Monday, April 29, 2024

ప్రైవేటులో అన్ని బెడ్లకూ ప్రభుత్వ ధరలే

- Advertisement -
- Advertisement -

Dr Srinivasa Rao

 

రీ ఇన్‌ఫెక్షన్ కేసులపై అధ్యయనం చేస్తున్నాం
రెండోసారి వైరస్ సోకినా ప్రమాదం ఉండదు
టెస్టుల సంఖ్యను భారీగా పెంచాం
రెండు వేల మంది వైద్యసిబ్బందికి కరోనా సోకింది
ప్రతి జిల్లాలో గాంధీ లాంటి సౌకర్యాలను సమకూర్చాం
ఆంధ్ర, కర్ణాటక నుంచి కూడా ట్రీట్మెంట్‌కు వస్తున్నారు
మీడియా సమావేశంలో డిహెచ్, డిఎంఇలు వెల్లడి

మన తెలంగాణ/హైదరాబాద్ : కోవిడ్ చికిత్సను అందిస్తున్న ప్రైవేట్ ఆసుపత్రుల్లో 100 శాతం బెడ్లకు ప్రభుత్వం నిర్ణయించిన ధరలను మాత్రమే తీసుకోవాలని వైద్యారోగ్యశాఖ, కుటుంబ సంక్షేమ సంచాలకులు డా జి శ్రీనివాసరావు మరోసారి స్పష్టం చేశారు. ప్రభుత్వం సూచించిన మూడు రకాల ఫ్యాకేజీలను తప్పనిసరిగా కోవిడ్ రోగులందరికీ వర్తించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇప్పటికే మంత్రి ఈటల రాజేందర్, వైద్యశాఖ ఆధ్వర్యంలో రెండు ధపాలుగా చర్చలు నిర్వహించి ప్రైవేట్ యాజమాన్యాలకు పలు సూచనలు చేశామన్నారు. మరో రెండు రోజుల్లో మరిన్ని విషయాలపై చర్చించే అవకాశం ఉందన్నారు. అయితే ఫ్యాకేజీ ఏదైన సదరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న కోవిడ్ రోగులందరికీ ఒకటే విధమైన ధరలు తీసుకోవాలని హెల్త్ డైరెక్టర్ తెలిపారు.

అనవసరమైన అపోహాలతో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అదే విధంగా ప్రస్తుతానికి ప్రైవేట్ ఆసుపత్రులపై ఫిర్యాదుల సంఖ్య కాస్త తగ్గిందన్నారు. చాలా ఆసుపత్రుల్లో కోవిడ్ వైద్యానికి సుమారు రూ లక్ష యాభైవేల నుంచి 2 లక్షలు బిల్లులు దాటడం లేదని చెప్పుకొచ్చారు. కోవిడ్‌తో పాటు ఇతర రోగాల ఉన్న వారు ఎక్కువ రోజులు ఆసుపత్రుల్లో ఉండాల్సిన నేపథ్యంలో వారికి మాత్రమే అధిక బిల్లులు అవుతున్నాయన్నారు. మరోవైపు వైరస్ రీ ఇన్‌ఫెక్షన్ అయినా భయపడాల్సిన అవసరం లేదన్నారు. వైరస్ వచ్చిపోయిన వాళ్లకు మళ్లీ కోవిడ్ సోకితే కేవలం మైల్డ్ సింప్టమ్స్ ఉంటాయని, దాని వలన ప్రమాదం ఉండదని డిహెచ్ పేర్కొన్నారు.

ఇప్పటికే రెండు మూడు కేసుల్లో రీ ఇన్‌ఫెక్షన్ వచ్చినట్లు వైద్యశాఖ దృష్టికి వచ్చిందని, వాటిపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేస్తున్నామని హెల్త్ డైరెక్టర్ అన్నారు. అయితే కొందరికి ఫాల్స్ పాజిటివ్ వచ్చే అవకాశం కూడా ఉందన్నారు. రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితిపై డిఎంఇ డా రమేష్‌రెడ్డితో కలసిహెల్త్‌డైరెక్టర్ కోఠిలో మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈసందర్బంగా హెల్త్ డైరెక్టర్ మాట్లాడుతూ…రాష్ట్రంలో కరోనా కంట్రోల్‌లోనే ఉందన్నారు. ప్రస్తుతానికి జిహెచ్‌ఎంసిలో పూర్తిస్థాయిలో అదుపులోకి వచ్చిందన్నారు. జిల్లాలు, గ్రామీణా ప్రాంతాల్లో మరిన్ని రోజులు కేసులు పెరిగి సెప్టెంబర్ చివరి వారంలో పూర్తిగా తగ్గిపోతాయని డిహెచ్ అభిప్రాయపడ్డారు. ఇప్పటికే వైరస్‌ను వేగంగా గుర్తించేందుకు ఆశావర్కర్లు, ఎఎన్‌ఎమ్‌ల బృందాలు గ్రామాల్లో ప్రతి రోజూ ఫీవర్ సర్వే నిర్వహిస్తున్నాయని తెలిపారు.

టెస్టులను భారీగా పెంచాం
వైరస్ వ్యాప్తిని అంచనా వేసి నివారణ చర్యలను వేగవంతం చేసేందుకు సిఎం ఆదేశాలతో రాష్ట్రంలో టెస్టుల సంఖ్యను భారీగా పెంచామని డిహెచ్ పేర్కొన్నారు. గత వారం రోజులుగా ప్రతి రోజు సగటను 40వేల పరీక్షలు చేస్తున్నామన్నారు. ఇప్పటి వరకు చేసిన మొత్తం టెస్టుల్లో 50 శాతం ఆగస్టు నెలలోనే చేశామన్నారు. అదే విధంగా ప్రభుత్వం ఆధీనంలో కోవిడ్ చికిత్సను అందిస్తున్న 42 హాస్పిటల్స్‌లో బెడ్లు, మందులు, సౌకర్యాల కొరత లేదన్నారు. దీంతో పాటు సీజనల్ వ్యాధులపై కూడా యాక్షన్ ప్లాన్‌ను సిద్ధం చేశామన్నారు. ఇప్పటికే పిహెచ్‌సి స్థాయిలో కరోనాతో పాటు డెంగీ, మలేరియా, టైపాయిడ్, ఇతర వ్యాధులకు అన్ని రకాల మందులను అందుబాటులో ఉంచామని హెల్త్‌డైరెక్టర్ పేర్కొన్నారు. ప్రస్తుతం వాతావరణ మార్పులతో సీజనల్ ప్లూ ఎక్కువగా ఉందన్నారు. అయితే కోవిడ్, సీజనల్ ఫీవర్ల లక్షణాలు ఒకటే విధంగా ఉన్నప్పటికీ ప్రజలు ఎలాంటి భయాందోళనకు గురికావోద్దని ఆయన పిలుపునిచ్చారు.

రెండు వేల మంది వైద్యసిబ్బందికి వైరస్
గత ఆరు నెలలుగా ప్రజలను కాపాడేందుకు వైద్యశాఖ నిరంతరం కృషి చేస్తుందని డిహెచ్ కొనియాడారు. ఈక్రమంలో సుమారు 2వేల మంది సిబ్బంది వైరస్ బారిన పడగా, 9 మంది చనిపోవడం బాధకరమన్నారు. అయితే చనిపోయిన వైద్యసిబ్బంది కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. ఈమేరకు అతి త్వరలోనే ప్రకటన చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రజల రక్షణ కోసం డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బంది నిద్రలేనిరాత్రులు గడుపుతున్నారని డిహెచ్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలంతా మరిన్ని రోజులు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

జిల్లాల్లోనూ గాంధీ లాంటి సౌకర్యాలను కల్పించాం : డిఎంఇ డా రమేష్‌రెడ్డి
జిల్లాల్లో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో గాంధీ ఆసుపత్రి లాంటి సౌకర్యాలను అన్ని ఏరియా ఆ సుప్రతుల్లో అందుబాటులో ఉంచామని డిఎంఇ డారమేష్‌రెడ్డి తెలిపారు. పిహెచ్‌సి స్థాయిలో కూ డా కరోనా ట్రీట్మెంట్ జరుగుతుందని పేర్కొన్నా రు. సాధారణ మందులతో పాటు యాంటీవైరల్ డ్రగ్స్‌ను కూడా అన్ని ఆసుపత్రులకు సప్లై చేశామ ని ఆయన తెలిపారు. ఈక్రమంలోనే ఆంధ్రా, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా రోగులు ఇక్కడ చికిత్స తీసుకుంటున్నారని ఆయన స్పష్టం చేశారు.

ఒకసారి వస్తే రెండోసారి రాదని గ్యారెంటీ లేదు : మంత్రి ఈటల వ్యాఖ్య
కరోనా ఒక సారి శరీరంలో ప్రవేశిస్తే రెండోసారి రాదనే గ్యారెంటీ లేదని మంత్రి ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్య చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. యంటీబాడీస్ అవసరమైన సంఖ్య లో ఉత్పత్తి కాకపోతే వారిలో మళ్లీ వైరస్ వచ్చే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో నమోదైన లక్షకు పైగా కేసుల్లో ఇద్దరి వ్యక్తులకు రీ ఇన్‌ఫెక్షన్ అయిందని మంత్రి తెలిపారు. కావున ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని మంత్రి కోరారు. కోవిడ్ రోగులను కాపాడేందుకు గాంధీ ఆసుపత్రిలోని వైద్యులు నిరంతరం శ్రమిస్తున్నారని తెలిపారు. డా రాజారావు, డా శేషాద్రి, డా ప్రభాకర్‌రెడ్డిలు నిత్యం కరోనా రోగుల మధ్యనే ఉంటున్నారని పేర్కొన్నారు. కరోనా వచ్చింది అనగానే భయాబ్రంతులకు గురికావొద్దన్నారు. ఊరికి, ఇళ్లకు దూరంగా ఉండాలనే ఆంక్షలను పెట్టొద్దని మంత్రి పిలుపునిచ్చారు. అదే విధంగా శవాలను ఊర్లోకి రానివ్వకుండా అడ్డుకోవద్దని తెలిపారు. ఒకవేళ అలాంటి సంఘటనలు తమ దృష్టికి వస్తే చర్యలు తీసుకుంటామని మంత్రి ప్రకటించారు.

Telangana Health Director Srinivasa Rao Press Meet

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News