Saturday, April 27, 2024

కారు జోష్

- Advertisement -
- Advertisement -

టిఆర్‌ఎస్‌లో నూతనోత్సాహం
సాగర్ ఉపఎన్నికకు సరికొత్త జోష్
రెండు, మూడు రోజుల్లో అభ్యర్ధి ఎంపిక

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో గులాబీ పార్టీ ప్రస్తుతం మంచి దూకుడు మీద ఉంది. ఇదే దూకుడు త్వరలో జరగనున్న నాగార్జున సాగర్ ఉపఎన్నికల్లో కొనసాగించాలని తహతహలాడుతోంది. తాజాగా రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన రెండు ఎంఎల్‌సి స్థానాల్లో ఘన విజయం సాధించడం ఆ పార్టీకి సరికొత్త నూతనోత్తేజాన్నిచ్చింది. ఈ ఎన్నికల్లో గులాబీ దళపతి, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు అనుసరించిన వ్యూహాలు, అమలు చేసిన ప్రణాళికలు అద్భుతంగా ఫలించాయి. అన్ని రాజకీయ పక్షాలు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా పనిచేసిన ఎంఎల్‌సి పోరులో టిఆర్‌ఎస్ పార్టీ రెండు స్థానాలను కైవసం చేసుకొంది. ఇందులో ఒకటి సిట్టింగ్ స్థానం కాగా, అదనంగా బిజెపి ఖాతాలో ఉన్న హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ నియోజకవర్గాన్ని కూడా అధికార పార్టీ తన ఖాతాలో వేసుకోగలిగింది. సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో జరిగిన ఈ పోరులో ప్రత్యర్థుల వ్యూహాలను తిప్పికొడుతూ సిఎం కెసిఆర్ మరోసారి ముందుండి పార్టీ శ్రేణులను నడిపారు. విజయానికి బాటలు వేశారు. ఎప్పటికప్పుడు దిశానిర్ధేశం చేశారు. ఇదే నూతనోత్సాహంతో సాగర్ పోరులో జయభేరీ మోగించేందుకు గులాబీ దళం సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగా ఏప్రిల్ 17వ తేదీన నాగార్జునసాగర్‌కు జరిగే ఉపఎన్నికల్లోనూ విజయ దుందుభి మ్రోగించాలని ఉవ్వీలూరుతోంది.
రాష్ట్రంలో కొద్ది నెలల క్రితం జరిగిన దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉపఎన్నికతో పాటు జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో బిజెపి దూకుడు చూసి కొంత కలవరానికి గురైన అధికార టిఆర్‌ఎస్‌కు ఎంఎల్‌సి ఎన్నికల్లో విజయం సాధించడంతో కొత్తగా వెయ్యి ఏనుగుల బలం వచ్చినట్లు అయింది. ఇదే ఊపు…ఉత్సాహంతో సాగర్‌ను కైవసం చేసుకునేందుకు పార్టీ శ్రేణులు ఎన్నికల కదన రంగంలో దూకేందుకు సమాయత్తం అవుతున్నారు. పైగా ఈ స్థానం పార్టీ సిట్టింగ్ స్థానం కావడంతో పార్టీ అధిష్టానం కూడా సాగర్ ఎన్నికను కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దీనిపై పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ఇప్పటికే పలుమార్లు ఉమ్మడి నల్గొండ జిల్లా నేతలతో పలుమార్లు సమావేశమై వారికి దిశా నిర్ధేశం చేశారు. ఇప్పటికే మంత్రి జగదీశ్‌రెడ్డికి ఎన్నికల బాధ్యతలను సిఎం అప్పగించారు. ఆయన ఆదేశాలతో ఇప్పటికే రంగంలోకి దిగిన పార్టీ శ్రేణులు అంతర్గతంగా శరవేగంగా పావులు కదుపుతున్నాయి. సాగర్‌లోని మండలాలు, గ్రామాలు, వార్డుల వారిగా ప్రజలను కలుసుకుంటూ ఎన్నికల్లో టిఆర్‌ఎస్ అభ్యర్ధికి సంపూర్ణ మద్దతు తెలిపే విధంగా వ్యూహాలను అమలు చేస్తున్నారు. తదనుగుణంగా చాపకింద నీరులా ప్రచారాన్ని కొనసాగిస్తూ, ముందుకు సాగుతున్నారు. ఈ ఎన్నికలతో పాటు మరోవైపు వరంగల్, ఖమ్మం నగర పాలక సంస్థల ఎన్నికలకు సైతం పార్టీ సమాయత్తమవుతోంది. ఇప్పటికే ఆయా జిల్లాల నేతలకు సంకేతాలు ఇచ్చింది.

అభ్యర్ధి ఎంపికపై కొనసాగుతున్న కసరత్తు
సిట్టింగ్ స్థానంలో సాగర్‌లో పార్టీ అభ్యర్ధిగా ఎవరిని ఎంపిక చేయాలన్న అంశంపై సిఎం కెసిఆర్ లోతుగా సమీక్షిస్తున్నారు. ఆ నియోజకవర్గం శాసనసభ్యుడిగా కొనసాగిన నోముల నర్సింహయ్య కొద్ది రోజుల క్రితం చనపోవడంతో ఉపఎన్నికల అనివార్యంగా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రజల్లో సానుభూతి ఉన్న నోముల కుటుంబం నుంచే అభ్యర్ధినే ఎంపిక చేయాలా? లేక? మరొ కొత్త అభ్యర్ధిని బరిలోకి దింపడమా? తదితర అంశాలపై జిల్లాకు చెందిన పార్టీ నేతల అభిప్రాయాలను సిఎం కెసిఆర్ ఎప్పుడుకప్పుడు తెలుసుకుంటున్నారు. మరోవైపు ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి నివేదికలను తెప్పించుకుంటున్నారు. నియోజకవర్గంలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా ప్రచారం చేస్తున్న కె. జానారెడ్డి ప్రభావం ఏ మేరకు ఉంది? బిజెపి నుంచి బరిలోకి దిగనున్న అభ్యర్ధి ఎవరూ? ప్రధాన ప్రతిపక్షాల నుంచి కాకుండా స్వతంత్య్ర అభ్యర్ధులుగా బలమైన నేతలు ఎవరైనా బరిలోకి దిగుతున్నారా? అన్న విషయాలను కూడా సిఎం కెసిఆర్ ఆరా తీస్తున్నట్లుగా తెలుస్తోంది. మరో రెండు, మూడు రోజుల్లో అసెంబ్లీ సమావేశాలు పూర్తి అయిన వెంటనే సిఎం కెసిఆర్ పూర్తి స్థాయిలో సాగర్ ఉప ఎన్నికపై దృష్టి సారించే అవకాశముందని తెలుస్తోంది. అభ్యర్ధి ఎంపికను సైతం ఒకటి, రెండు రోజులలో అధికారకంగా ప్రకటన చేసే అవకాశముందని పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది.

TRS to ready for Nagarjuna Sagar by-election

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News