Saturday, April 27, 2024

జిల్లాకో కార్మిక సంక్షేమ భవన్ కట్టిస్తామన్న గత సర్కార్

- Advertisement -
- Advertisement -

ఒక్కో జిల్లాలో రూ. కోటితో నిర్మిస్తామని హామీ
కొత్త సర్కారు అయినా వారిని పట్టించుకునేనా?
గుర్తింపు కార్డులతోనైనా ప్రాధాన్యతనివ్వండంటున్న కార్మికులు

మన తెలంగాణ / హైదరాబాద్ : కొత్త ప్రభుత్వం..కొత్త పాలన…కొంగొత్త ఆశలు…కార్మికులు అనుకున్నట్లే ఈ కాంగ్రెస్ పాలన సాగుతుందా? కొత్త మంత్రి వస్తేగానీ కార్మిక సంక్షేమ భవనాల ప్రస్తావన వస్తుందా? కార్మికులు, ఆ శాఖ వర్గాల్లో జోరుగా జరుగుతున్న చర్చ ఇది. నిజానికి రాష్ట్రంలోని కార్మికుల సంక్షేమం కోసం కెసిఆర్ సర్కారు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల వేదికగానే ఏటా కోట్లాది నిధులు కేటాయిస్తూ వచ్చింది. అందుకు అనుగుణంగా నాటి కార్మిక శాఖ మంత్రి చేమకూర మల్లారెడ్డి సైతం కార్మిక సంక్షేమం కోసం..అది కూడా కార్మిక ఉపాధి కల్పన శాఖ ద్వారా కొత్తగా ప్రతి జిల్లాలోనూ కార్మిక సంక్షేమ భవనాలను నిర్మించాలని చూశారు. అలా ఒక్కో కార్మిక సంక్షేమ భవనాన్ని కనీసం కోటి రూపాయలతో నిర్మింపజేస్తామని కార్మికులకు చెబుతూ వచ్చారు. అంతర్జాతీయ కార్మికులు దినోత్సవం మే డే రోజునా కార్మిక సంక్షేమమే లక్ష్యంగా పలు కార్యక్రమాలను చేపడుతూ వచ్చారు.

జిల్లాకో కార్మిక సంక్షేమ భవన్ నిర్మించడంతో పాటు ఆయా సంక్షేమ భవనాల్లో పని చేశాక రెస్ట్ తీసుకునేందుకు గానీ, అవసరమైతే వర్షాకాలంలో అక్కడే పడుకునేందుకు కూడా వీలుగా నూతన భవనాలను నిర్మించాలని భావించారు. ప్రతి రోజు కార్మిక సంక్షేమ పథకాల సమాచారం కూడా ఆయా కార్మిక సంక్షేమ భవన్‌లోనే అందుబాటులో ఉంచాలని మంత్రి మల్లారెడ్డి చూశారు. పుస్తకాలు, కార్మిక శాఖకు చెందిన జీఓలతో పాటు భవన నిర్మాణ కార్మికులకు కావాలసిన సమాచారాన్ని ఆయా కార్మిక సంక్షేమ భవనాల ద్వారా తెలుసుకునేలా చూస్తామని గత ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఒక దశలో నాటి సిఎం కెసిఆర్‌తో ఈ కార్మిక సంక్షేమ భవనాల నిర్మాణంపై చర్చించేందుకు మల్లారెడ్డి యత్నించారు కూడా. అంతే కాకుండా కార్మిక శాఖ అధికారులను కూడా ఈ దిశగా ఆయన ప్రిపేర్ చేయించారు. అయితే అప్పట్లో తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు రావడం, నాటి ముఖ్యమంత్రి కెసిఆర్ బిజీ బిజీగా ఉండడంతో కొన్నాళ్లు ఆగుదామనుకున్నారు. ఇంతలోనే అసెంబ్లీ సమావేశాలు.. మళ్లీ ఆయా సమావేశాలను అనుగుణంగా తమ కార్మిక శాఖ అధికార యంత్రాంగాన్ని సిద్ధం చేసేందుకే మల్లా రెడ్డికి తన సమయం అంతా సరిపోయింది.

కాగా అటు కార్మిక శాఖ అధికారులు కూడా కార్మిక సంక్షేమ భవన నిర్మాణానికి గాను ఆయా జిల్లాల వారీగా భూసేకరణపై దృష్టి సారించారు. సూర్యాపేట, వరంగల్ , ఆదిలాబాద్, పెద్దపల్లి,మంచిర్యాల సహా పది జిల్లాల్లో స్థలాలు లభ్యం కాగా.. నాటి మంత్రి మల్లా రెడ్డి అందుకు ఓకే చేసేశారు. ఇక మహబూబ్‌నగర్, జోగులాంబ గద్వాల జిల్లా, నిజామాబాద్ సహా మరొ ఆరు జిల్లాలలోనూ ఉన్న స్థలాలపై కెసిఆర్ సర్కార్ దృష్టికి తీసుకువచ్చింది. దశాబ్ది ఉత్సవ వేడుకలు పూర్తవగానే చూస్తానని అటు నాటి మంత్రి కెటిఆర్ సైతం మల్లారెడ్డికి భరోసా ఇవ్వడంతో అందరూ ఇక కార్మిక సంక్షేమ భవనాలు పక్కా అనుకున్నారు. రాజధాని హైదరాబాద్ సహా మొత్తం 33 జిల్లాల లోనూ కూడా కార్మిక సంక్షేమ భవనాలు సిద్ధం అయి ఉంటే ఎంతో బావుండేదని ఈ సందర్భంగా కార్మికులు గుర్తు చేస్తున్నారు.
గుర్తింపు కార్డులతో లేబర్‌కు ప్రాధాన్యత !
దేశంలో ఎక్కడా లేనివిధంగా అభివృద్ధి, సంక్షేమం పథకాలను బిఆర్‌ఎస్ సర్కారు అమలు చేసింది కూడా. గత పదేళ్లుగా తెలంగాణ సర్కారు కార్మికుల సంక్షేమం కోసం పలు పథకాలు అమలు చేసింది. కార్మికులు తమ పేరును ఈ శ్రమ్ లో నమోదు చేసుకుంటే ఎన్నో ప్రయోజనాలు కల్పిస్తు వచ్చింది. కార్మిక శాఖ నుంచి లేబర్ కార్డు పొందిన కార్మికులకు ప్రమాద సమయంతోపాటు కుటుంబంలో ఆడబిడ్డ జన్మనిస్తే ఆర్థిక సాయం అందజేసింది. కార్మికులు సహజ మరణం పొందితే వారి నామినీకి దహన సంస్కారాలతో కలిపి రూ.లక్షా 30 వేలు, రోడ్డు, ఇతర ప్రమాదాల్లో మరణిస్తే దహన సంస్కారాలతో కలిసి రూ.6 లక్షల 30 వేలను నాటి తెలంగాణ సర్కారు చెల్లిస్తూ వచ్చింది. చివరికి ప్రమాదాల్లో అంగవైకల్యం పొందితే రూ.3 లక్షలను అందజేసింది. ఇలా కెసిఆర్ సర్కారు కార్మికుల పక్ష పాతిగా ఉంటూ వారి సంక్షేమమే అజెండాగా పని చేసినప్పటికీ అనుకొని పరిస్థితుల్లో ఆ ప్రభుత్వం మారడం కొత్త సర్కారు రావడంతో కార్మికులంతా సిఎం రేవంత్ రెడ్డిపైనే ఇక ఆశలు పెట్టుకుంటున్నారు. కొత్త స ర్కారుకు కార్మికుల పట్ల ఉన్న ప్రేమాభిమానాలు ఏంటో మరి కొన్నాళ్లు పోతే గానీ తెలియదని పలువురు చెబుతుండడం గమనార్హం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News