Sunday, April 28, 2024

తమిళనాడులో జూన్ 14వరకు లాక్‌డౌన్ కొనసాగింపు

- Advertisement -
- Advertisement -

చెన్నై: కొవిడ్-19 కేసులు పెరిగిన కారణంగా తమిళనాడులో అమలు చేస్తున్న లాక్‌డౌన్‌ను మరో వారం పాటు పొడిగిస్తున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ శనివారం ప్రకటించారు. వచ్చే సోమవారం(జూన్ 8)తో ముగియవలసి ఉన్న లాక్‌డౌన్‌ను జూన్ 14 వరకు ప్రభుత్వం పొడిగించింది. రాష్ట్రంలోని 11 జిల్లాలను హాట్‌స్పాట్లుగా గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం ఈ జిల్లాలలో కఠిన ఆంక్షలను కొనసాగించాలని నిర్ణయించింది. మిగిలిన జిల్లాలలో కొన్ని సడలింపులతో లాక్‌డౌన్ కొనసాగించనున్నది. కోయంబత్తూర్, నీలగిరులు, తిరుపూర్, ఈరోడ్, సేలం, కరూర్, నామక్కల్, తంజావూర్, తిరువారూర్, నాగపట్టణం, మయిలాడుతురైలను హాట్‌స్పాట్ జిల్లాలుగా గుర్తించిన ప్రభుత్వం కరోనా వైరస్ తీవ్రత అధికంగా ఉన్న కారణంగా ఆంక్షలను కొనసాగించాలని నిర్ణయించింది. రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాలలో ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు కిరాణా షాపులను తెరిచేందుకు అనుమతించింది.

అయితే, చేపల మార్కెట్లు, మాంసం దుకాణాలు హోల్‌సేల్ విక్రయాలకే పరిమితం చేసింది. వీటిని కూడా బహిరంగ ప్రదేశాలకు తరలించి భౌతిక దూరం పాటిస్తూ విక్రయాలు జరపాలని ఆదేశించింది. ప్రజలు కూడా తమ సమీపంలోని దుకాణాలలోనే వస్తువులు కొనుగోలు చేయాలని, బయట తిరగవద్దని ప్రభుత్వం ఆదేశించింది. ప్రజలు సొంత వాహనాలను మాత్రమే ఉపయోగించాలని ఆదేశించింది.ఇ-పాస్ పొందిన హౌస్‌కీపింగ్ సిబ్బంది అపార్ట్‌మెంట్లు, ఆఫీస్ సముదాయాలలో పనిచేసేందుకు అనుమతించింది.ఇ-పాస్ ఉంటేనే ఆటోలో ఇద్దరు ప్రయాణికులు, క్యాబ్‌లో ముగ్గురు ప్రయాణికులను అనుమతించాలని నిర్ణయించింది.

Tamil Nadu Govt extends Lockdown till June 14

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News