Saturday, September 21, 2024

మంకీపాక్స్ అడుగులు

- Advertisement -
- Advertisement -

ఢిల్లీలో వెలుగుచూసిన కేసు 34 ఏళ్ల
వ్యక్తిలో వ్యాధి నిర్ధారణ ఇప్పటికే
కేరళలో ముగ్గురికి మంకీపాక్స్
కేంద్రం సమీక్ష
రాష్ట్రంలోనూ కలకలం
కామారెడ్డికి చెందిన వ్యక్తిలో లక్షణాలు
పుణే ల్యాబ్‌కు శాంపిల్స్
ఫీవర్ ఆస్పత్రిలో చికిత్స : డిహెచ్

న్యూఢిల్లీ: ఢిల్లీలో ఓ వ్యక్తికి మంకీపాక్స్ సోకింది. 34 ఏళ్ల వ్యక్తికి తాజాగా మంకీపాక్స్ నిర్ధారణ అయింది. అతడు ఎలాంటి విదేశీ ప్రయాణాలు చేయలేదని తేలింది. అయితే ఇటీవల హిమాచల్ ప్ర దేశ్‌లోని మనాలీలో జరిగిన ఒక స్టేజ్ పార్టీకి హాజరయ్యాడని అధికారులు చెప్పారు. జ్వరం, శరీరంపై పొక్కులు రావడంతో బాధితు డు డాక్టర్లను సంప్రదించాడు. ప్రస్తుతం అతడికి లోక్‌నాయక్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఐసొలేషన్ సెంటర్‌లో కోలుకుంటున్నాడు. రో జుల క్రితం మంకీపాక్స్ లక్షణాలు కనిపించడంతో ఐసొలేషన్ సెంటర్‌లో చేరాడు. అతని శాంపిల్స్ పుణె వైరాలజీ సంస్థకు శనివారం పంపగా, పాజిటివ్ నిర్ధారణ అయిందని కేంద్ర ఆరోగ్య వర్గాలు ఆదివారంనాడు వివరించాయి. అతనితో సన్నిహితంగా మసలిన వారిని కూడా గుర్తించి క్వారంటైన్‌లో ఉంచామని పేర్కొన్నారు. దీంతో కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ అప్రమత్తమైంది. మంకీపాక్స్‌పై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ ఆధ్వర్యంలో ఆదివారం ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించింది. గతంలో దేశంలో మంకీపాక్స్ బారిన పడిన ముగ్గురూ కేరళకు చెందిన వారే. వీరు మధ్య ప్రాచ్యం లోని దేశాలకు వెళ్లి తిరిగి వచ్చాక వ్యాధి లక్షణాలు బయటపడ్డాయి. తాజాగా ఢిల్లీలో మంకీపాక్స్ కేసు బయటపడింది. దీంతో భారత్‌లో మంకీపాక్స్ కేసుల సంఖ్య నాలుగుకు చేరినట్టయింది. ప్రపంచ వ్యాప్తంగా 16,000 మంది మంకీపాక్స్ బారిన పడ్డారు. ఈ వ్యాధి మొత్తం 75 దేశాలకు విస్తరించింది. మరోవైపు మంకీపాక్స్ కేసులు పలు దేశాలకు వేగంగా విస్తరిస్తుండటంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ అప్రమత్తమైంది. ప్రపంచ వ్యాప్తంగా ప్రజారోగ్య అత్యవసర పరిస్థితి విధించింది.

కేంద్రం ఉన్నత స్థాయి సమీక్ష

ఢిల్లీలో ఓ వ్యక్తికి మంకీపాక్స్ సోకినట్లు నిర్ధారణ కావడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆదివారం ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించింది. ఆ వ్యక్తి ఎలాంటి విదేశీ ప్రయాణాలు చేయక పోయినా నాలుగో కేసుగా బయటపడడంపై కారణాలను సమీక్షిస్తున్నారు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సైన్సెస్ (డిజిహెచ్‌ఎస్) అధ్యక్షతన ఆరోగ్య మంత్రిత్వశాఖ, నేషనల్ సెంటర్ ఫర్ డిసీజెస్ కంట్రోల్ (ఎన్‌సిడిసి), ఐసిఎంఆర్ లకు చెందిన అధికార ప్రతినిధులు కూడా ఈ సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు.

కామారెడ్డి వ్యక్తిలో లక్షణాలు

తెలంగాణలో కూడా మంగళవారం కామారెడ్డి జిల్లాకు చెందిన ఓ వ్యక్తి మంకీ పాక్స్ లక్షణాలతో ఫీవర్ హాస్పిటల్‌లో చేరడం కలకలం సృష్టించింది. కువైట్ నుంచి కామారెడ్డికి వచ్చిన ఓ వ్యక్తికి మంకీపాక్స్ లక్షణాలు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఈనెల 6న కువైట్ నుంచి రాగా.. ఈ నెల 20 నుంచి అతనికి జ్వరం, శరీరంపై దద్దుర్లు వంటి మంకీపాక్స్ లక్షణాలు ఉండటంతో వైద్యులు అతనిని అబ్జర్వేషన్‌లో ఉంచారు. అతనికి లక్షణాలు తగ్గకపోవడంతో ఆయనను ఫీవర్ ఆస్పత్రికి తరలించారు. అతనికి ఫీవర్ ఆసుపత్రి వైద్యులు ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అతని నుంచి రక్త నమూనాలు, మూత్ర నమూనాలు సేకరించి పుణెలోని వైరాలజీ ల్యాబ్‌కు పంపనున్నట్లు ఫీవర్ ఆసుపత్రి వైద్యులు తెలిపారు.

ఫీవర్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నాం : డీహెచ్ శ్రీనివాసరావు

కామారెడ్డి జిల్లా ఇందిరానగర్ కాలనీకి చెందిన 40 ఏండ్ల ఓ వ్యక్తికి మంకీపాక్స్ లక్షణాలు ఉండడంతో, అతన్ని ఫీవర్ హాస్పిటల్‌కు తరలించినట్లు రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు(డీహెచ్) డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. ఆ వ్యక్తి జులై 6వ తేదీన కువైట్ నుంచి వచ్చారని, 20వ తేదీన అతనికి జ్వరం, 23వ తేదీ నాటికి రాషెస్ రావడంతో మరుసటి రోజు ఉదయం కామారెడ్డిలోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌కు వెళ్లారని పేర్కొన్నారు. అక్కడి డాక్టర్ మంకీపాక్స్ లక్షణాలు ఉన్నట్టు గుర్తించి కామారెడ్డి డిస్ట్రిక్ట్ హాస్పిటల్‌కు రిఫర్ చేశారని, అక్కడి నుంచి 108లో అతన్ని ఫీవర్ హాస్పిటల్‌కు షిఫ్ట్ చేశామని అన్నారు.

ఆయన సాంపిల్ సేకరించి, పూణేలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ల్యాబ్‌కు పంపిస్తామని తెలిపారు. అంతవరకు ఫీవర్ హాస్పిటల్‌లో ఐసోలేషన్‌లో ఉంచి ట్రీట్‌మెంట్ అందజేస్తామని చెప్పారు. ఈ వ్యక్తితో నేరుగా కాంటాక్ట్ అయిన ఆరుగురిని గుర్తించామని, వాళ్లెవరికీ సింప్టమ్స్ లేవని, అయినప్పటికీ వారిని ఐసోలేట్ చేశామని వివరించారు. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు పరిస్థితిని సమీక్షించి, ఎప్పటికప్పుడు తమకు సూచనలు చేస్తున్నారని, మంత్రి సూచనల మేరకు అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నామని డీహెచ్ తెలిపారు. ప్రజలు మంకీపాక్స్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఇది ప్రాణాంతక వ్యాధి కాదని అన్నారు.

ప్రాణాంతకం కాదు: వైద్య నిపుణులు

మంకీపాక్స్ పై ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించినా, దేశంలో ఇప్పటివరకు నాలుగు కేసులు బయటపడినా, ఈ వ్యాధిపై భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదని ప్రముఖ వైద్య నిపుణులు ఆదివారం స్పష్టం చేశారు. ఎందుకంటే ఇది అతి తక్కువ అంటు వ్యాధి అని, ప్రాణాంతక సంఘటనలు అరుదుగా ఉంటాయని వారు వివరించారు. గట్టి పర్యవేక్షణతో సమర్థంగా దీని వ్యాప్తిని నిరోధించవచ్చు. నిర్ధారించిన కేసులను ఐసొలేషన్ ద్వారా , అలాగే సన్నిహితులకు సోకకుండా కట్టడి చేయడం వల్ల దీని వ్యాప్తిని అరికట్టవచ్చునని వారు సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News