Saturday, April 27, 2024

తెలంగాణకు అన్యాయం జరగలేదుట

- Advertisement -
- Advertisement -

NIRMALASITARAMAN

 

ఆర్థికసంఘం సిఫారసుల మేరకే పన్నుల వాటా

రాష్ట్రం నుంచి కేంద్రానికి వచ్చిన పన్ను ఆదాయం అధికమే
అన్యాయం జరిగిందన్న మంత్రి ప్రకటన నా దృష్టికి వచ్చింది
15వ ఆర్థిక సంఘమే కేటాయింపులను 1% తగ్గించింది
జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకున్నప్పటికీ, మంచి రాష్ట్రాలకు ప్రోత్సాహకం ఉంటుంది : కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్

హైదరాబాద్: బడ్జెట్ కేటాయింపుల్లో, పన్నుల వాటాలో తెలంగాణకు అన్యాయం జరిగిందనడం సరి కాదని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని ట్రైడెంట్ హోటల్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. మీడియా అడిగిన వివిధ ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. కేవలం 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకే పన్నుల్లో వాటా కేటాయింపులు జరిగాయన్నారు. దేశంలో ఒక రాష్ట్రం తగ్గి రెండు కేంద్రపాలిత ప్రాంతాలు పెరగడం వల్ల ఆర్థిక సంఘమే ఒక శాతం కేటాయింపులు తగ్గించాలని సిఫార్సు చేసిందని ఆమె వివరణ ఇచ్చారు. కేంద్ర బడ్జెట్‌పై తెలంగాణ ప్రభుత్వ స్పందన, మంత్రి స్టేట్‌మెంట్ తన దృష్టికి వచ్చిందన్నారు. పార్లమెంట్‌లో గివ్ ( కేంద్రం ఇచ్చింది) అనేది సాధారణంగా వాడే మాట అని, వేరే రకంగా అర్థం చేసుకోవద్దని కోరారు.

ఒకవేళ దీనిపై అభ్యంతరం ఉంటే మంత్రి లోక్‌సభ స్పీకర్‌కు లేఖ రాయాలన్నారు. ఏ ఒక్క రాష్ట్రంను తగ్గించి, వాళ్లు ఏమి ఇవ్వడం లేదని మాట్లాడటం లేదన్నారు. అన్ని రాష్ట్రాల నుంచి సహకారం తీసుకోవడంతో పాటు కేంద్రం నుంచి ఇవ్వాలనేది తమ ఉద్ధేశ్యమన్నారు. పన్ను వసూళ్లలో మెరుగ్గా ఉన్న రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోందనేది అవాస్తవమని ఆమె స్పష్టం చేశారు. పన్ను వసూళ్లు, ఆర్థిక వృద్ధిలో తెలంగాణ మెరుగ్గా ఉందని.. కేంద్రానికి వచ్చే పన్ను ఆదాయంలో రాష్ట్ర వాటా అధికంగానే ఉందని తెలిపారు. 15వ ఆర్థిక సంఘం 2011 జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకున్నప్పటికీ, మంచిపనితీరు కనబరిచే రాష్ట్రాలకు ప్రోత్సాహకం ఉంటుందన్నారు. ఇంకా పూర్తిస్థాయి నివేదికను ఆర్థిక సంఘం ఇవ్వలేదని, అది అక్టోబర్‌లో వస్తుందన్నారు. రూ.2 వేల నోట్ల రద్దు గురించిన ప్రశ్నకు సమాధానం చెబుతూ అది ఇంతవరకు తన దృష్టికి రాలేదని, అలాంటిదేమి లేదని ఆర్థిక మంత్రి స్పష్టం చేశారు.

తెలంగాణకు 15వ ఆర్థిక సంఘం సిఫార్సు చేసిన రూ.756 కోట్ల ప్రత్యేక గ్రాంటు కూడా అందలేదని మీడియా ప్రశ్నించింది. అయితే ఆ అంశం తిరిగి ఆర్థిక సంఘం పరిశీలనకే పంపామని ఆమె చెప్పారు. ఆర్థిక సంఘం ఏ పద్దు కింద ఆ ప్రత్యేక కేటాయింపు చేసిందో తెలియచేస్తే దానికి అనుగుణంగా చర్య తీసుకుంటామన్నారు. అన్ని రాష్ట్రాలతో సామరస్యంగా సమాఖ్య స్ఫూర్తితో ఉండటమే ప్రధాన మంత్రి నరేంద్ర మోడి, ఎన్‌డిఎ ప్రభుత్వ విధానమన్నారు. కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన తరువాత అసలు బడ్జెట్ ఉద్దేశ్యం అందరికీ తెలియాలని, అందులో భాగంగానే దేశంలోని ప్రముఖ నగరాల్లో పారిశ్రామిక వర్గాల నుంచి అభిప్రాయాలు సేకరిస్తున్నామని తెలిపారు. దానిలో భాగంగానే హైదరాబాద్‌కు వచ్చినట్లు చెప్పారు.

డిమాండు ఆధారంగానే ఉపాధి నిధులు
జిఎస్‌టి పరిహారం చెల్లింపులో కూడా తెలంగాణ విషయంలో అన్యాయం జరిగిందనే వాదాన్ని ఆమె ఖండించారు. జిఎస్‌టి పరిహారం వసూళ్లు తగ్గడం వల్లనే పరిహారం చెల్లింపులు అన్ని రాష్ట్రాలకు జాప్యం అయినట్లు తెలిపారు. పరిహారం సెస్ తప్పితే కేటాయింపులకు కేంద్రం వద్ద అదనపు నిధులేవీ లేవని వివరణ ఇచ్చారు. వాటిని చెల్లిస్తామన్నారు. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకానికి కేటాయింపులు తగ్గుతున్నాయన్న ఆరోపణలను కూడా ఆమె తోసి పుచ్చారు. ఆ పథకానికి డిమాండు ఆధారంగా నిధులు కేటాయిస్తామని, డిమాండు అధికంగా ఉంటే నిధులు కూడా పెరుగుతాయని వెల్లడించారు. డిమాండు లేకపోవడం వల్లనే నిధుల కేటాయింపులు తగ్గినట్లు చెప్పారు. 201015 మధ్య కాలంతో పోలిస్తే గడిచిన ఐదేండ్ల కాలంలో తెలంగాణకు కేటాయింపులు దాదాపు 128 శాతం పెరిగి రూ.1.07 లక్షల కోట్లకు చేరుకున్నాయని కేంద్ర వ్యయశాఖ కార్యదర్శి టి.వి సోమనాథన్ అన్నారు.

స్థానిక కారణాల వల్లే రైల్వే పనుల్లో జాప్యం
స్థానిక కారణాల వల్లే రాష్ట్రాల్లోని రైల్వే పనులలో జాప్యం జరుగుతోందని నిర్మలా సీతారామన్ అన్నారు. నిధుల కేటాయింపు జరగక జాప్యం అవుతుందని అనడం సరికాదన్నారు. ప్రాజెక్టుల వారీగా వివరాలు అందిస్తే సమస్యలను రైల్వే మంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని మంత్రి తెలిపారు. అంతకుముందు జరిగిన మొదటి సెషన్లో వాణిజ్య, పరిశ్రమ, పెట్టుబడి బ్యాంకర్, రైతు సంస్థల ప్రతినిధులతో, రెండవ సెషన్‌లో ఆర్థికవేత్తలు, టాక్స్ ప్రాక్టీషనర్స్, అకాడామియా (విద్యారంగ నిపుణులు, విధాన రూపకర్తలతో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వివిధ బడ్జెట్ అంశాలపై సమాలోచనలు జరిపారు. ఈ పరస్పర చర్చా కార్యక్రమంలో రెవెన్యూ శాఖ కార్యదర్శి అజయ్ భూషణ్ పాండే, ఆర్థిక శాఖ కార్యదర్శి రాజీవ్ కుమార్, ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి అతాను చక్రవర్తి, వ్యయశాఖ కార్యదర్శి సొమనాథన్, సిబిడిటి చైర్మెన్ పి.సి. మోడి, సిబిఐసి చైర్మెన్ అజిత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Telangana is not unfair in allocation of Taxes
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News