Saturday, May 4, 2024

ఉద్భావన

- Advertisement -
- Advertisement -

తలలో ఆలోచనలు పొడవులో భూమధ్య రేఖను దాటి పరుగెడుతున్నాయి
చిక్కగా చిక్కులుపడి గుబురు పొదలాగా
చుట్టి పడేసిన ఉండ లాగ ఆలోచనలు
ఎలా అంటే జీవకణం లోని ఎండోప్లా స్మిక్ రెటిక్యులం లాగ

ఒకప్పుడు మొక్కవోని ఆశతో
ఎప్పటె ప్పటి గతానికీ
మరెప్పటికైనా రాబోయే భవిష్యత్తుకీ
వంతెన వేసే రైబోజోములు
రాను రానూ ఖాళీగా శున్య గోళాల్లా వున్నాయి
ఒక్కోలక్షణం తరువాత వంద లక్షణాలుగా పల్లవించినవి
వొక సంఘర్షణ తరువాత వేల సంఘర్షణలుగా
వొక విద్వత్తును ఆనుకుని కోట్ల విద్వత్తులుగా పరుగులు ఊరకలు వేసిన వారసత్వ వాహకాలు నేడు క్రియా హీనంగా ఖాళీ గాజుపూసల్లా
చీకటి అరల్లోకి తొక్కేయయబడుతున్నాయి

ఉపరితలం సంఘటన కిరణాల్ని ఉన్నవాటిని ఉన్నట్టుగా పీల్చేస్తోంది
అవి పరవర్తనమో, వక్రీభవనమో చెందకముందే
చెంది ఏ చర్యా రూపుదిద్దుకోక ముందే
అవి పరివర్తనం చెందించబడి
అపహరణకు గురవుతాయి

కొన్నిసార్లు కాలం లాగే అద్దం కూడా అమాయకురాలు
మరికొన్ని సార్లు పెద్ద దొంగ కూడా
ఉత్తర క్షణం లోనే మారిపోతుంటాయి
లేఖలేనన్ని కోట్లసార్లు అవి తమ ముఖాన్ని మార్చేస్తూ మనల్ని దగా చేస్తుంటాయి

మార్గం చూస్తే ఒక్క తృటి కాలం కూడా తిన్నగా లేదు
నిరంతరంగా నిత్యమూ తలపిన్ను లాగ
వంకలు తిరుగుతూ సాగుతోంది
కాలం దారి కాలానిదే…..
దారి దారి దారిదే…
ఎప్పుడూ దారి వొక్కలాగ లేదు ఎప్పటికీ అనిశ్చితంగా మర్మ గర్భం గానే ఉంటోంది ద్రోహం జత గలిసి
దట్టమైన అజ్ఞానపు మంచు దుప్పట్లో అది ఎప్పటికీ తన అసలు ముఖాన్ని చూపదు గాక చూపదు
నీపట్ల నాపట్లే కాదు
ఈదారి తనపట్లా తాను మోసమే చేస్తూ వొచ్చింది
దాని వారసత్వమే అంత
తప్పుడు అవగాహననిస్తూ సాగుతూ, అదను దొరికితే కబళిస్తుంది

కానీ నెత్తురుందే….
అదెప్పుడూ ఎర్రగానే ఉంటోంది మార్పు పట్ల ఎంతో వినయంగా ఉండి
నిత్యం పైకి ఎగజిమ్ముతూ ఉంటుంది ఏనాడూ నీరవకుండా
పాకుడు పట్టకుండా
అత్యంత నమ్మకంతో విశ్వాసం తో నెత్తురు గానే ఉంటోంది
ఎన్ని బండల్ని ఢీ కొన్నా
బాణం గురి వొదలని ఆదివాసీ పిడికిలి పట్టులా
జీవకణజాలం గానే ఉంటోంది

రానురానూ మోసం ఎప్పటికన్నా లోతుగా బలంగా ఉంటుంది
ద్రోహం ఆశల్ని నమ్మకాలనీ పోరాటాలానీ గుల్లబారుస్తూ పెళుసుగా
మార్చేస్తుంది
తునాతునకలుగా చేసేస్తుంది
అత్యంత గట్టి రాయిని సైతం పొడిపొడిగా రాల్చేస్తుంది
శిశిరాల్ని మించిన శిశిరం మోసం
ద్రోహం… ద్రోహ వృక్షం
ద్రోహకుడ్యం….
అది విషపు పూలకి మంకెనల రంగు వేస్తుంది
నమ్మకానికి రక్షణ కవచంలా లేచి
పునాదు ల్లోంచీ కూలగొట్టేస్తుంది
ఇది ద్రోహ ఋతువు
పరమ విద్రోహ ఋతువు

సమయానికున్న నిలబడే నైజం మనల్ని ముందుకు వెళ్లకుండా
కాళ్ళని కట్టేస్తుంది
భావాల్ని వెనక్కి లాగి మెదడు ప్రసారించకుండా పక్షవాతీకరిస్తుంది
వెనక్కి లాగుడు ముందుకు తోసుడు
నిత్యం సరికొత్త ముఖాలతో మనముందుకు వొస్తాయి
వాటి పాతముఖాలు ఆవిరయి పోతూ

ఏనాడో పరిణామ క్రమంలో
పురోగమనం తో పాటే నడక నేర్చిన
తిరోగమనం జెండాగా ముఖం మార్చుకుని రాజ్యం చేస్తుంది
వొదిలించుకోకపోతే కడతేరుస్తుంది జీవకాలన్ని నిర్జీవం చేస్తూ
మృత కణాలుగా మనల్ని రాలుస్తూ…

గగన్ పహాడ్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News