Saturday, April 27, 2024

ప్రవాస భారతీయుల కృషి గొప్పది : కిషన్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : మాతృభూమి అభివృద్ధి కోసం తపించే ప్రవాస భారతీయులే మాకు స్ఫూర్తి అని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం న్యూయార్క్‌లో ఇండియన్ కాన్సులేట్ ఏర్పాటు చేసిన ప్రవాస భారతీయులతో సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడారు. ప్రపంచ ఫార్మసీ హబ్, ’ఫ్యాక్టరీ ఆఫ్ ద వరల్డ్ గా ఎదగడంలో దేశ యువత, భారత సంతతి ప్రజల పాత్ర కీలకమని వెల్లడించారు. ’జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపీ గరీయసి’ అన్న శ్రీరాముడి మాటలను ఆయన గుర్తు చేశారు. ప్రపంచమంతా ఆర్థిక మాంద్యం ఉన్నా భారత్‌పై దీని ప్రభావం లేకపోవడానికి మోడీ సర్కారు అనుసరిస్తున్న విధానాలే కారణమని తెలిపారు.

దేశం నేడు సాధిస్తున్న ప్రగతిని, పలు విజయాలను ప్రవాసీయులతో కిషన్‌రెడ్డి పంచుకున్నారు. 1994లో మోడి, ప్రహ్లాద్ జోషి తదితరులతో కలిసి అమెరికా సందర్శించిన రోజులను ఆయన గుర్తు చేసుకున్నారు. ఖండాతరాలు దాటి వచ్చినా.. జన్మభూమిపై ప్రవాసీయులు చూపిస్తున్న ప్రేమ, గౌరవం అద్భుతమన్నారు. ప్రపంచ ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచిన భారతదేశానికి.. ఏటా 3 బిలియన్ డాలర్ల విదేశీ పెట్టుబడులు వస్తున్నాయని వెల్లడించారు. 2014 -15లో ఉన్న విదేశీ మారక నిల్వలు (45.15 బిలియన్ డాలర్లు)తో పోలిస్తే.. మే, 2023 నాటికి దేశంలో 600 బిలియన్ డాలర్ల విదేశీ మారక నిల్వలున్న విషయాన్ని కేంద్ర మంత్రి గుర్తుచేశారు. వాణిజ్య, సేవల ఎగుమతుల విలువ 750 మిలియన్ డాలర్లు దాటిన విషయాన్నీ ఆయన ప్రస్తావించారు.

ప్రధాని మోడీ తీసుకున్న నిర్ణయం కారణంగా 2014లో దేశంలో శూన్యంగా ఉన్న మొబైల్ ఎగుమతులు ఇవాళ రూ.43,500 కోట్లు దాటిన విషయాన్ని ప్రస్తావించారు. అన్ని సేవల రంగంలోనూ భారత్ సత్తాచాటుతోందన్నారు. రానున్న 25 ఏళ్లలో దేశాన్ని విశ్వగురుగా నిలబెట్టేందుకు భారతీయులతోపాటు.. ప్రవాసీయులు కూడా మరింత దృష్టిపెట్టాల్సిన అవసరం ఉందని కిషన్ రెడ్డి అన్నారు. కార్యక్రమంలో న్యూయార్క్ లో భారత కాన్సుల్ జనరల్ రణధీర్ జైస్వాల్, డిప్యూటీ కాన్సుల్ డాక్టర్ వరుణ్ జెఫ్, భారత .టూరిజం డిజి మనీషాతోపాటుగా పలువురు ప్రభుత్వ అధికారులు, పెద్దసంఖ్యలో ప్రవాసీయులు పాల్గొన్నారు.

Kishan Reddy 1

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News