉన్న ఇరాక్‌లో సున్నీ వర్గానికి చెందిన సద్దాం హుసేన్ దీర్ఘకాలం పాలన చేశా రు. షియా వర్గం అధికంగా ఉన్న ఇరాన్‌కు ఈ విషయం మింగుడుపడని కారణంగా ఇరాన్, ఇరాక్‌ల మధ్య దశాబ్దాల పోరాటం జరిగింది.
నేడు ఆమెరికా నాయకత్వంలోని నాటో దేశాల బలగాలను వెనక్కి పిలిపించుకోవడంతో ఆఫ్ఘాన్‌లోని తాలిబన్లకు పెద్ద అవకాశం దొరికినట్లు అయ్యింది. అమెరికా బలగాలు తొలగిపోవడంతో తాలిబన్లు కొన్ని ఆఫ్ఘాన్ ప్రాంతాలను హింసాత్మక ధోరణితో ఆక్రమించడం, ప్రజల్ని హింసించడం, బాలికల్ని బలవంతంగా వివా హం చేసుకోవడం లాంటి దుశ్చర్యల్ని చూస్తున్నాం. ఒకవేళ తాలిబన్లు మరోసారి రాజ్యాధికారాన్ని చేజిక్కించుకున్నట్లైతే ప్రపంచ శాంతి, మత సామరస్యాలు, భద్రతలకు విఘాతం కలుగుట ఖాయంగా తోస్తున్నది. 1990, 2000ల దశకాల్లో భారత్ తాలిబన్లను కొంత మేరకు వ్యతిరేకించడంతో పాటు ఆఫ్ఘాన్ ప్రభుత్వం, తాలిబన్ల మధ్య చర్చలతో సమస్యలు అధిగమించాలని అభిప్రాయపడింది. 11 సెప్టెంబర్ 2021 నాటికి అమెరికాలోని డబ్ల్యుటిఒపై ఉగ్రదాడికి రెండు దశాబ్దాలు పూర్తి కావస్తున్న నేపథ్యంలో అమెరికా నేతృత్వంలోని నాటో బలగాలు ఉపసంహరించు కొనుటకు నిర్ణయం తీసుకోవడంతో తాలిబన్లు ఎదురు చూసిన సమయం ఆసన్నమైందని భావిస్తున్నారు.
ఇలాంటి అనిశ్చితిలో తాలిబన్లు కొన్ని సరిహద్దు ప్రాంతాల్లో ఎగుమతి దిగుమతుల రవాణాలను అడ్డగించడంతో అనేక మిలియన్ డాలర్ల రెవెన్యూ పడిపోవడంతో ఆఫ్ఘానిస్థాన్ తీవ్ర ఆర్ధిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. ఆఫ్ఘాన్‌లోని పలు ముఖ్య పోర్టులను ఆక్రమించిన తాలిబన్లు అష్రఫ్ ఘనీ ప్రభుత్వాన్ని బలహీన పరచడంలో సఫలమైంది. నేటికీ తాలిబన్ ఉగ్రవాదులకు, ఆఫ్ఘాన్ ప్రభుత్వ బలగాలకు తీవ్ర పోరు జరుతూనే ఉంది. రెండు దశాబ్దాలుగా 36 అమెరికా, -నాటో దేశాలు ఆఫ్ఘానిస్థాన్‌లో శాంతి నెలకొల్పడానికి చేసిన ప్రయత్నాలలో ఉగ్ర తాలిబన్ల దాడిలో 2,442 మంది వీరులు, 800 మంది ప్రైవేట్ సెక్యూరిటీ, 1,144 సైనికులు, 72 మంది జర్నలిస్టులు, 444 సహాయక సిబ్బంది ప్రాణాలను సహితం కోల్పోవడం నమోదైంది. 1979- 89 ల మధ్య రష్యాకు చెందిన 14,400 మంది జవాన్లు కూడా ప్రాణాలు అర్పించడం చరిత్రలో లిఖించబడింది. గత చరిత్రలో తాలిబన్ల పోరులో 1.17 లక్షల మంది పౌరులు ప్రాణాలు కోల్పోగా, 10 మిలియన్ల ప్రజలు క్షతగాత్రులుగా మిగిలారు.
ఆఫ్ఘానిస్థాన్, ఇండియా సంబంధాలు
ఆఫ్ఘాన్‌తో దూరంగా ఉంటూ వస్తున్న భారత్ నేడు 3 బిలియన్ డాలర్ల ఆర్థిక సహాయంతో రోడ్లు, బాలికల పాఠశాలలు, డ్యామ్‌లు, విద్యుత్, ఆసుపత్రులు, ప్రభుత్వ భవనాలు, పబ్లిక్ హోమ్స్ లాంటివి పెద్ద ఎత్తున నిర్మిస్తున్నది. ఇలా ఆఫ్ఘాన్‌లో అభివృద్ధి చేసిన మౌలిక వసతులను నేడు తాలిబన్లు నాశనం చేయడం, ప్రజల్ని చంపడం, చిత్రహింసలకు గురి చేయడం నేడు సర్వసాధారణమైంది. ఇలాంటి ఉగ్ర తాలిబన్లను కట్టడి చేయటానికి పరిమిత సంఖ్యలో ఉన్న ఆఫ్ఘాన్ సైనిక బలగాలు పట్టుదలతో పోరాటం చేస్తున్నాయి. కశ్మీరి అంశాన్ని సజీవం చేస్తున్న తాలిబన్లు పాక్‌తో కలిసి భారత్‌ను అస్థిర పరచాలని చూస్తున్నది. నేటి ఆఫ్ఘాన్ పోరును అరికట్టడానికి అమెరికా, నాటో దేశాలు, రష్యా, ఇండియాల సహాయం తప్పనిసరి అవుతున్నది. 2017 వ్యాపార ఒప్పందంలో భాగంగా ఏయిర్ ఫ్రైట్ కారిడార్ ఏర్పాటు చేయడానికి తీర్మానించారు. ఇండియా నుంచి ఆఫ్ఘాన్‌కు 900 మిలియన్ డాలర్ల ఎగుమతులు, 500 మిలియన్ డాలర్ల దిగుమతులు జరుగుతున్నాయి. ఆఫ్ఘాన్ నుంచి డ్రై ఫ్రూట్స్ అధికంగా దిగుమతి అవుతున్నాయి. ఎగుమతుల్లో ఫార్మా, మెడికల్ పరికరాలు, సిమెంట్, రా మెటీరియల్, షుగర్, కంప్యూటర్లు, సిమెంట్, షుగర్ లాంటివి ఉన్నాయి. నేడు ఢిల్లీ- కాబూల్, హీరత్- ఢిల్లీల మధ్య వాణిజ్యం జరుగుతోంది. ఆఫ్ఘాన్ పౌర సమాజ భద్రత, ఆస్తుల సంరక్షణ, మహిళల రక్షణ లాంటి సమస్యలకు ఇండియా చాణక్య నీతిని అవలంబించాలని కోరుతున్నా రు. 2011 ఒప్పందం ప్రకారం 1 బిలియన్ డాలర్ల ద్వైపాక్షిక వాణిజ్యం కుదిరింది. గత ఏడాది ఆఫ్ఘాన్ వారసత్వ కట్టడాల పరిరక్షణకు 1.3 మిలియన్ డాలర్లు ఖర్చు చేయనున్నారు. ఎలాంటి కనీస హామీ లభించనందున భారత దౌత్య సిబ్బందిని రప్పించుకొనుటకు ఏర్పాట్లు చేస్తున్నది.
అమెరికా -నాటో బలగాలు ఇప్పట్లో తొలగవని భావించిన భారత్‌కు కొంత ఇబ్బందిని తెచ్చి పెట్టినట్లు అయ్యింది. తాలిబన్లను అధికారికంగా గుర్తించనప్పటికీ, ఇప్పటికే 400లకు పైగా జిల్లాలను ఆక్రమించిన ఉగ్ర సంస్థలతో ప్రత్యక్ష శాంతి చర్చలు జరిగేలా ఇండియా లాంటి దేశాలు చొరవ చూపాలి. నేడు ఇండి యా చొరవ చూపని యెడల రష్యా, ఇరాన్, పాక్, చైనా లాంటి దేశాలు ఆఫ్ఘానిస్థాన్ సమస్యకు తమదైన పరిష్కారం చూపి, ఇండియాను బలహీన పరుచుటకు ప్రయత్నించవచ్చని వింటున్నాం. నేడు తాలిబన్ల చేతుల్లోకి వెళుతున్న ఆఫ్ఘాన్‌ను ఇండియా గుర్తించి తగు చర్య లు తీసుకొనుటకు సిద్ధం కావాలి. ఆఫ్ఘాన్ ప్రభుత్వం, తాలిబన్ల మధ్య ‘దోహా చర్చలు’ మాత్రమే ఏకైక పరిష్కారమని తెలుసు కోవాలి. రష్యా, ఇరాన్‌లతో కలిసి మన ఇండియా సత్వరమే తగు పరిష్కారం చూపకపోతే ఆఫ్ఘాన్ తాలిబన్ల ఆధీనంలోకి వెళ్ళి మరోసారి రగులుతున్న నిత్యకుంపటి కాగలదని నమ్మాలి. తాలిబన్లకు దయ లేదు, ఆఫ్ఘాన్ సైనిక బలగాలకు వేరే మార్గం లేనందున మారణహోమం, ఆస్తి నష్టం, ప్రజావేదన, అభద్రతలకు అంతం కనిపించడం లేదు. 09 సెప్టెంబర్ 2021 నాటికి అమెరికా -నాటో బలగాల ఉపసంహరణ పూర్తి కాబోతున్నవేళ, ఆఫ్ఘానిస్థాన్‌లో అశాంతి జ్వాలలు ఎగిసిపడవచ్చని నిపుణుల విశ్లేషిస్తున్నారు. అగ్ర దేశాలు తమ స్వార్థపూరిత ఆలోచనలతో అగ్ర రాజ్యాలుగా నిలవాలనే దుర్బుద్ధితో ప్రోత్సహించిన పలు సంస్థలు నేడు తీవ్రవాద కేంద్రాలుగా మారి ప్రపంచ శాంతికి విఘాతం కలిగిస్తున్నాయని గుర్తుంచుకోవాలి. ఎవరు తీసిన గోతిలో వారే పడతారని మరువరాదు. నేడు అగ్రరాజ్యాలు సంకుచిత భావాలకు తిలోదకాలిచ్చి, వసుధైక కుటుంబ భావనలకు ప్రాణం పోయాలని ఆశిద్దాం.

 

డా. బుర్ర
మధుసూదన్ రెడ్డి
9949700037

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News