Wednesday, December 6, 2023

భవన నిర్మాణాలకు టిఎస్ బిపాస్

- Advertisement -
- Advertisement -

TS B pass

 

మరి 20 ఏళ్లు ఇదే వేగంతో హైదరాబాద్ అభివృద్ధి

రూపాయి లంచం లేకుండా సులభంగా అనుమతులు
దేశానికే ఆదర్శం కానున్న కొత్త విధానం త్వరలో…
130 నగరాలను వెనక్కి నెట్టి అగ్రస్థానంలో హైదరాబాద్
రాష్ట్రంలో సుస్థిర రాజకీయ వ్యవస్థ
రియల్ పై కెసిఆర్‌కు ప్రత్యేక శ్రద్ధ
ఉప్పల్, నాగోల్‌లో 20 లక్షల ఆఫీస్ స్పేస్ దరఖాస్తులు
కొంపల్లి, పేట్ బషీరాబాద్‌లో కొత్త ఐటి కంపెనీలు
నిర్మాణాల్లో సృజన ఉండాలి
క్రెడాయ్ హైదరాబాద్ దేశానికే ఆదర్శంగా నిలవాలి
ప్రాపర్టీ షో 2020 ప్రారంభిస్తూ మంత్రి కెటిఆర్

హైదరాబాద్ : టిఎస్ ఐపాస్ లాగే భవన నిర్మాణ అనుమతుల కోసం త్వరలోనే టిఎస్ బిపాస్‌ను తీసుకురానున్నట్లు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ తెలిపారు. మాదాపూర్ హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో క్రెడాయ్ హైదరాబాద్ ప్రాపర్టీ షో 2020ను మంత్రి కెటిఆర్ శుక్రవారం ప్రారంభించారు. అనంతరం కెటిఆర్ మాట్లాడుతూ టిఎస్ ఐపాస్ దేశంలోనే గొప్ప పాలసీ అని, ఇతర రాష్ట్రాలు కూడా ఈ పాలసీని అవలంభిస్తున్నాయన్నారు. బిల్డింగ్ నిర్మాణంలో రూపాయి లంచం లేకుండా నిర్మించుకునేలా టిఎస్ బిపాస్ సిస్టం త్వరలో తీసుకొస్తామని ఇది రానున్న రోజుల్లో దేశంలోనే ఆదర్శం కానుందని ఆయన పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా పలు చోట్ల అస్థిరత ఉన్నా తెలంగాణలో స్థిరమైన రాజకీయ వ్యవస్థ ఉందన్నారు. సిఎం కెసిఆర్‌కు రియల్ రంగంపై ప్రత్యేక శ్రద్ధ ఉందని, అందుకే నాలుగేళ్ల క్రితమే బిల్డర్ల సమస్యలన్నీ ఆయన పరిష్కరించారన్నారు. అందులో భాగంగానే సిఎం నాలుగేళ్ల కింద బిల్డర్లు అడిగిన సమస్యలపై వెంటనే జీఓలను జారీ చేసి సమస్యల పరిష్కారానికి కృషి చేశారన్నారు.

జూన్‌లో టి హబ్ పేజ్ 2 ప్రారంభం
కార్యదక్షత, సమర్థత, విజన్ ఉన్న నాయకుడు సిఎం కెసిఆర్ మనకు లభించడం తెలంగాణ చేసుకున్న అదృష్టమన్నారు. సిఎం కెసిఆర్ కృషి వల్లే హైదరాబాద్‌కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభిస్తోందన్నారు. సిఎం కెసిఆర్ చేసిన అభివృద్ధితో తమకు పెద్దగా పనిలేదని, ప్రతిపక్షాలకు అసలే లేదన్నారు. 2014లో జేఎల్‌ఎల్ రేటింగ్స్‌లో హైదరాబాద్ టాప్-20లో లేదని, 2020 సంవత్సరంలో 130 నగరాలను వెనక్కి నెట్టి హైదరాబాద్ అగ్రస్థానంలో నిలిచిందన్నారు. క్వాలిటీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పెరగాలని మంత్రి సూచించారు. రాబోయే నాలుగేళ్లలో పురపాలక శాఖ మీదే దృష్టి పెడతామన్నారు. హైదరాబాద్‌లోనే కాకుండా రాష్ట్రంలోని ఇతర నగరాలపై నిర్మాణరంగ సంస్థలు దృష్టి పెట్టాలని ఆయన కోరారు.

మున్సిపాలిటీలకు పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. మౌలిక వసతుల కోసం రూ.2,500 కోట్లు మంజూరు చేసినట్లు ఆయన వెల్లడించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని ఇతర నగరాల్లోనూ పెట్టుబడులు పెట్టాలని ఆయన రియల్టర్లకు సూచించారు. ఉప్పల్, నాగోల్‌లో కొన్ని పెద్ద కంపెనీలు 20 లక్షల ఆఫీసు స్పెస్ కోసం దరఖాస్తు చేసుకున్నాయన్నారు. సౌత్‌లో చైనాకు చెందిన పెద్ద కంపెనీ రాబోతుందని, కొంపల్లి, పేట్ బషీరాబాద్‌లో ఐటి కంపెనీలు రాబోతున్నాయని ఆయన పేర్కొన్నారు. రాబోయే మూడు నెలల్లో ఇవి ఆచరణలోకి వస్తాయన్నారు. 2020 తెలంగాణ కు చాలా ముఖ్యమైన సంవత్సరమని, టి హబ్ పేజ్ 2ను జూన్‌లో ప్రారంభిస్తామన్నారు.

నాగోల్ నుంచి శంషాబాద్ వరకు మెట్రో విస్తరణ
మెట్రో లైన్‌ను నాగోల్ నుంచి శంషాబాద్ వరకు విస్తరించనున్నట్లు మంత్రి కెటిఆర్ తెలిపారు. వారం రోజుల్లో మెట్రో మరో కారిడార్ ప్రారంభించబోతున్నట్లు ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్ ప్రధాన రోడ్ల నిర్వహణ బాధ్యతను ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించనున్నట్లు ఆయన వెల్లడించారు. ఫార్మాసిటీని కూడా ఈ సంవత్సరమే ప్రారంభిస్తామన్నారు. హైదరా బాద్ నిర్మాణరంగంలో లక్షలాది మంది ఉపాధి పొందుతున్నారని, భవన నిర్మాణ రంగంలో కూలీలు సగానికిపైగా ఇతర రాష్ట్రాల వారే ఉన్నారని ఆయన తెలిపారు. రాష్ట్రంలో స్థిరాస్థి రంగానికి ఎలాంటి ఢోకా లేదన్నారు. ఓఆర్‌ఆర్ చుట్టూ మరిన్ని పరిశ్రమలు రాబోతున్నాయని, మరో 20 ఏళ్ల పాటు హైదరాబాద్ వృద్ధి ఇదే వేగంతో కొనసాగనున్నట్లు ఆయన తెలిపారు. హైదరాబాద్‌లో శుద్ధి చేసిన నీటిని భవన నిర్మాణంలో ఉపయోగించాలన్నారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా 41 శాతం మురుగునీటిని శుద్ధి చేస్తున్నామని, మరో 400 ఎంఎల్‌డి నీటిని శుద్ధి చేసి నిర్మాణ రంగానికి ఉపయోగపడేలా చూస్తామన్నారు.

పార్కింగ్ సమస్యను అధిగమించేందుకు కొత్త పాలసీ
పార్కింగ్ సమస్యను అధిగమించేందుకు కొత్త పాలసీని తీసుకురావాలని యోచిస్తున్నామని అందులో భాగంగా అడిషనల్ గా ఒక ప్లోర్‌కు అనుమతివ్వాలని ఆలోచన చేస్తున్నామన్నారు. హైదరాబాద్ లో కొత్తగా కొన్ని కార్యక్రమాలు తీసుకొస్తున్నా మని అందులో భాగంగానే అండర్ బ్రిడ్జి, ప్లై ఓవర్లు, దుర్గం చెరువు వంటివి చేపడుతున్నామన్నారు. పశ్చిమ హైదరా బాద్‌లో నిర్మాణాలు చేస్తున్న బిల్డర్లు నిర్మాణ ప్రాంతాల్లో దుమ్ము, దూళి లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, బిల్డర్లు స్వీయనియంత్రణ పాటించాలని కెటిఆర్ సూచించారు. భవన నిర్మాణంలో సృజనాత్మకత ఉండాలని, కాలుష్యం లేకుండా నిర్మాణంలో నూతన టెక్నాలజీ ఉపయోగించాలని మంత్రి పేర్కొన్నారు. క్రెడాయ్ హైదరాబాద్ దేశానికే ఆదర్శంగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణ లో భవన నిర్మాణ అనుమతుల్లో అవినీతి లేకుండా ఇచ్చే బాధ్యత మున్సిపల్ మంత్రిగా తనపై బాధ్యత ఉందని, క్రెడాయ్‌కి ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా సాయం అందిస్తామని ఆయన పేర్కొన్నారు.

రియల్ వ్యాపారులు సిఎస్‌ఆర్‌లో భాగస్వాములు కావాలి: మంత్రి శ్రీనివాస్‌గౌడ్
మంత్రి, శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ రియల్ ఎస్టేట్ వ్యాపారులు సిఎస్‌ఆర్‌లో భాగస్వామ్యం కావాలని,
అవకాశం ఉన్న ప్రతి చోట అభివృద్ధికి సహకరించాలని ఆయన సూచించారు. కొన్ని ప్రాజెక్టులు, స్టేడియంల వద్ద, టూరిజం స్పాట్ లీక్‌ల వద్ద, డెవలప్ మెంట్ కార్యక్రమాల్లో రియల్ వ్యాపారులు పాల్గొనాలని ఆయన సూచించారు. తెలంగాణలో రియల్ ఎస్టేట్ రంగం ఎప్పుడూ నష్టాల్లో లేదన్నారు. దేశం మొత్తం ఆర్థిక మాంద్యంతో సతమతమవుతున్నా హైదరాబాద్ మాత్రం రియాల్టీ రంగంలో దూసుకెళుతోందన్నారు.

రాష్ట్రం ఏర్పడిన తర్వాత అభివృద్ధి ఊహకు అందని రీతిలో జరుగు తోందన్నారు. వాటర్, కరెంట్‌ను 24 గంటలు అందుబాటులోకి తెచ్చిన ఘనత సిఎం కెసిఆర్‌కే దక్కుతుందన్నారు. మరో 20 ఏళ్లు సిఎం కెసిఆర్, కెటిఆర్‌లు అధికారంలో ఉంటారన్నారు. నిరంతరం ఈ ప్రాంత అభివృద్ధి, ప్రజల సంక్షేమం గురించి వారిద్దరు ఆలోచిస్తారన్నారు. కెటిఆర్ పనితీరు వల్లే 110 మున్సిపాలిటీలను కైవసం చేసుకున్నామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. రియల్ వ్యాపారులు తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని, బ్రోచర్లలో ప్రభుత్వ విధానాలను పేర్కొనాలని ఆయన సూచించారు. భారతదేశం కూడా చైనా మాదిరిగా గొప్పగా అభివృద్ధి సాధించాలన్న ఆలోచన కెసిఆర్ ఉందని మంత్రి పేర్కొన్నారు.

బడ్జెట్ ఆధారంగా కీలక విధాన సూచికలపై విశ్లేషణ: పి.రామకృష్ణారావు
క్రెడాయ్ హైదరాబాద్ అధ్యక్షుడు పి.రామకృష్ణారావు మాట్లాడుతూ జనవరి 31 నుంచి ఫిబ్రవరి 2వరకు ఈ ప్రాపర్టీ షో జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ షోలో రూ.45 లక్షల నుంచి రూ.5 కోట్ల వరకు ధరలు పలికే ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్‌లు, అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లు, గేటెడ్ కమ్యూనిటీలు, విల్లాలు, రిటైల్, కమర్షియల్ కాంప్లెక్స్‌పై ప్రత్యేక శ్రద్ధ కలిగిన గ్రీన్‌బిల్డింగ్‌లను ప్రదర్శించనున్నట్టు ఆయన తెలిపారు. ఈ షోలో 15 వేలకు పైగా యూనిట్లను క్రెడాయ్ హైదరా బాద్ సభ్యులు, డెవలపర్లు, ఫైనాన్షియల్, తయారీ రంగాలకు చెందిన విభిన్నమైన స్టేక్‌హోల్డర్లు 80కి పైగా స్టాల్స్‌లో ప్రదర్శించనున్నట్టు ఆయన తెలిపారు. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థికమంత్రి పార్లమెంట్ వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ప్రత్యేక సదస్సును నిర్వహిస్తున్నట్టు ఆయన తెలిపారు. బడ్జెట్ ఆధారంగా కీలక విధాన సూచికలను విశ్లేషించడంతో పాటు రియల్‌రంగం, గృహ కొనుగోలుదారులు, మొత్తంమీద ఆర్థిక వ్యవస్థ దాని ప్రభావం తదితర అంశాలపై చర్చా కార్యక్రమాలను నిర్వహిస్తామని ఆయన తెలిపారు.

ఇప్పటివరకు పశ్చిమ భాగాన 85 శాతం వృద్ధి జరిగిందని, అయితే ముందుచూపున్న తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు గ్రిడ్‌పాలసీతో వచ్చేందుకు ప్రణాళిక చేస్తోందని, తద్వారా నగరంపై ఒత్తిడి తగ్గించి అన్నివైపులా అభివృద్ధిని ప్రోత్సహించనున్నట్టు ఆయన తెలిపారు. తాజా ఎడిషన్ ప్రాపర్టీ షోలో తూర్పు హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ అవకాశాలను అన్వేషించడంపై దృష్టి సారించామన్నారు. దీనికి అపూర్వ స్పందన రావడంతో పాటుగా పెద్ద సంఖ్యలో స్పాట్ రిజిస్ట్రేషన్లు జరిగాయన్నారు. వి.రాజశేఖర్ రెడ్డి, జనరల్ సెక్రటరీ మాట్లాడుతూ సుప్రసిద్ద అంతర్జాతీయ సంస్థలు హైదరాబాద్‌ను అతి పెద్ద కేంద్రంగా మలుచుకుంటున్నాయన్నారు. ఈ నగరంలో కో వర్కింగ్ విభాగంలో గణనీయంగా కార్యకలాపాలు జరుగుతున్నాయన్నారు. ప్రముఖ అధ్యయన సంస్థల అంచనా ప్రకారం నగరంలో వాణిజ్య ప్రదేశాలను లీజు తీసుకోవడం రెట్టింపు అయ్యిందన్నారు. ఈ ప్రాపర్టీ షోలో ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, మేయర్ బొంతు రామ్మోహన్, సిజి మురళీమోహన్, కచం రాజేశ్వర్, వేణు వినోద్, జైదీప్‌రెడ్డి, కొత్తపల్లి రాంబాబు, శివరాజ్ ఠాకూర్, ఆదిత్య గౌర, గుమ్మి రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

TS B pass for building construction permits
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News