Friday, April 26, 2024

కరోనా పునర్విజృంభణ!

- Advertisement -
- Advertisement -

The Corona is booming again

 

కరోనా మళ్లీ విజృంభిస్తున్నదనే సమాచారం, హమ్మయ్య అని ఊపిరి పీల్చుకోబోతున్న దశలో పిడుగుపాటు వంటి పరిణామం. తెల్లవారుతున్నదనిపించి తిరిగి చిమ్మచీకట్లు కమ్ముకుంటున్న సూచనలు కనిపించడం అమిత ఆందోళనకరం. కేరళ, మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల్లో కరోనా కేసులు బాగా పెరుగుతున్నాయని వార్తలు చెబుతున్నాయి. జమ్మూకశ్మీర్‌లో కూడా పరిస్థితి విషమిస్తున్నదని తెలుస్తున్నది. ఇది ఆ రాష్ట్రాలకే పరిమితమై సద్దుమణుగుతుందని అనుకోడానికి ఎంత మాత్రం వీల్లేదు. అతి తక్కువ కాలంలో దేశ మంతటికీ మళ్లీ వ్యాపించి లాక్‌డౌన్లు, ఏకాంత వాసాలు, రాకపోకలు పూర్తిగా బందైపోడం, సకల ఆర్థిక కార్యకలాపాలు మూతపడిపోయి ఉద్యోగ ఉపాధులు అడుగంటిపోడం, ఆకలి కేకలు మిన్నంటడం వంటి దారుణ పరిస్థితులు ఇంతలోనే తిరిగి దాపురిస్తే అంతకంటే మించిన విపత్తు మరొకటి ఉండదు. ఇటీవలి వరకు కొన్ని మాసాల పాటు అమల్లో ఉన్న సంపూర్ణ లాక్‌డౌన్ అకస్మాత్తుగా విరుచుకుపడి దేశాన్ని ఎంతగా పీడించిందో, సామాన్య ప్రజాకోటి ఎన్నెన్ని బాధులు పడ్డారో ఇంకా మరపున పడలేదు. దేశంలో ప్రస్తుతం నమోదైన తీవ్ర కరోనా కేసుల్లో 75 శాతం కేరళ, మహారాష్ట్రల్లోనే ఉన్నట్టు సమాచారం.

38 శాతం కేరళలో, 37 శాతం మహారాష్ట్రలో నమోదైనట్టు తేలింది. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలో కొన్ని చోట్ల తిరిగి లాక్‌డౌన్ విధించారు. పుణె నగరంలో రాత్రిపూట జన సంచారంపై ఆంక్షలు అమల్లోకి తెచ్చారు. దేశ వ్యాప్తంగా వారం రోజుల్లో నమోదైన కరోనా కేసుల సగటు 1.79 శాతం కాగా, మహారాష్ట్రలో ఇది 8.10 శాతంగా ఉండడం గమనించవలసిన అంశం. ఎనిమిది రోజుల పాటు చూసి అవసరమనుకుంటే రాష్ట్రమంతటా కఠిన లాక్‌డౌన్ విధిస్తామని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే ప్రకటించారు. మాస్కులు, శానిటైజర్ల వాడకాన్ని తప్పనిసరిగా పాటించాలని విజ్ఞప్తి చేశారు. ప్రయాణాల్లో, రోడ్ల మీద ప్రజలు పెద్ద ఎత్తున ఒకే చోట చేరకుండా చూడడానికి పని వేళల్లో తేడాలు పాటించాలని వివిధ సంస్థలకు సూచించారు. ప్రపంచమంతటా వ్యాపించి లక్షలాది మంది మరణాలకు కారణమైన అసలు కరోనా తగ్గుముఖం పడుతున్నదనగా బ్రిటన్, దక్షిణాఫ్రికా వంటి చోట్ల దాని కొత్త రూపాలు బయలుదేరాయి. అవి నెమ్మది నెమ్మదిగా అన్ని దేశాలకూ సోకుతున్నాయి. విమానాల్లో ఆయా దేశాల నుంచి పలు ప్రాంతాలకు వెళుతున్న వారి ద్వారా ప్రయాణం చేసి ప్రపంచమంతటా వ్యాపిస్తున్నాయి.

ఇవి చాలా సులభంగా, వేగంగా విస్తరించుకుంటున్నాయని చెబుతున్నారు. బ్రిటన్‌లో బయటపడిన బి 1.1.7 అనే కొత్త రకం కరోనాకు 23 రూపాలున్నాయని ఇవి మానవ ఉపరితల కణాలకు సోకి ప్రాణాంతక పరిస్థితిని సృష్టించగలవని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అలాగే, దక్షిణాఫ్రికాలో బయటపడిన బి 1.351 అనే కొత్త రకం కరోనాకు కూడా అనేక రూపాలున్నాయంటున్నారు. బ్రెజిల్‌లో పుట్టిన పి.1 అనే రకానికి కూడా 17 రూపాలున్నాయని చెబుతున్నారు. అయితే బ్రిటన్ రకం కంటే మిగతా రెండు తక్కువ ప్రమాదకరమైనవని భావిస్తున్నారు. వీటిపై మరింత శోధన జరగవలసి ఉందంటున్నారు. ఇలా కరోనా పూర్తిగా తొలగిపోకుండా ఏదో ఒక రూపంలో కొత్తగా పుట్టి వ్యాపించే ప్రమాదం మానవ ప్రపంచానికి నిరంతర హెచ్చరిక అని భావించాలి. అందుచేత కలకాలం జాగ్రత్తలు తీసుకుంటూ ఉండవలసిందే. మాస్కులు ధరించడం, శానిటైజర్లు వాడడం, దూరాలు పాటించడం వంటివి తప్పనిసరి. ఎంతో కాలంగా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన టీకా వచ్చింది. మన దేశంలో రెండు టీకాలు ఇప్పటికే పంపిణీ అవుతున్నాయి. కాని అవి సాధారణ జనానికి పూర్తిగా అందడానికి మరి కొంత కాలం పడుతుంది.

ఈ టీకాల సత్ఫలితం ఎటువంటిదో వాటిని వేసుకుంటే ఎంత కాలం నిషూచీగా, నిబ్బరంగా బతకవచ్చునో పూర్తిగా తెలియదు. టీకా వేసుకున్న తర్వాత కూడా జాగ్రత్తలు కొనసాగించవలసిందేనని చెబుతున్నారు. అందుచేత ఎవరికి వారు ఎల్లప్పుడూ తగిన ఆత్మరక్షణ జాగ్రత్తలతో మనుగడ సాగించవలసి ఉంది. మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్, కర్నాటకలలో వ్యాధి తీవ్రత మన రాష్ట్రం మీద కూడా ప్రభావం చూపించే ప్రమాదం ఉంది. దీనిని గమనించి సరిహద్దు ప్రాంతాల్లో మరింత అప్రమత్తంగా ఉండవలసిన అవసరాన్ని గురించి రాష్ట్ర ప్రభుత్వం పదేపదే విజ్ఞప్తి చేస్తున్నది. ప్రజల్లో అవగాహన పెంచడంతో పాటు వైరస్ నిర్ధారణ పరీక్షలను ముమ్మరం చేయాలని నిర్ణయం తీసుకున్నది. పొరుగు రాష్ట్రాల నుంచి కరోనా మన రాష్ట్రానికి వాపించ కుండా చూడడానికి తగిన చర్యలన్నింటినీ చేపట్టినట్టు ప్రకటించింది. రాష్ట్రంలో కరోనా వల్ల కలిగే మరణాల సంఖ్యను ఇంత వరకు పరిమితం చేసుకోగలిగాం. ఇక ముందు కూడా ప్రభుత్వానికి సహకరించి ఎవరికి వారు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ దాని వ్యాప్తిని అరికట్టవలసి ఉంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News