Friday, May 3, 2024

బిసిలకు జనాభా దామాషా ప్రకారం టికెట్లు ఇవ్వాల్సిందే

- Advertisement -
- Advertisement -

కాంగ్రెస్, బిజెపిలకు జాజుల డిమాండ్

మన తెలంగాణ / హైదరాబాద్ : కాంగ్రెస్ బిజెపి పార్టీలు బిసిలకు జనాభా దామాషా ప్రకారం టికెట్లు ఇవ్వాల్సిందేనని బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. టికెట్లు కేటాయింపులో బిసిలకు సరైన ప్రాతినిధ్యం కల్పించకపోతే బిసిల ఓట్లు అడిగే హక్కును ఆ పార్టీలు కోల్పోతాయని ఆయనన్నారు. దసరా నుండి రాష్ట్రవ్యాప్తంగా బిసిల అలాయ్- బాలాయ్ ఆత్మీయ సమావేశాలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. బిఆర్‌ఎస్ పార్టీ లాగా తాము కూడా బిసిలకు టికెట్లు ఇవ్వకుండా మోసం చేస్తామంటే బిసిలు చూస్తూ ఊరుకోరని ఆయన హెచ్చరించారు. బిసిల ఓటు బిసిలకే అనే నినాదంతో దసరా పండుగ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ఎస్‌సి, ఎస్‌టి నియోజకవర్గాల మినహా అన్ని నియోజకవర్గాలలో బిసిల అలయ్ – బలయ్ సమావేశాలు నిర్వహిస్తామని వెల్లడించారు. మంగళవారం హైదరాబాదులోని బిసి భవన్ లో జరిగిన బిసి సంఘాల సమావేశంలో జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడారు.

ఉదయపూర్ డిక్లరేషన్ ప్రకారం బిసిలకు 34 అసెంబ్లీ స్థానాలు కేటాయిస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు మాట మార్చి బిఆర్‌ఎస్ కంటే ఎక్కువే ఇస్తామని రేవంత్ రెడ్డి చెప్పడం చూస్తే బిఆర్‌ఎస్, కాంగ్రెస్ బిసిల విషయంలో ఒక్కటేనని అర్థమవుతోందన్నారు. కాంగ్రెస్ పార్టీ బిసిలకు 60 టికెట్లు, ముఖ్యమంత్రి పీఠం ఇస్తేనే అధికారంలోకి వస్తుందని లేదంటే ప్రతిపక్ష హోదా కూడా దక్కదని జాజుల హెచ్చరించారు. ఒకవైపు రాహుల్ గాంధీ బిసి కులగణన, మహిళా బిల్లులో బిసి మహిళలకు సబ్ కోట కల్పించాలని పార్లమెంటులోపల, బయటా మాట్లాడుతుంటే ఇంకొక వైపు రాహుల్ గాంధీ పార్టీలోనే ఉంటూ బిసిలకు తగినన్ని సీట్లు ఇవ్వకుండా రెడ్డిలకు పెద్దపీట వేసి రెడ్డి కాంగ్రెస్ గా మార్చాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. తక్షణమే రాహుల్ గాంధీ జోక్యం చేసుకొని బిసిలకు సామాజిక న్యాయం జరిగేలా చూడాలని కోరారు.

బిసిలకు ఎన్ని టికెట్లు ఇస్తారో బిజెపి కూడా స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బిజెపి కనీసం బిసిలకు ప్రతి జిల్లాలో సగం సీట్లు ఇవ్వాలని బిసి వర్గానికి చెందిన వారికి అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి పీఠం కట్ట పెడతామని హామీ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బిసి కుల సంఘాల జెఎసి చైర్మన్ గణేష్ చారీ, విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షులు విక్రమ్ గౌడ్, బిసి యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు కనకాల శ్యామ్ కురుమ, యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఈడిగ శ్రీనివాస్ గౌడ్, ఎస్‌సి, ఎస్‌టి, బిసి విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు నరసింహ నాయక్, గూడూరు భాస్కర్ మేరు, విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు నాగరాజు, గ్రేటర్ అధ్యక్షులు మాదేశి రాజేందర్, రాష్ట్ర అధికార ప్రతినిధి ఇలసాగరం మాధవి,గ్రేటర్ అధ్యక్షురాలు సిద్దాంతం శ్యామల, ఇంద్రం రజక, రమాదేవి తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News