Tuesday, May 21, 2024

కాంగ్రెస్ ఆగమాగం

- Advertisement -
- Advertisement -

ఎంఎల్‌సి ఎన్నికలకు ముందే చేతులెత్తేస్తున్న నేతలు బయటపడుతున్న
విభేదాలు, కొనసాగుతున్న రాజీనామాలు పార్టీకి గుడ్‌బై చెప్పిన రాష్ట్ర అధికార ప్రతినిధి హర్షవర్ధన్‌ రెడ్డి
బిజెపి తీర్ధం పుచ్చుకున్న కాగజ్‌నగర్ నియోజక వర్గం పార్టీ ఇన్‌ఛార్జ్జీ పాల్వాయి హరీష్ బాబు

TPCC Spokesperson Harshavardhan Reddy resigned to Cong

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర కాంగ్రెస్ ఆగమాగం అవుతోంది. రోజు రోజుకు షాక్‌ల మీద షాక్‌లు తగులుతూనే ఉన్నాయి. పలువురు నేతలు రాజీనామా బాట పడుతున్నారు. వచ్చే నెలలో పట్టభద్రుల ఎంఎల్‌సి నియోజకవర్గాలకు ఒకవైపు ఎన్నికలు జరుగుతుండగా కాంగ్రెస్‌లో మాత్రం తన మార్క్ (అంతర్గత విభేదాలు, ఆధిపత్య పోరు) రాజకీయాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే పలువురు అగ్రనాయకులు, మాజీ మంత్రులు, శాసనసభ్యులు, ఎంఎల్‌సిలు పార్టీకి గుడ్‌పై చెప్పేసి ఇతర పార్టీల్లో చేరిపోయారు. ఉన్న నేతల్లో కూడా సఖ్యత ఏ కోశానా కనిపించడం లేదు. వారిలో వారు పరస్పర ఆధిపత్య పోరుతో సతమతమవుతున్నారు. పరస్పర విబేధాలతో కాంగ్రెస్‌ను బజారుకీడిస్తున్నారు. ఇంత జరుగుతున్నా పార్టీ అధిష్టానం మాత్రం ఇంకా మేల్కొన్న దాఖలాలు కనిపించడం లేదు. ఫలితంగా నేతలంతా ఒక్కరొక్కరుగా కాంగ్రెస్‌ను వీడుతున్నారు. మూడు రోజుల క్రితమే హైదరాబాద్ నగర శివారు చెందిన కూన శ్రీశైలం గౌడ్ ఆ పార్టీకి గుడ్‌పై చెప్పగా తాజాగా మరో నేత కూడా రాజీనామా చేశారు. పార్టీ అధికార ప్రతినిధిగా కొనసాగుతున్న హర్షవర్ధన్‌రెడ్డి కాంగ్రెస్‌ను వీడారు. ఈ మేరకు పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. మంగళవారం హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ ఎంఎల్‌సి స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు.

కాగా ఖమ్మం, వరంగల్, నల్లగొండ నియోజకవర్గం నుంచి రాములు నాయక్‌ను, హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ స్థానానికి చిన్నారెడ్డిని అభ్యర్థులుగా అధిష్ఠానం ప్రకటించిన సంగతి తెలిసిందే. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ స్థానం నుంచి పోటీ చేయాలని హర్షవర్ధన్‌రెడ్డి అనుకున్నారు. అయితే అధిష్టానం చిన్నారెడ్డికి గ్రీన్ సిగ్నలిచ్చింది. దీంతో హైదరాబాద్ స్థానంపై ఆశలు పెట్టుకున్న హర్షవర్ధన్‌రెడ్డి రెబెల్‌గా బరిలోకి దిగుతున్నారు. ఇటీవల హర్షవర్ధన్‌రెడ్డిని పిలిపించుకున్న టిపిసిసి చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రానున్నటీచర్ ఎంఎల్‌సి ఎన్నికల్లో అవకాశం ఇస్తామని హామి ఇచ్చారు. ప్రస్తుతం రెబెల్‌గా పోటీకి దిగవద్దని బుజ్జగించినట్లు సమాచారం. అయినప్పటికీ హర్షవర్ధన్‌రెడ్డి మాత్రం తన నిర్ణయాన్ని పున సమీక్షించుకునే అవకాశమే లేదని ఖరాఖండిగా చెప్పారు. ఆయన కూడా నామినేషన్ వేస్తున్నట్లుగా ఇప్పటికే ప్రకటించారు.. అలాగే సిర్పూర్ కాగజ్‌నగర్ పార్టీ ఇన్‌చార్జ్ పాల్వాయి హరీశ్‌బాబు తన అనుచరులతో కలిసి మంగళవారం బిజెపి తీర్ధం పుచ్చుకున్నారు. ఈ నియోజకవర్గానికి చాలా కాలంగా కాంగ్రెస్‌కు పెద్ద దిక్కుగా వ్యవహరిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి శాసన సభ్యుడిగా పోటీ చేసి ఓడిపోయారు.

ప్రస్తుతం పార్టీలో కొనసాగుతున్న పరిణామాలు, ప్రజల్లో కాంగ్రెస్ పట్ల సన్నగిల్లుతున్న ఆదారణ కారణంగా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇంకా కాంగ్రెస్‌లో కొనసాగడం వల్ల రాజకీయ భవిష్యత్తు పూర్తిగా అంధకారం అవుతుందన్న ఆందోళనతో హరీశ్ ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఆయన బిజెపిలో చేరడం ఖాయమని తెలుసుకున్న కాంగ్రెస్ అధిష్టానం ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. రానున్న రోజుల్లో మరిన్ని రాజీనామాలు ఉండే అవకాశాలు ఉన్నాయని పార్టీవర్గాల్లో వినిపిస్తోంది. దీంతో కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి రంగంలోకి దిగి అసంతృప్తి నేతలను బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఆయన చేస్తున్న యత్నాలు ఏ మేరకు ఫలిస్తాయన్నది ప్రస్తుతానికి వేచి చూడాల్సిందే.

TPCC Spokesperson Harshavardhan Reddy resigned to Cong

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News