Saturday, May 4, 2024

ఒత్తిడి చేసి సంతకం చేయించారు: మహువా మొయిత్రా

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: డబ్బులు తీసుకుని పార్లమెంటులో ప్రశ్నలు అడిగారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న తృణమూల్ కాంగ్రెస్ ఎంపి మహువా మొయిత్రాపై వ్యాపారవేత్త దర్శన్ హీరనందానీ తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ప్రధాని మోడీ, అదానీ గ్రూపును అప్రతిష్ఠ పాలు చేయడమే లక్షంగా మొయిత్రా కుట్ర పన్నారని ఆరోపించారు. ఈ మేరకు దర్శన్ సంతకం చేసిన అఫిడవిట్ ఒకటి మీడియాలో ప్రత్యక్షమైంది. అయితే తనపై దర్శన్ చేసిన ఆరోపణలపై మొయిత్రా ట్విట్టర్‌లో తీవ్రస్థాయిలో స్పందించారు. ప్రధానమంత్రి కార్యాలయం దర్శన్‌పై ఒత్తిడి చేసి తెల్లకాగితంపై సంతకం చేయించిందని ఆరోపించారు.

పిఎంఓనే ఓ తెల్లకాగితంపై రాసి మీడియాకు లీక్ చేసిందని అన్నారు. పార్లమెంటు ఎథిక్స్ కమిటీకి సమర్పించిన అఫిడవిట్ విశ్వసనీయతపై ఆమె అనుమానాలు వ్యక్తం చేశారు. అఫిడవిట్ లెటర్ హెడ్ లేని తెల్లకాగితంపై ఉందన్నారు. అధికారికంగా విడుదల చేయలేదన్నారు. వ్యాపారవేత్తగాకొనసాగుతున్న దర్శన్‌కు ప్రధానితో పాటుగా మంత్రులందరినీ కలవగల సమర్థత ఉంది. అలాంటప్పుడు పార్లమెంటులో ప్రశ్నలు అడగడానికి మొదటిసారి ప్రతిపక్ష ఎంపిగా కొనసాగుతున్న నాకు ఎందుకు లంచం ఇస్తారు? ఇది పూర్తిగా అసత్యం.ఈ లేఖను దర్శన్ కాకుండా పిఎంఓనే రాసింది.దర్శన్, ఆయన తండ్రిపై పిఎంఓ బెదిరింపులకు పాల్పడింది. లేఖపై సంతకం చేయడానికి 20 నిమిషాల సమయం ఇచ్చారు’ అని మహువా మొయిత్రా ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

కేసు నుంచి వైదొలగిన మొయిత్రా లాయరు
కాగా మహువా మొయిత్రా తరఫు న్యాయవాది ఆమెకు, అమె ఫిర్యాదు చేసిన ఓ న్యాయవాదికి మధ్య మధ్యవర్తిగా వ్యవహరించడంపై ఢిల్లీ హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ‘నేను నిజంగా ఆశ్చర్య పోయాను. మీరు వృత్తిపరంగా ఉన్నత స్థాయి విలువలు కొనసాగించాల్సిన వ్యక్తి. మీరు గనుక ప్రతివాది నంబర్ 2(అడ్వకేట్ దెహద్రాయ్)ని కాంటాక్ట్ చేసి ఉంటే, సిబిఐ ఫిర్యాదును వెనక్కి తీసుకోవాలని కోరి ఉంటే నిజంగా సిగ్గుచేటు’ అని జస్టిస్ సచిన్ దత్తా మొయిత్రా తరఫు న్యాయవాది గోపాల్ శంకర్‌నారాయణ్‌తో అన్నారు. తనకు వ్యతిరేకంగా ఎలాంటి వార్తలను ప్రచారం చేయకుండా శశ్వత ఇంజంక్షన్ ఇవ్వాలంటూ మొయిత్రా బిజెపి ఎంపి నిషికాంత్ దూబే, దెహద్రాయ్‌లకు వ్యతిరేకంగా ఒక పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో ఆమె తరఫున శంకర్ నారాయణ్ లాయర్‌గా వ్యవహరిస్తున్నారు. కాగా జడ్జి బహిరంగంగా చేసిన వ్యాఖ్యలతో శంకర్ నారాయణ్ ఈ కేసునుంచి వైదొలిగారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News