Sunday, April 28, 2024

తెలంగాణలో…లాక్‌డౌన్… రెండోరోజు

- Advertisement -
- Advertisement -

రోడ్లపైకి వచ్చినవారికి క్లాస్ తీసుకున్న కలెక్టర్
రా.7 గం.ల నుంచి ఉ. 6 గం.ల వరకు బయటకు రావొద్దు
టూవీలర్‌పై ఒక్కరే వెళ్ళాలి… అంబులెన్స్‌ల్లో ప్రయాణికులు
డిఎస్‌పిపై కేసు… విదేశాల నుంచి వచ్చినవారిపై నిఘా
అంతరాష్ట్ర సరిహద్దుల వద్ద విస్తృతంగా తనిఖీలు
ఉల్లంఘనులకు ఆరునెలల జైలు శిక్ష
సోషల్ మీడియాలో ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్న మంత్రులు, అధికారులు

మనతెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణ లాక్ డౌన్‌ను అధికార యంత్రాంగం పకడ్బందీగా అమలు చేస్తున్నది. లాక్‌డౌన్ రెండో రోజు సోమవారం ప్రజలు తేలికగా తీసుకోవడాన్ని అధికార యంత్రాంగం తీవ్రంగా పరిగణించింది. నిబంధనలు ఖాతరు చేయకుండా రోడ్లపైకి వచ్చిన వాహనాలను పోలీసులు అడ్డుకోవడంతో పాటు సీజ్ చేస్తున్నారు. ఈ నెల 31 వరకు లాక్‌డౌన్‌ను కచ్చితంగా అమలు చేయడంలో భాగంగా కలెక్టర్లు, పోలీసు కమిషనర్‌లు, ఎస్‌పిలు, అదనపు కలెక్టర్లు రోడ్లపైకి వచ్చి పర్యవేక్షిస్తున్నారు. అప్పటికప్పుడే కఠినంగా ఆదేశాలు జారీచేస్తున్నారు. రాష్ట్ర మంత్రులు ముఖ్యంగా మీడియా, ట్వీట్‌లు, సోషల్ మీడియా ద్వారా ఇండ్లకే పరిమితం కావాలని ప్రజలకు పదేపదే విజ్ఞప్తి చేస్తున్నారు. కోవిడ్ 19 (కరోనా వైరస్ )ను నియంత్రించడానికి 1897 ఎపిడమిక్ డిసీసెస్ చట్టం అమలులో ఉన్నందున ప్రజలందరూ ప్రభుత్వం ఆదేశాలను పాటించాలని పోలీసు అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ నిర్ణయాన్ని తేలికగా తీసుకోరాదని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అత్యవసర పనులున్న వారు తప్ప మిగతా వారిని వెనక్కి పంపడం, హెచ్చరించడం, వినకపోతే అరెస్టులు చేయడం, వాహనాలను సీజ్ చేయడం వంటి చర్యలు తీసుకుంటున్నారు.
అందరినీ ఆకట్టుకున్న కలెక్టర్
తెలంగాణలో లాక్‌డౌన్ అమలుకు సిరిసిల్లా జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ స్వయంగా రంగంలోకి దిగారు. సోమవారం జనం రోడ్లపైకి రావడాన్ని తప్పుబట్టి, వాహనాలను ఆపి మరీ ఆగ్రహాన్ని వ్యక్తంచేశారు. ఎందుకు రోడ్లపైకి వచ్చారు..? చెప్పితే వినరా..? మీకేమైన స్పెషల్ రూల్స్ ఉన్నాయా..? అంటూ ప్రశ్నిస్తూనే వెనక్కి పోవాలంటూ హెచ్చరికలు చేశారు. విననివారి వాహనాలను సీజ్ చేయడం, వ్యక్తులను అరెస్టు చేయాలని ఆదేశించారు. ఇంట్లో నుంచి అత్యవసర పరిస్థితుల్లోనే బయటకు రావాలని, లేదంటే ఇంటికే పరిమితం కావాలని కార్లలో వచ్చినవారికి చెప్పారు. లీడర్‌ను అంటూ ప్రభుత్వ అధికారులతో దురుసుగా మాట్లాడిన తంగళ్ళపల్లి మండలం బద్దెనపల్లికి చెందిన గుగ్గిళ్ళ శ్రీకాంత్ గౌడ్‌పై కేసు నమోదు చేయాలని పోలీసులకు కలెక్టర్ ఆదేశించారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా అందరినీ ఆకట్టుకుంది.
టూవీలర్‌పై ఒక్కరే వెళ్ళాలి
నిత్వారసరాలకు మాత్రమే అదీ పగటిపూట మాత్రమే దుకాణాలకు, మార్కెట్‌లకు వెళ్ళాలని, అత్యవసరమనుకుంటేనే బైక్‌పై వెళ్ళాలని.. అదీ కూడా ఒక్కరికి మాత్రమే అవకాశమని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. కారులో సెల్ఫ్‌డ్రైవింగ్‌తోనూ, డ్రైవింగ్ రానివారు డ్రైవర్‌తో కలిసి ఇద్దరికి అనుమతిచ్చారు. నగరాల్లో, పట్టణాల్లో విచ్చలవిడిగా తిరుగుతున్న ఆటోలపై కేసులు నమోదు చేయడంతో పాటు సీజ్‌లు కూడా చేశారు. రంగారెడ్డి జిల్లా కొత్తూరులో యదేచ్చగా రోడ్లపై తిరుగుతున్న యువతను పోలీసులు అరెస్టు చేశారు.
రా.7 గం.ల నుంచి బయటకు రావొద్దు
పల్లెలు, పట్టణాలు, నగరాలైనా రాత్రి 7 గం.ల నుంచి ఉ.6 గం.ల వరకు ప్రజలు ఎవరూ బయటకు రావద్దని అధికారులు స్పష్టంచేశారు. అత్యవరసరంతో బయటకు వచ్చినవారు తప్పనిసరిగా వ్యక్తుల మధ్య సోషల్ డిస్టేన్స్ పాటిస్తే కరోనా వ్యాప్తిని నివారించవచ్చని వెల్లడించారు. విదేశాల నుంచి వచ్చినవారు బయటకు వస్తే వైద్య సిబ్బందికి, 104కు ఫోన్ చేసి సమాచారమివ్వాలని, వారి పాస్‌పోర్టు రద్దు చేయబడుతుందని అధికారులు హెచ్చరించారు. విదేశాల నుంచి వచ్చిన వారు స్వీయ నియంత్రణతో ఇంటిలోనే క్వారంటైన్ కావాలని సూచించారు.

డిఎస్‌పిపై కేసు
క్వారంటైన్‌లో ఉండని వారిపై సోమవారం రోజు తెలంగాణ ప్రభుత్వం కొరడా ఝలిపించింది. ఎపిడమిక్ డిసీజ్ యాక్టు 1897 కింద 60 మందికి పైగా కేసులు నమోదు చేయడంతో పాటు క్వారంటైన్‌లో ఉండనందుకు కొత్తగూడెం డిఎస్‌పిపై అధికారులు కేసు నమోదు చేశారు. డిఎస్‌పి కుమారుడు కరోనా పాజిటివ్ రావడంతో వైద్యం కోసం బయటకు వచ్చారని తెలిసింది. విదేశాల నుంచి వచ్చిన వారు ఇళ్ళ నుంచి బయటకు వెళ్ళకుండా, వెళ్ళినా ఇతరులు గుర్తించేలా అధికారులు హోం క్వారంటైన్ ముద్రవేస్తున్నారు. హైదరాబాద్ నగర శివారు హయత్‌నగర్ పరిధిలో 144 మంది విదేశాల నుంచి వచ్చినట్టు గుర్తించారు.
జిహెచ్‌ఎంసిలో 150 బృందాలు
కోవిద్ 19 వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు హైదరాబాద్ మహానగర పరిధిలో 150 బృందాలను జిహెచ్‌ఎంసి ఏర్పాటు చేసింది. విదేశాల నుంచి వచ్చినవారిపై ఈ బృందాలు నిఘాపెట్టాయని, వీరి నుంచి సమాచారాన్ని ఎప్పిటికప్పుడు సమాచారాన్ని తీసుకునేందుకు ప్రత్యేకంగా కంట్రోల్ రూంను ఏర్పాటు చేసి అదనపు కమిషనర్ అనురాధను జిహెచ్‌ఎంసి నియమించింది.

అంబులెన్స్‌ల్లో ప్రయాణికులు

ప్రైవేట్ అంబులెన్స్‌ల డ్రైవర్లు పేషంట్ల ముసుగులో ప్రయాణికులను రాష్ట్రాల సరిహద్దులను దాటిస్తున్నారు. ఈ విషయం విజయవాడ జాతీయ రహదారిలో కోదాడ పరిధిలోని రామపురం వద్ద పోలీసుల తనిఖీల్లో బయటపడింది. అంబులెన్స్ డ్రైవర్లు డబ్బులు తీసుకుని ప్రయాణికులను రాష్ట్ర సరిహద్దు దాటిస్తున్నారన్న సమాచారంతో కోదాడ పోలీసులు రామపురం చెక్‌పోస్టు వద్ద తనిఖీలు చేపట్టగా అక్కడకు వచ్చిన మూడు అంబులెన్స్‌లను తనిఖీలు చేయగా ప్రయాణికులు బయటపడ్డారు. కేసు నమోదు చేసిన పోలీసులు అంబులెన్స్ డ్రైవర్లను, ప్రయాణికులను అదుపులోకి తీసుకున్నారు.

సరిహద్దులో వాహనాల నిలిపివేత, సీజ్‌లు

తెలంగాణ రాష్ట్ర సరిహద్దు రామపురం(కోదాడ) క్రాస్ రోడ్డు చెక్‌పోస్టు వద్ద పోలీసులు భద్రత కట్టుదిట్టం చేసి సిబ్బందితో వాహనాలను రాష్ట్రంలోకి ప్రవేశించకుండా నిలిపేశారు. కార్లను సైతం ఆపారు. లాక్‌డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో వాహనాలను రాష్ట్రంలోకి అనుమతించబోమని పోలీసులు తేల్చిచెప్పారు. అక్కడే ఉన్న వెంచర్‌లో పార్కింగ్ సదుపాయాన్ని ఏర్పాటు చేసి వాహనాలను పార్కింగ్ చేసుకోవాలని సూచించారు. ఎవరికీ ఇబ్బంది కలగకుండా డ్రైవర్లకు, క్లీనర్లకు రవాణా శాఖ అధికారులు భోజనాలు ఏర్పాటు చేశారు. జహీరాబాద్‌లోని అంతర్రాష్ట్ర చెక్‌పోస్టు వద్ద పోలీసులు తనిఖీలు విస్తృతంగా చేస్తున్నారు. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి వస్తున్న వాహనాలను అక్కడే నిలిపేసిస్తున్నారు. ఇక్కడ ఆరోగ్యం, పోలీసులు, రవాణా విభాగాల సిబ్బంది మూడు షిప్టులుగా పనిచేస్తున్నారు. కరీంనగర్ జిల్లాలో రోడ్లపైకి వచ్చిన 20 ప్రైవేట్ వాహనాలను ట్రాన్స్‌పోర్టు కమిషనర్ శ్రీనివాస్ సీజ్ చేశారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్‌ల పరిధి, నారాయణపేట్ జిల్లా మక్తల్ మండలంలో ప్రజా రవాణాకు పాల్పడుతున్న ఆటోలను అధికారులు సీజ్ చేశారు. నల్లగొండ జిల్లాలో అన్ని రహదారులపై పోలీసులు ప్రత్యేక బారికేడ్లు పెట్టి జాతీయ రహదారులను మూసివేశారు. సంగారెడ్డి జిల్లా నారాయణ్‌ఖేడ్‌లో రోడ్లపైకి జనాలు రావడంతో పోలీసులు, రెవెన్యూ అధికారులు అత్యవసర సమావేశాన్ని నిర్వహించి లాక్‌డౌన్‌ను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఉల్లంఘనులకు ఆరునెలల జైలు శిక్ష

ఎపిడమిక్ డిసీసెస్ యాక్ట్ ఆఫ్ 1897 కింద అధికారులకు లభించే ప్రత్యేక అధికారాలను ప్రశ్నించే హక్కు ప్రజలకు లేదు. ఈ విషయంలో న్యాయ చారణ నుంచి అధికారులకు చట్టం పూర్తి మినహాయింపు ఇస్తోంది. అధికారుల ఆదేశాలను ఉల్లంఘిస్తే వ్యక్తులపై, సంస్థలపై ఐపిసి1860లోని 188వ సెక్షన్ కింద శిక్షలు విధించవచ్చును. ఆరునెలల జైలు, రూ. 1000 జరిమానా లేదా రెండునూ విధించవచ్చును. సముచిత శిక్షలు విధించే హక్కు న్యామూర్తులకు ఉంటుంది. ప్రజలు రోడ్లపైకి అనవసరంగా రాకూడదని అధికారులు హెచ్చరించారు. అనుమానితులను చికిత్స నిమిత్తం ఆసుపత్రులకు తరలించవచ్చును.

Telangana lock down with Corona
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News