Friday, May 3, 2024

తిరుమలలో పల్లవుల కాలం నుంచే ప్రసాదాలు….

- Advertisement -
- Advertisement -

తిరుమల శ్రీవారి ఆలయంలో పల్లవుల కాలం నుంచే ప్రసాదాలు మొదలయ్యాయని చరిత్ర చెబుతోంది. రెండవ దేవరాయలు కాలం నుండి ప్రసాదాల సంఖ్య మరింత పెరిగింది. ఆ సమయంలో మంత్రిగా పనిచేసిన శేఖర మల్లన్న కేవలం ఆలయ ప్రసాదాల కోసమే అనేక దానాలు చేశారు. అప్పుడే శ్రీవారికి ‘సంధి నివేదనలు (నైవేద్య వేళలు)’ ఖరారయ్యాయట. ఈ సమయాల్లోనే భక్తులకు ప్రసాదాలు పంచేవారు. అప్పట్లో కొండమీద భోజన సదుపాయాలు ఉండేవికావు. క్రీ.శ.830సంవత్సరంలో పల్లవ రాజవంశీకుల కాలంలో సంధి నివేదనల పేరుతో తిరుమలేశుని ప్రసాదాలను సమర్పించే ఆనవాయితీని ప్రవేశపెట్టిట్లు తిరుచానూరు, గోవిందరాజస్వామి వారి ఆలయాల్లో లభించిన శాసనాలు పేర్కొంటున్నాయి. అటవీ మార్గంలో తిరుమల కొండపైకి చేరిన భక్తులకు ఆహారం లభించే అవకాశాలు ఉండేవి కావు.

మార్గమధ్యంలోని తిరుచానూరులో ఏర్పాటు చేసిన రామానుజ కూటాల ద్వారా అన్న సంతర్పణలు నిర్వహించేవారని ఆ శాసనాలు స్పష్టం చేస్తున్నాయి. అటు స్వామి నైవేద్యానికి, ఇటు భక్తుల ఆకలిని తీర్చడానికి వినియోగించే ప్రసాదాన్ని తిరుప్పొంగం అనే పేరుతో పిలిచేవారని శాసనాధారాలు తెలియజేస్తున్నాయి. తరువాత కాలక్రమంలో క్రీ.శ.1444 సంవత్సరంలో సుఖీయం, క్రీ.శ.1455లో అప్పం, క్రీ.శ.1461లో వడ, క్రీ.శ.1469లో అత్తిరసం పేర్లతో తయారుచేసిన ప్రసాదాలను స్వామికి నివేదించారు. క్రీ.శ.1480లో మనోహరం పేరుతో తియ్యటి పిండి పదార్థాన్ని శ్రీవారి నిత్య నైవేద్యానికి వినియోగించడం మొదలైంది. ఆ రోజుల్లో ఎక్కువ రోజులు నిల్వ ఉండే వడలకే విశేష ప్రాచుర్యం ఉండేది.

ఈ మేరకు క్రీ.శ.1803లో ఉమ్మడి మద్రాసు రాష్ట్ర ప్రాంతాన్ని పరిపాలించే ఈస్ట్ ఇండియా కంపెనీ హయాంలో శెనగపిండి పాకంతో తయారుచేసిన బూందిని ప్రసాదంగా వినియోగించే ఆచారం మొదలైంది. క్రీ.శ.1843, క్రీ.శ.1933 మధ్య కాలంలో తిరుమలేశుని ఆలయ పరిపాలన నిర్వహించిన మహంతుల కాలంలో ఆ బూంది ప్రసాదాన్ని మనోహరం పేరుతో చలామణిలోకి తెచ్చారు. 1933 సంవత్సరంలో తిరుమల తిరుపతి దేవస్థానాలు తరువాత కూడా స్వామివారి నివేదనలతో చోటు చేసుకున్న వివిధ రకాల ప్రసాదాలతో పాటు బూంది నివేదన కొనసాగుతూ ఉండేది.

1940 సంవత్సరంలో బూందిని లడ్డూ రూపంలో స్వామివారికి నివేదించి దాన్ని ప్రసాదంగా భక్తులకు అందించే విధానం తొలిసారిగా మొదలైంది. లడ్డూ ప్రసాదానికి పెరిగిన ఆదరణను దృష్టిలో ఉంచుకుని లడ్డూల తయారీకి ప్రత్యేకంగా రూపొందించిన దిట్టాన్ని 1950లో తితిదే ధర్మకర్తల మండలి ఖరారు చేసింది. దాదాపు ఐదు శతాబ్ధాల తరువాత 2001 సంవత్సరంలో ప్రస్తుతం లడ్డూల తయారీకి వినియోగించే పదార్థాల దిట్టం సవరించారు. ఖరారైన దిట్టం ప్రకారం 5100 లడ్డూల తయారీకి దిట్టం ప్రకారం 804 కిలోల ముడిసరుకులు వినియోగిస్తుంటారు. ప్రసాదాలను పెద్ద మొత్తంలో తయారు చేయడం ప్రారంభించిన తొలిరోజుల్లో అర్చకులు, జియ్యంగార్లు కొందరికి మాన్యాలిచ్చి తయారు చేయించేవారని తిరుమల క్షేత్ర ప్రాంత పరిపాలన కేంద్రమైన ఉత్తర ఆర్కాట్ జిల్లా అధికారి జి.జె.స్టార్టస్ దొర రూపొందించిన ‘సవాల్ ఏ జవాబ్’ నివేదిక ద్వారా తెలుస్తోంది.

1933 సంవత్సరంలో తితిదే పరిపాలనా మొదలైన తరువాత పెరుగుతున్న భక్తుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని అప్పటికే ఆలయ పేష్కార్ చెలికాని అన్నారావు లడ్డూలను తయారుచేసే మిరాశీదారులకు డబ్బులకు బదులుగా లడ్డూలు ఇచ్చే విధానాన్ని అమల్లోకి తెచ్చారు. ఆ విధానం ప్రకారం శ్రీవారి వంటశాలలో తయారుచేసే ప్రతి 51లడ్డూలకు 11లడ్డూలు మిరాశీదారులకు ఇస్తుండేవారు. ఈ విధానం కింద 1950లో రోజుకు వెయ్యి లడ్డూలను తయారుచేస్తుండే మిరాశీదారులు 1990 నాటికి సుమారు లక్ష లడ్డూలను తయారుచేసే స్థాయికి చేర్చుకున్నారు. ఈ నేపథ్యంలో 1996 మార్చి 16వతేదీన సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు తిరుమలేశుని ఆలయంలో మిరాశీ వ్యవస్థ రద్దయ్యింది.

తరువాత దశలో తితిదే స్వయంగా లడ్డూలను తయారు చేయించే విధానానికి శ్రీకారం చుట్టింది. తాజా లెక్కల ప్రకారం భక్తులకు అందించే 165 గ్రాముల లడ్డూ తయారీకి సుమారుగా 32.50లను తితిదే ఖర్చు చేస్తోంది. లడ్డూ ప్రసాదానికి ఉన్న ప్రత్యేక గుర్తింపు దృష్ట్యా భవిష్యత్తులో ఎవరూ కాపీ కొట్టకుండా ఉండేలా చూసేందుకు తితిదే 2006సంవత్సరంలో కృషి ప్రారంభించింది. తిరుమలేశుని లడ్డూ ప్రసాదానికి పేటెంట్ హక్కుల సాధన కోసం చెన్నైలోని జియోగ్రాఫికల్ ఇండికేటర్ రిజిస్ర్టీ విభాగానికి చెందిన నిపుణుల బృందం తిరుమలకు వచ్చి లడ్డూల తయారీ విధానాన్ని పరిశీలించింది. లడ్డూల రుచి, నిల్వ సామర్థ్యం వంటి అంశాలను పరిశోధించి ఆ విభాగం తిరుమలేశుని లడ్డూలను తమ జాబితాలో చేర్పింది.

2009, సెప్టెంబర్ 18వతేదీన తిరుమలేశుని లడ్డూ ప్రసాదానికి సంబంధించి మేధో సంపత్తి హక్కులు తితిదేకి మాత్రమే ఉండేలా చేసినట్లు ప్రకటించింది. ఈ విధంగా మేధోపరమైన హక్కులను పొందిన ఏకైక దేవాలయ ప్రసాదంగా తిరుమలేశుని లడ్డూ ప్రపంచ దేశాల్లోనే అగ్రస్థానంలో నిలిచింది. అధికారిక సమాచారం ప్రకారం 1940లో తిరుమలేశుని ప్రసాదంగా అమల్లోకి వచ్చిన లడ్డూ ప్రసాదం గత యేడాది 75యేళ్ళ ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంది. 51 లడ్డూలను ఒక ప్రోక్తం అంటారు. ఒక్కోసారి వెయ్యి ప్రోక్తాలను తిరుమలలో తయారు చేస్తారు. అంటే 51వేల లడ్డూలన్న మాట. ఇందుకుగాను 2వేల కిలోల శనగ పిండి, 4వేల కిలోల చక్కెర, 1850 కిలోల నెయ్యి, 350 కిలోల జీడిపప్పు,80 ఏడున్నర కిలోల ఎండుద్రాక్ష, 50 కిలోల యాలకులు, 50 కిలోల కలకండ అవసరమవుతాయి.

రోజుకు లక్షా పాతికవేల లడ్డూలను తితిదే పోటు కార్మికులు తయారుచేస్తున్నారు. భవిష్యత్ లో ఈ సంఖ్యను 5 లక్షలకు పెంచి భక్తులు అడిగినన్ని లడ్డూలు పంచాలనేది టీటీడీ ఆలోచన. తిరుపతి లడ్డూలది ఓ ప్రత్యేకత. ఇక్కడ ఏ గదిలో లడ్డులుంటే ఆ గదిలో సువాసనలు గుభాళిస్తుంటాయి. లడ్డూల తయారీలో వాడే పదార్ధాలు, తయారుచేసే విధానము ప్రత్యేకంగా ఉంటాయి. ఈ తరహలో లడ్డూను తయారు చేయాలని ప్రయత్నించిన చాలా సంస్థలు కూడా ఆ రుచిని సాధించలేకపోయాయి. అందుకే టీటీడీ వీటి తయారీకి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది.

ఏడుకొండలవానికి సమర్పించే నైవేద్యం సంప్రదాయబద్ధంగా కట్టెల పొయ్యిపై వండిన అన్న ప్రసాదాలను శ్రీవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఆధునిక కాలంలో గ్యాస్ స్టవ్ వంటకాలు సర్వసాధారణం. కానీ తిరుమలేశునికి కృత్రిమ స్టవ్వులమీద వండిన వంటకాలు నైవేద్యంగా సమర్పించరు. సుప్రభాత సేవ, తోమాల, అర్చన సేవలు ముగిసిన తర్వాత వేంకటేశ్వరుని ఆలయం ఎదురుగా, స్వామి పుష్కరిణి వద్ద కొలువైన ఆది వరాహస్వామివారికి తొలుత నైవేద్యం సమర్పించిన తర్వాత గర్భగుడిలోని మూలవిరాట్టుకు నైవేద్యం సమర్పిస్తారు. తిరుమల వేంకటేశ్వరునికి ఓడు అని వ్యవహరించే పగిలిన కొత్త మట్టికుండలో వెన్న మీగడలు కలిపిన అన్నాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ అన్నాన్ని మాతృ దద్దోజనం అంటారు.

శ్రీవారికి రోజు ఏయే సమయాల్లో ఎన్ని రకాల నైవేద్యాలు సమర్పిస్తారు? ఆ వెంకన్నస్వామికి సమర్పించే నైవేద్యాల పూర్తి వివరాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఆగమశాస్త్రంలో తిరుమల తిరుపతి వెంకటేశ్వరస్వామికి ఎలాంటి పదార్థాలతో తయారుచేసిన నైవేద్యం ఎవరు ఏవిధంగా ఏయే సమయాల్లో పెట్టాలనే పూర్తి విషయాలు ఉన్నాయి. ఇంకా గర్భగుడిలో స్వామివారి విగ్రహం ఎత్తు 9.5 అడుగుల ఎత్తు ఉండగా, దీనికి అనుగుణంగా స్వామివారికి ఏ పూట ఎంత ప్రసాదం సమర్పించాలో కూడా శాస్త్రం లో ఉంది. దానికి అనుగుణంగానే తిరుమలలో ప్రసాదాల తయారీ సమర్పణ అనేది జరుగుతుంటుంది. ఇందులో ముందుగా వంట తయారుచేయడానికి ముళ్ల చెట్లను కానీ, పాలు కారే చెట్లను కానీ ఉపయోగించరు.

ఇంకా ప్రసాదం వండేవారు వంట చేసే సమయంలో కానీ, వంట చేయడం పూర్తైన తరువాత కానీ వాసన అనేది చూడకుండా ముక్కు, నోరుకి వస్త్రాన్ని కట్టుకుంటారు. అంతేకాకుండా ప్రసాదాన్ని స్వామివారికి సమర్పించేంతవరకు బయటి వారు ఎవరు కూడా ప్రసాదాన్ని చూడటానికి వీలు లేదు. ఇక స్వామివారికి రోజు మూడు పూటల నైవేద్యాన్ని సమర్పిస్తారు. వాటినే బాలభోగం, రాజభోగం మరియు శయనభోగం అని అంటారు.

బాలభోగం:

ప్రతి రోజు ఉదయం ఆరు నుండి ఆరున్నర గంటల సమయంలో బాలభోగం సమర్పిస్తారు. ఇందులో నేతి పొంగలి, చక్కర పొంగలి, రవ్వ కేసరి, పులిహోర, దద్యోజనం, మాత్రాన్నం వంటివి స్వామివారికి సమర్పిస్తారు.

రాజభోగం:

స్వామివారికి పది లేదా పదకొండు మధ్యలో సమర్పించే నైవేద్యాన్ని రాజభోగం అని అంటారు.

ఇక మధ్యాహ్నం స్వామివారికి పులిహోర, దద్ధోజనం, తెల్ల అన్నం, చక్కెర అన్నం, గుఢాన్నం సమర్పిస్తారు.

శయనభోగం:

స్వామివారికి రాత్రి ఏడు నుండి ఎనిమిది గంటల మధ్య సమర్పించే నైవేద్యాన్ని శయనభోగం అంటారు. ఇందులో మిరియాల అన్నం, వడ, లడ్డు, శాఖాన్నం అంటే వివిధ రకాల కూరగాయలతో వండిన అన్నం సమర్పిస్తారు. ఇలా స్వామివారికి నైవేద్యం సమర్పిస్తున్నంతవరకు కూడా ఆలయంలో గంటలు మోగుతూ ఉంటాయి. స్వామివారికి నైవేద్యం సమర్పించే సమయంలో గర్భగుడి తలుపులు మూసివేసి, గర్బగుడి లోపల నైవేద్యం సమర్పించే అర్చకుడు మాత్రమే ఉంటాడు. ఇక అర్చకుడు పవిత్ర మంత్రాలూ ఉచ్చరిస్తూ కుడిచేతి గ్రాసముద్రతో ప్రసాదాన్ని తాకి దానిని స్వామివారి కుడిచేతికి తాకించి స్వామివారి నోటి దగ్గర తాకుతారు. ఇలా రోజు స్వామివారికి నైవేద్యాన్ని సమర్పించిన తరువాత భక్తులకు దీనిని పంచుతారు. ఇక ఉదయం నుండి రాత్రి సమయం వరకు స్వామివారి నైవేద్యం ఎలా మొదలై ఎలా ముగిస్తుందనే విషయానికి వస్తే, ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొల్పి అప్పుడే తీసిన చిక్కటి ఆవుపాలను సమర్పించి, అర్చన సేవలు పూర్తైన తరువాత నువ్వులు, సొంఠి కలిపిన బెల్లం నైవేద్యంగా పెడతారు.

దీని తరువాత బాలభోగం సమర్పిస్తారు. ఆ తరువాత సర్వదర్శనం మొదలవుతుంది. మళ్ళీ అర్చన ముగిసిన తరువాత రాజభోగం సమర్పించగా ఆ తరువాత సర్వదర్శనం మొదలవుతుంది. ఇక సాయంత్రం గర్భాలయాన్ని శుద్ధి చేసి స్వామివారిని తాజా పూలతో అలంకరిస్తారు. మళ్ళీ అర్చన ముగిసిన తరువాత రాత్రి శయనభోగం సమర్పిస్తారు. అర్ధరాత్రి శుద్ధాన్నం సమర్పించిన తరువాత స్వామివారు పడుకునేముందు ఏకాంత సేవలో భాగంగా వేడి పాలు, పండ్ల ముక్కలు, నేతిలో వేయించిన బాదాం, జీడిపప్పులు స్వామివారికి సమర్పిస్తారు. ఈవిధంగా తిరుమల స్వామివారికి ప్రతి రోజు ఉదయం సుప్రభాత సేవ దగ్గరి నుండి రాత్రి స్వామివారి ఏకాంతసేవ వరకు ఆగమశాస్త్రం ప్రకారం ఇలా పలురకాల నైవేద్యాలను శ్రీవారికి సమర్పిసారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News