Monday, May 6, 2024

జోరుగా..హుషారుగా..

- Advertisement -
- Advertisement -

టీమిండియా సాధన షురూ

మొహాలి: శ్రీలంకతో జరిగే తొలి టెస్టు మ్యాచ్ కోసం టీమిండియా సాధన ఆరంభించింది. ఇప్పటికే టి20 సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన భారత్ టెస్టుల్లోనూ అదే సంప్రదాయాన్ని కొనసాగించాలనే పట్టుదలతో ఉంది. శ్రీలంకతో భారత్ రెండు టెస్టు మ్యాచ్‌లు ఆడనుంది. మొహాలి వేదికగా శుక్రవారం నుంచి తొలి టెస్టు జరుగనుంది. విరాట్ కోహ్లికి ఈ మ్యాచ్ ప్రత్యేకంగా మారింది. కోహ్లి కెరీర్‌లో ఇది వందో టెస్టు మ్యాచ్ కావడంతో ప్రాధాన్యత సంతరించుకొంది. ఇక బిసిసిఐ కూడా ఈ మ్యాచ్‌ను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. తొలుత ప్రేక్షకులకు అనుమతి ఇవ్వొద్దని భావించినా బిసిసిఐ తన నిర్ణయాన్ని మార్చుకుంది. ఈ మ్యాచ్‌ను అభిమానుల సమక్షంలో నిర్వహించాలని బిసిసిఐ నిర్ణయించింది.

దీంతో టీమిండియా ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యింది. సొంత గడ్డపై ఎదురులేని శక్తిగా పేరు తెచ్చుకున్న భారత్ ఈ సిరీస్‌లో కూడా ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో టీమిండియా సమతూకంగా కనిపిస్తోంది. ఇదిలావుండగా ఇప్పటికే మొహాలి చేరుకున్న భారత క్రికెటర్లు మంగళవారం సాధన ప్రారంభించారు. సీనియర్లు విరాట్ కోహ్లి, రవిచంద్రన్ అశ్విన్‌తో సహా పలువురు ఆటగాళ్లు నెట్స్‌లో శ్రమించారు. ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ పర్యవేక్షణలో సాధన కొనసాగింది. ఇదిలావుండగా సిరీస్‌లో సీనియర్లు చటేశ్వర్ పుజారా, అజింక్య రహానె, వృద్ధిమాన్ సాహా, ఇషాంత్ శర్మ తదితరులు లేకుండానే భారత్ బరిలోకి దిగుతోంది. అంతేగాక రోహిత్ శర్మ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత జరుగుతున్న తొలి టెస్టు సిరీస్ కావడంతో అందరి దృష్టి దీనిపైనే నిలిచింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News