కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీపై దాఖలైన పరువునష్టం కేసు విచారణలో సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్యలు భావవ్యక్తీకరణ స్వేచ్ఛ ప్రమాణాలకు, రాజకీయ చర్చలకు రాజ్యాంగం కల్పించే రక్షణకు ఇబ్బందికరమైన మార్పును సూచించాయి. 2020లో జరిగిన గల్వాన్ సంఘర్షణలపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ప్రొసీడింగ్స్‌పై జస్టిస్ దీపాంకర్ దత్తా నేతృత్వంలోని ధర్మాసనం స్టే విధించింది. ఈ సందర్భంగా సమస్యాత్మకమైన మౌఖిక వ్యాఖ్యలు చేసింది. రాహుల్ నిజమైన భారతీయుడై ఉంటే అలాంటి వ్యాఖ్యలు చేసి ఉండరని జస్టిస్ దీపాంకర్ వ్యాఖ్యానించడం విమర్శలకు దారి తీసింది. భారత్ జోడో యాత్ర సందర్భంగా 2022 డిసెంబర్ 16న సరిహద్దులో చైనాతో భారత్ సంఘర్షణలపై మీడియా వర్గాలు రాహుల్‌ను ప్రశ్నించగా, 2000 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని చైనా ఆక్రమించుకుందని, అయినా మోడీ ప్రభుత్వం కిమ్మనడం లేదని రాహుల్ సమాధానం ఇచ్చారు.
ఇందులో భారత సైన్యాన్ని అవమానించే ప్రస్తావనే లేకపోయినా, శ్రీవాస్తవ అనే వ్యక్తి 2023 ఆగస్టులో లక్నో మెజిస్ట్రేట్ కోర్టులో పరువునష్టం (Defamation court) పిటిషన్‌ను దాఖలు చేశారు. ఫిబ్రవరిలో ఆ కోర్టు సమన్లు జారీ చేయగా, స్టే కోరుతూ రాహుల్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ కేసు విచారణను జస్టిస్ దీపాకంర్ దత్తా నేతృత్వంలోని ధర్మాసనం చేపట్టింది. కోర్టులు తమ ముందున్న వ్యాజ్యాలపై విచారించేటప్పుడు జాతీయ విధేయతా ప్రమాణాలను నిర్దేశించడానికి బదులు, చట్టపరమైన, రాజ్యాంగపరమైన అంశాలను విశ్లేషిస్తూ తీర్పులు ఇవ్వడం ప్రధాన విధి. ప్రజాస్వామ్యంలో సత్యవాదనతో ప్రశ్నిస్తూ ప్రభుత్వాన్ని జవాబుదారీ చేసేవాడే నిజమైన భారతీయుడు కానీ, కేవలం అధికారిక కథనాలను అంగీకరిస్తూ ప్రశ్నించలేనివాడు కాదు. రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యానం పరిశీలిస్తే ఆయన ప్రభుత్వ సరిహద్దు విధానాలను ప్రశ్నించారు.
చైనీయుల చొరబాట్లను బయటపెట్టే విశ్వసనీయమైన నివేదికలపై దృష్టిని కేంద్రీకరింప చేశారు. ఇదంతా ప్రతిపక్ష రాజకీయాల చట్టబద్ధమైన పరిధిలోనే ఉంది. ఈ విమర్శలు దేశాన్ని అణగదొక్కడానికి చేశారన్న దృష్టితో చూడకూడదు. ఇటువంటి విమర్శలు భావస్వేచ్ఛ పరిరక్షణ కిందకు వస్తాయి. ఆరోగ్యకరమైన ప్రజాచర్చలకు ఈ విమర్శలు తప్పనిసరి. కోర్టు వ్యాఖ్యలను పరిశీలిస్తే చట్టబద్ధమైన అసమ్మతిపై నీళ్లు జల్లే ప్రమాదాన్ని సూచిస్తున్నాయి. ఇవి భవిష్యత్తులో ప్రతిపక్ష పార్టీల నడవడికకు ఒక విరుద్ధమైన ఉదాహరణగా నిల్చి ఉంటాయి. ఇక భారత భూభాగాన్ని చైనా ఆక్రమించడం, ఘర్షణలు గురించి ప్రజాసాక్షాలు, ప్రభుత్వ సమాచార ఆధారాలు లేకుండా రాహుల్ వ్యాఖ్యనించలేదు.
గల్వాన్ లోయలో ఘర్షణలు, వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి చైనా కొత్తగా చేపట్టిన కార్యకలాపాలు, తరువాత శాటిలైట్ చిత్రాలు, పార్లమెంట్‌లో చర్చలు, జర్నలిస్టుల నివేదికలు ధ్రువీకరించిన వాస్తవాలపైనే రాహుల్ వ్యాఖ్యానించారు. తూర్పు లడఖ్‌లో కొన్ని నిర్దిష్టమైన పెట్రోల్ పాయింట్లు వివిధ సమయాల్లో కోల్పోయినట్టు పార్లమెంటరీ కమిటీ కూడా ధ్రువీకరించింది. మిలిటరీ అధికార వర్గాలు, స్వతంత్ర సంస్థల విశ్లేషణలు కూడా ధ్రువీకరిస్తున్నాయి. సరిహద్దుల్లో చైనా అతిక్రమణలు విస్తరించడం కొనసాగుతూనే ఉంది. లడఖ్‌లోని గల్వాన్, డెప్సాంగ్ ప్రాంతాల్లో పెట్రోలింగ్ హక్కులు కోల్పోవడం కూడా జరిగింది. పశువులను మేతకోసం పచ్చికబయళ్ల వద్దకు కూడా వెళ్లలేకపోతున్నట్టు సరిహద్దుల్లోని స్థానికులు చెబుతున్నారు. 2000 చదరపు కిలోమీటర్ల భారత భూభాగాన్ని కోల్పోయినట్టు రాహుల్ ఆరోపించడం వెనుక వాస్తవాధీన నియంత్రణ రేఖ వెంబడి చైనా దురాక్రమణలను పరిశీలించిన స్వతంత్ర రక్షణ రంగ నిపుణుల నివేదికల ఆధారం ఉంది.
రాహుల్ గాంధీ ఆవేదన చెందడానికి కారణం భారతదేశ సరిహద్దుల వాస్తవ పరిస్థితిని ప్రతికూలంగా చైనా మార్చి వేస్తుండటమే. కానీ ప్రభుత్వ బహిరంగ ప్రకటనలకు ప్రజాసాక్షాల క్షేత్రస్థాయి వాస్తవాలకు ఎక్కడా పొంతన ఉండడం లేదు. ఈ పరిస్థితుల్లో కోర్టు నైతికపరమైన లేదా దేశభక్తి ప్రేరేపిత తీర్పులు ఇవ్వడానికి మొగ్గుచూపకుండా వాస్తవ పరిస్థితుల ఆధారంగా నిష్పాక్షిక తీర్పులు ఇవ్వడానికి తమ శక్తిని వినియోగించవలసిన అవసరం ఉంది. ఈ ధర్మాన్ని అనుసరించడం ద్వారా మాత్రమే కోర్టులు తమ చట్టబద్ధతను బలోపేతం చేసుకోగలుగుతాయి. అలాగే సత్యవాదనలతో కూడిన స్వేచ్ఛాయుత, బహిరంగ చర్చలకు రక్షణ ఇవ్వగలుగుతాయి. ఇదిలా ఉండగా రాహుల్ గాంధీకి సుప్రీం కోర్టు మందలించడం బిజెపి వర్గాలకు, మోడీ ప్రభుత్వ యంత్రాంగానికి చాలా సంతోషంగా ఉంది. మంగళవారం ఎన్‌డిఎ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ రాహుల్‌పై తన అక్కసు వెళ్లగక్కుకున్నారు.
దేశ సార్వభౌమత్వం, రక్షణల గురించి చిన్నపిల్లాడిలా, నిరాధారంగా వ్యాఖ్యలు చేసే నేతకు సుప్రీం కోర్టు తగిన పాఠం చెప్పిందని పరోక్షంగా రాహుల్‌ను ఎద్దేవా చేశారు. సిందూర్ ఆపరేషన్‌లో భారత్ యుద్ధ విమానాలు కూలిపోయాయని, 20 మంది సైనికులు మృతి చెందారని వార్తలు ప్రచారం అవుతుండగా, దీనిపై కాంగ్రెస్‌తో సహా విపక్షాలు వివరణ కోరినా ప్రభుత్వ సమాధానం చెప్పడం లేదు. సిందూర్ ఆపరేషన్ లక్షాలను ఘనంగా సాధించామని పదేపదే గొప్పలు చెప్పుకోవడంతోనే సరిపోతోంది. ఈ ఆపరేషన్‌లో కష్టనష్టాలు రక్షణ వ్యవహారాల్లో సర్వసాధారణమే అని ప్రభుత్వం సమర్ధించుకుంటోంది. అసలు లోక్‌సభ సమావేశాల్లో విపక్ష నాయకుడు రాహుల్‌కు మాట్లాడడానికి అవకాశమే ఇవ్వడం లేదు. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో ఎవరైనా పార్లమెంట్ బయట తమ ఆవేదనను వెల్లడించడం తప్పు ఎలా అవుతుంది? ఈ పరిస్థితిని సుప్రీం కోర్టు జస్టిస్‌లు కూడా తెలుసుకోవాలని విపక్షాలు సూచిస్తున్నాయి.