Sunday, April 28, 2024

ట్రంప్ బెదిరింపులు

- Advertisement -
- Advertisement -

Trump threat in presidential election

 

త్వరలో (నవంబర్ 3) జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఎప్పటికంటే ఎక్కువగా ప్రపంచ వ్యాప్తంగా అమిత ఉత్కంఠను రేపుతున్నాయి. అత్యంత వివాదాస్పదుడనిపించుకున్న ప్రస్తుత అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మళ్లీ ఎన్నికవుతాడా, ఓడిపోతాడా అనే ప్రశ్న ఈ సారి ఈ ఎన్నికలను ఆసక్తికరం చేస్తున్నది. గత అధ్యక్ష ఎన్నికల్లో హిల్లరీ క్లింటన్ గెలిచేశారనిపించిన తరుణంలో ఎలెక్టోరల్ ఓట్ల మెజారిటీతో ట్రంప్ విజయ పతాకం ఎగురవేశాడు. తెల్లజాతి ఓటర్లలోని తీవ్ర జాతీయవాదుల మద్దతుతో గెలుపొందాడు. కరోనాకు ముందు వరకు ఆయనకే అనుకూలంగా ఉందనిపించిన ఎన్నికల వాతావరణం ఇప్పుడు కనుమరుగవుతున్నట్టు కనిపిస్తున్నది. ట్రంప్ మాటల్లో కూడా ఓటమి భయం ధ్వనిస్తున్నది. ఎన్నికలకు ముందు ప్రధాన అధ్యక్ష అభ్యర్థులిద్దరి మధ్య జరిగే ముఖాముఖి చర్చకు విశేష ప్రాధాన్యముంటుంది. గత మంగళవారం నాడు రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్, డెమొక్రాటిక్ పార్టీకి చెందిన జోసెఫ్ ఆర్ బిడెన్ మధ్య జరిగిన తొలి ముఖాముఖి అత్యంత నిరాశాజనకంగానూ, జుగుప్సాకరంగానూ ముగిసింది.

అందుకు ట్రంప్ ప్రేలాపనలు, నియమ విరుద్ధ ప్రవర్తనే కారణమని చెప్పక తప్పదు. ప్రత్యర్థికి మారు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా సాగిన ట్రంప్ వైఖరి ఎంతో అసంతృప్తిని, విస్మయాన్ని కలిగించింది. ఆంతరంగికంగా ప్రజాస్వామ్య విలువలకు, సంప్రదాయాలకు ప్రాధాన్యమిచ్చే దేశంగా అమెరికాకున్న పేరును ఈ ఘట్టం చెరిపి వేసిందనే అభిప్రాయం కలిగింది. దేశ భవిష్యత్తుకి సంబంధించిన వివిధ అంశాలపై పరస్పరం తమ వైఖరులను, విధానాలను వివరించడానికి బదులు ఆగ్రహావేశాలు చోటు చేసుకున్నాయి. ఎన్నికలు సవ్యంగా జరగకపోతే ఖబడ్దార్ అంటూ హెచ్చరించిన ట్రంప్ తపాలా బాలట్ విధానాన్ని తీవ్రంగా తప్పుపట్టాడు. తాను గెలువకపోతే తన తరపున శ్వేత జాతి హింసోన్మాద ముఠాలు రంగ ప్రవేశం చేయగలవని, జాతి ఘర్షణలు చోటు చేసుకోగలవని హెచ్చరించాడు. పోలింగ్ జరిగే చోట్లకు వెళ్లాలని తన మద్దతుదార్లకు పిలుపు ఇచ్చాడు. ఒక విధంగా ఓటర్లను భయపెట్టడానికి తెగించాడు.

ఓడిపోతానని తెలిసిన ఆటగాడు ఆటను చిందరవందర చేసిన చందం ట్రంప్‌లో కనిపించింది. ఎన్నికల ఫలితం తనకు వ్యతిరేకంగా ఉంటే దానిని అంగీకరించబోనని అధ్యక్ష స్థానంలో ఉన్న వ్యక్తి బెదిరించడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తానని చెప్పడమే కదా! శ్వేత జాతి టెర్రరిస్టు ముఠాలను మీరు వ్యతిరేకిస్తారా లేదా అన్న ప్రశ్నకు ట్రంప్ సమాధానం దారుణంగా ఉంది. యాంటిఫా వంటి ఫాసిస్టు వ్యతిరేక వామపక్ష గ్రూపులను విమర్శించిన ట్రంప్ తనకు అనుకూలంగా ఉన్న శ్వేత జాతి ముఠా ‘ప్రైడ్ బాయిస్’ ను మెచ్చుకున్నాడు. వారు తనకు అండగా ఉంటారన్నట్టు మాట్లాడాడు. ట్రంప్ నోట తమపై ప్రశంసలు కురవడంతో ఈ ముఠా ఉబ్బితబ్బిబ్బు అయిపోయింది. ఎలాగైనా అధికారాన్ని తిరిగి కైవసం చేసుకోవాలనే దృష్టితో ట్రంప్ ఇప్పటికే అనేక అపసవ్య చర్యలు, అమెరికా ప్రాణప్రదంగా భావించే విలువలకు విరుద్ధమైన నిర్ణయాలు తీసుకున్నాడు. విదేశీ విద్యార్థుల పైనా, ఉద్యోగుల మీద పలు ఆంక్షలు విధించాడే.

హెచ్1బి వీసాలపై తాత్కాలిక నిషేధం ప్రకటించాడు. గురువారం నాడు దానిని న్యాయస్థానం కొట్టివేసింది. అలా నిషేధం విధించే అధికారం ట్రంప్‌కి లేదని స్పష్టం చేసింది. ఒక శ్వేత జాతి పోలీసు అధికారి నల్లజాతీయుడిని మెడ మీద బూటు కాలితో తొక్కి ఊపిరాడకుండా చేసి హతమారిస్తే దేశాధ్యక్షుడుగా దానిని ఖండించని కఠినత్వాన్ని ట్రంప్ ప్రదర్శించాడు. నిరసన వెల్లువైన నల్ల జాతీయులను దూషించాడు. అమెరికాలో ఉన్న బహుళ జాతి ప్రజాస్వామ్యం పరువు తీశాడు. కరోనా అరికట్టడంలో తన ఘోర వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోడానికి చైనా మీదా, ప్రపంచ ఆరోగ్య సంస్థ పైనా విరుచుకుపడ్డాడు. తిరిగి ఎన్నిక కావడానికి వీలుగా అమెరికన్లను విశేషంగా ఆకట్టుకోడం కోసం ట్రంప్ ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నప్పటికీ కరోనా విషయంలో ఆయన కళ్లు తేలవేయడంతో పరిస్థితి ఆయనకు ప్రతికూలంగా మారినట్టు స్పష్టపడుతున్నది. ఈ విషయాన్ని గమనించిన అధ్యక్షుడు కల్లు తాగి నిప్పు తొక్కిన కోతిలా తయారయ్యాడనడం అసత్యం కాబోదు.

దానిని ఈ చర్చ ఎటువంటి దాపరికం లేకుండా ప్రతిబింబించింది. ఇక ముందు జరగబోయే చర్చలు ఇంకెంత జుగుప్సాకరంగా ఉంటాయోననే భయాన్ని కలిగించింది. తనను గెలిపించకపోతే ప్రళయమే విరుచుకుపడుతుందనే రీతిలో ఓటర్లను భయపెడుతున్న ట్రంప్ ఎన్నికల్లో ఎటువంటి ఫలితాన్ని చవిచూస్తాడు, అమెరికన్లు ప్రపంచ సమాజంలో అంతర్భాగంగా ఉంటూ దానికి చోదక శక్తిగా వ్యవహరించే దేశాన్ని కోరుకుంటారో, ట్రంప్ వేసిన ఒంటెత్తు విధానాల బాట వైపు మొగ్గుతారో వేచి చూడాలి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News