Monday, April 29, 2024

ఆరిపోని దారి దీపం ఆచార్యులు

- Advertisement -
- Advertisement -

Telugu story about KT Venkatacharyulu

‘సంఘం శరణం గచ్ఛామి’ అన్న బౌద్ధ సూక్తి రత్నానికి ఆధునికార్థం కల్పించిన కె.టి. వెంకటాచార్యుల వారు ఇటీవల తమ ఎనభైనాలుగవ ఏట కాలధర్మం చెందారు. సుమారు ముప్పై సంవత్సరాల పాటు కళాశాలల అధ్యాపకులకు నిర్విరామంగా సేవలందిస్తూ వచ్చిన కెటి వెంకటాచార్యుల వారు కళాశాల విద్యకు సంబంధించిన మూడు సంఘాలకు సేవలందిస్తూ వచ్చారు. అవి ప్రభుత్వ కళాశాలల అధ్యాపకుల సంఘం, రిటైర్డ్ కాలేజీ అధ్యాపకుల సంఘం, అఖిలభారత రిటైర్డ్ యూనివర్శిటీ , కాలేజీ అధ్యాపకుల సంఘం. వారి నిరంతర సేవల మూలంగా కళాశాలల అధ్యాపకులు, పదవీ విరమణ పొందిన కళాశాలల అధ్యాపకులు, ఉద్యోగి చనిపోయిన సందర్భంలో వారి వారసులు వేలాదిగా లబ్ధి పొందు తూ వచ్చారు. అనతి కాలంలోనే ఆపదలో వున్న వారిని ఆదుకునే చిరునామాగా మారారు.

ఏలూరు సమీపంలోని విజయరాయి గ్రామంలో 1938 లో జన్మించిన వెంకటాచార్యుల వారి పాఠశాల విద్య స్థానికంగా సాగింది. వీరి తండ్రి తెలుగు పండితులుగా పని చేశారు. బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్‌లో క్లర్కుగా వెంకటాచార్యుల వారి ఉద్యోగ జీవితం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. సాయం కళాశాలలో చేరి బిఎ పూర్తి చేశారు. ఆ తర్వాత నిజాం కళాశాలలో ఎంఎ పట్టా పొంది, డిగ్రీ కాలేజీ లెక్చరర్‌గా ఉద్యోగాన్ని సాధించటం వారి జీవితంలో ఒక మలుపు. ఎనభయ్యవ దశకం ఉత్తరార్థంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కళాశాలల అధ్యాపకుల విషయమై వ్యతిరేక భావంతో వుండేది. అందుకే మూకుమ్మడి బదిలీలకు పూనుకుంది. ఆ దశలో సంఘ నాయకులు ఎంజె మాణిక్యాల రావు చేపట్టిన సత్యాగ్రహ దీక్షలలో చురుగ్గా పాల్గొనటం ద్వారా, స్వయంగా శిబిరాలను నిర్వహించటం ద్వారా వెంకటాచార్యుల వారు తొలిసారిగా వెలుగులోకి వచ్చారు. ఆయా సందర్భాలలో వీరి దీక్షాదక్షతలు వెల్లడవుతూ వచ్చాయి. వీరు ప్రభుత్వ కళాశాలల అధ్యాపక సంఘం బాధ్యతలు చేపట్టిన నాటికి లెక్చరర్ల విభాగంలోనే నానా రకాల వాళ్లుండేవారు. ప్రభుత్వ లెక్చరర్లు, ప్రైవేటు ఎయిడెడ్ కళాశాలల నుండి వచ్చిన వారు, జూనియర్ లెక్చరర్ల శ్రేణి నుండి పదోన్నతి పొందిన వారు, పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఎంపికైనవారు, డాక్టరేట్ పొందిన లెక్చర్లు తమ తమ డిమాండ్ల సాధనకు సంఘాలను ఏర్పరచుకొని పోరాటాలు చేస్తున్న సంక్లిష్టమైన దశ.

ఈ సంకుల సమరంలో ఉన్నత విద్యకు సంబంధించిన నియమ నిబంధనలను కూలంకషంగా అవగాహన చేసుకున్న వ్యక్తి కావటం వల్ల వెంకటాచార్యుల వారు తమ సంఘానికి కర్ణధారిగా వుంటూ సమర్థంగా నడిపించారు. అన్ని సంఘాల వారు ఏదో ఒక దశలో కోర్టులను ఆశ్రయించి న్యాయం కోసం పోరాడిన వారే. ఒకసారి ఒక సంఘానిది పైచేయి అయితే, మరోసారి మరో సంఘానిది పైచేయి అయ్యేది. కమిషనర్ కార్యాలయం నుండి సెక్రటేరియట్‌కే, అక్కడి నుండి కోర్టుకు, కోర్టు నుండి సంఘ కార్యాలయానికి, అక్కడి నుండి ఇంటికి స్కూటర్ వేసుకొని తిరిగే క్రమంలో వెంకటాచార్యుల వారు ఒకటి రెండుసార్లు రోడ్డు ప్రమాదానికి కూడా గురయ్యారు. అయినా సంకల్పశక్తి వారిని మునుముందుకే నడిపించింది. ఎస్‌టి సురేందర్ రావు, చక్రధర రావు ఇంకా ఇతర సీనియర్లు అప్పట్లో వారితో పాటు లక్ష సాధనకు అవిశ్రాంతంగా పోరాటం చేశారు. వెంకటాచార్యుల వారు పదవీ విరమణ పొందిన తర్వాత తమ సహచరులతో రిటైర్డ్ కళాశాల అధ్యాపకుల సంఘాన్ని ప్రారంభించారు. దానికి వారు సంస్థాపక అధ్యక్షులుగా వుంటూ ముందు చూపుతో నియమ నిబంధనలను ఏర్పరచారు.

ఆ రోజుల్లో యుజిసి వేతన స్కేళ్లు సాధించటం కత్తి మీద సాముగా వుండేది. అధికార్లు, ముఖ్యంగా ఆర్థిక శాఖ వారు అనేక రకాల అనుమానాలు వ్యక్తం చేసే వారు. వాటన్నింటికీ వీరు వెనువెంటనే జవాబులు ఇస్తూ ఫైల్ ఆగకుండా ముందుకు నడిపించే వారు. 1986, 1996 యుజిసి వేతన స్కేళ్ల అమలులో కూడా వారు గట్టిగా కృషి చేశారు. ప్రధానంగా 1996 కంటే ముందు రిటైరయిన వారికి యుజిసి వేతన స్కేళ్ల వర్తింపజేయకుండా, స్టేట్ స్కేళ్లు వర్తింపజేయటానికి ప్రభుత్వం పట్టుదలతో వున్నప్పుడు, వీరు దాన్నో సవాలుగా తీసుకున్నారు. చివరకు అసాధ్యం అనిపించిన దాన్ని సుసాధ్యం చేసి అబ్ధిదారులకు న్యాయం చేకూర్చారు. సంక్లిష్ట సమస్యలు ఎదురైనప్పుడు వారు పూర్వ టీచర్ ఎంఎల్‌సి, ప్రముఖ విద్యావేత్త రామయ్య సలహా తీసుకొని ముందుకు నడిచారు.

2006 యుజిసి పే స్కేళ్లను రిటైరయిన అధ్యాపకులకు న్యాయంగా వర్తింపజేయటంలో వీరి కృషి మరువలేనిది. రిటైర్డ్ కళాశాల అధ్యాపకుల సంఘానికి మంచి పునాదులు వేసి సువ్యవస్థీకృతం చేసిన తర్వాత వారి దృష్టి అఖిల భారత స్థాయి సంఘం మీద పడింది. అఖిల భారత విశ్వవిద్యాలయ కళాశాల అధ్యాపకుల ఫెడరేషన్ స్థాపనలో వెంకటాచార్యుల వారు కీలక పాత్ర వహించటమే కాక కొన్నిసార్లు ఈ సంస్థకు ప్రధాన కార్యదర్శిగా కూడా వున్నారు. వరుసగా ఆరు సార్లు కార్యనిర్వాహక మండలి సభ్యుడుగా ఎన్నికైన ఏకైన వ్యక్తి వీరే. 2006లో చైనాకు వెళ్లిన బృందంలోను, 2009లో యునెస్కో వెళ్లిన బృందంలోనూ వెంకటాచార్యుల వారికి గౌరవప్రదమైన చోటు దొరికింది. ఎవరి నుండి ఏమీ ఆశించని నిస్స్వార్థపరుడు, ఉన్నత విలువలతో రూపొందిన ఆదర్శమూర్తి వెంకటాచార్యుల వారు. పదవిని హోదాగా కాక పదుగురికే సేవలందించే ప్రవృత్తిగానే భావించారు. అట్లాంటి ఉత్తములు మన మధ్యలేరనే బాధ ఎప్పుడూ వుంటుంది. అయినా ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు వారి అడుగుజాడలు మాత్రం మనకు దారి చూపుతూనే వుంటాయి.

అమ్మంగి వేణుగోపాల్: 9441054637

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News